Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 77

   

         ఈ విషయం కూడా జె.జె.కి చేరవేయబడింది. ఆయన తరువాత కంటిన్యుటీ బ్రేక్ చేయబడుతుందేమోనని భయపడిన జె.జె. ఆరోజు పొందిన ఆనందం అంతా ఇంతా కాదు.
   
                              *    *    *    *    *
   
    ఎమ్.ఎమ్.ఆఫీసులో భార్గవ గదిలో ఇప్పుడు మౌనిక, భార్గవ, మీడియా ఎగ్జిక్యూటివ్ కూర్చుని ఓ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు.
   
    "సిటీ బస్సులో, డిస్ట్రిక్టు బస్సులో, పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్స్ కి పబ్లిసిటీ ఇవ్వగూడదన్నది గవర్నమెంట్ పోలసి కనుక సిగరెట్ కంపెనీల పబ్లిసిటీ మీద ఆశవదులుకోవటమే. అంతకంటే చేయగలిగింది లేదు" మీడియా ఎగ్జిక్యూటివ్ ఒకింత నిరాశగా అన్నాడు.
   
    మౌనికకు, భార్గవకు కూడా అలాగే అనిపించింది.
   
    అంతకుముందే చార్మినార్ సిగరెట్స్ కంపెనీనుంచి ఎమ్.ఎమ్.కి ఓ ఆఫర్ వచ్చింది.
   
    గవర్నమెంట్ పోలసి ప్రకారం సిగరెట్స్ కి పబ్లిసిటీ ఇవ్వకూడదన్నప్పటికీ, మరో విధంగా పబ్లిసిటీ ఇవ్వగలిగితే లక్షల్లో ఇస్తామని, కమీషన్ పర్సంటేజ్ పెంచుతామని, ఆ ఆఫర్ ద్వారా తెలియజేయటం జరిగింది.
   
    "చాలా ఏడ్ ఏజన్సీలు చార్మ్స్ విషయంలో తమ అసక్తతను వెలిబుచ్చగా, ఆఖరిగా మన దగ్గరకు వచ్చారు. చార్మినార్ సిగరెట్స్ కంపెనీ సాధారణమైన కంపెనీ కాదు, ఇండియన్ టుబాకో కార్పొరేషన్ తర్వాత ఇండియాలో అదే పెద్ద కంపెనీ- సిగరెట్స్ ఉత్పత్తి మనకు లక్షల్లో లాభం మిగులుతుంది" మౌనిక ఆ ఆఫర్ ని వదులుకునేందుకు సిద్దంగా లేదు. అలా అని ఏం చేయాలో కూడా ఆమెకి అర్ధంకావటం లేదు.
   
    "నిజమే కాని ఏం చేయగలం....?" భార్గావకి కూడా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేక పోతున్నందుకు బాధగానే వుంది. వాళ్ళు ఆ విషయమై బుర్రలు బద్దలు చేసుకోబట్టి అప్పటికి మూడు గంటలయింది.
   
    అంతలో అటెండర్ వచ్చి "అయ్యగారు వచ్చారు. మిమ్మల్ని రమ్మంటున్నారు" అని అనటంతో భార్గవ, మౌనిక ఆ విషయాన్ని అక్కడితో క్లోజ్ చేసి మాధుర్ రూమ్ కేసి నడిచారు.
   
    "ఎంత యాదృచ్చికమో చూశారా? మనం సరదాగా అనుకున్న స్కీమ్ ని జె.జె. ఎంపైర్ లో ఇటీవలే ప్రవేశపెట్టారట" మాధుర్ మాటలకి మౌనిక ఉలిక్కిపడితే, భార్గవ ఏమిటన్నట్లుగా చూశాడు.
   
    "వర్క్ మోర్ గొ ఎబ్రాడ్ స్కీమ్" మాధుర్ తిరిగి అన్నాడు.
   
    "వాళ్ళు పెట్టుకుంటే మనకేమిటిగాని మనకో జాక్ పాట్ వచ్చేలా వుంది. కాని దాన్నెలా చేయాలో నాకు అర్ధంకావటంలేదు..." అంది మౌనిక.
   
    మాధుర్ ఆలోచనల్ని దారి మళ్ళించటంకోసమే ఆమె ఆ ప్రస్తావన తీసుకొచ్చింది.
   
    "ఏమిటది?" మాధుర్ ప్రశ్నించాడు.
   
    ప్రస్తుతం అతనెంత ఏంబీషియన్ గా వున్నాడంటే- చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా ఉపయోగించుకుని ఎమ్.ఎమ్.ని జాతీయ స్థాయిలో నెంబర్ ఒన్ ఏడ్ ఏజెన్సీని చేయాలన్నంత పట్టుదలగా.
   
    "పబ్లిక్ ప్లేస్ లో సిగరెట్ కంపెనీల ఏడ్స్ ఇవ్వగూడదనే నిబంధన విధించిందట గవర్నమెంట్. అప్పుడు సయితం పబ్లిసిటీ యివ్వాలని చార్మినార్ కంపెనీ పట్టుదలగా వుంది. కాని ఏడ్ ఏజన్సీలు దాన్నెలా అమలుపర్చారో తెలీక తమ అశక్తతను తెలియపర్చాయట. చివరగా మన దగ్గరికి వచ్చారు. మనకీ దారి కనిపించటం లేదు" అంది మౌనిక నిరాశగా.
   
    "ఆ నిబంధన విధించింది ఎవరూ?" మాధుర్ ఆలోచనలు వేగాన్ని పుంజుకుంటున్నాయి క్రమంగా.
   
    "గవర్నమెంట్."
   
    "గవర్నమెంట్ అయి వుండదు. హెల్త్ డిపార్ట్ మెంట్, గవర్నమెంట్ కీ సలహా యిచ్చి వుంటుంది."
   
    "అవును సార్! సెంట్రల్ హెల్త్ డిపార్టుమెంట్ రికమెండ్ చేసిందట" అప్పుడే లోపలకు వచ్చిన మీడియా ఎగ్జిక్యూటివ్ అన్నాడు.   
    మాధుర్ కొద్ది క్షణాలు ఆలోచిస్తూండిపోయాడు.
   
    భార్గవ, మౌనిక, మీడియా ఎగ్జిక్యూటివ్ మౌనంగా వుండిపోయారు.
   
    రెండు నిముషాల మౌనం తర్వాత మాధుర్ నోరు విప్పాడు.
   
    "మనం చార్మ్స్ కేంపైన్ టేకప్ చేస్తున్నాం" అన్నాడు స్థిరంగా.
   
    ముగ్గురూ బిత్తరపోయారు.
   
    "ఎస్..... మనం చేస్తాం. చార్మ్స్  కంపెనీ ఖర్చుతో మనం హెల్త్ డిపార్టు మెంట్ సదుద్దేశాన్ని ప్రచారం చేద్దాం."
   
    ఆ ముగ్గురూ షాక్ తిన్నట్లుగా చూశారు. అర్ధంకాక తనవేపే చూస్తున్న ఆ ముగ్గుర్నీ చూసి మాధుర్ చిన్నగా నవ్వుతూ- "ఒక మంచిని ప్రచారం చేయటం అన్నది ప్రభుత్వమే చేయక్కర్లేదుగా? ప్రయివేట్ కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు ఎవరైనా చేయవచ్చు. దాన్ని ఏ ప్రభుత్వమైనా బ్యాన్ చేయలేదు. అవునా?" అప్పటికే కేంపైన్ మాధుర్ మెదడులో నిర్దుష్ట రూపాన్ని సంతరించుకుంది.
   
    "నిజమే బట్ మీరనేది నాకర్ధం కావటంలేదు" అన్నాడు భార్గవ ఇంకా ఆశ్చర్యపోతూనే.
   
    "DO NOT SMOKE EVEN IF IS CHARMS IN THE BUS."
   
    ముగ్గురూ ఒకేసారి విచిత్రమైన ఉద్వేగానికి గురయ్యారు.
   
    "ఎలా వుంది? ఇలా వెళదాం."
   
    అలాంటి అద్భుతమైన ఐడియాలు ఎలా పుట్టుకొస్తుంటాయి మాధుర్ మెదడులోంచి?
   
    సృజనాత్మకత అన్నది మాధుర్ ఆలోచనల్లో బందీ అయిపోయిందా?!
   
    దారే లేదనుకున్న సమస్యను ఎంత తేలిగ్గా, సుతారంగా పరిష్కరించాడు?! అసలితనికి అసాధ్యమనేది ఎదురు కాదా?
   
    NO ONE HAS GIVEN YOU AN SOLUTION? HAS IT EVER OCCURRED TO YOU TO CREATE SOLUTION FOR YOUR SELF!
   
    ఏ విధంగానూ చార్మినార్ కంపెనీ పబ్లిసిటీ చేయటం సాధ్యంకాదని కొద్దినిమిషాలక్రితమే డీలా పడిపోవటం జరిగింది. మరిప్పుడు మాధుర్ ని అభినందించాలా- మెచ్చుకోవాలా- పొగడాలా- ఏది చేయాలన్నా అతనా స్థాయిని ఎప్పుడో దాటిపోయినట్లు కనిపించడంతో ముగ్గురూ ఓ అద్భుతమైన వ్యక్తిని చూస్తున్న ఆనందోద్వేగానికి గురయి ఒకింత సేపు ఏమీ మాట్లాడలేకపోయారు.
   
                              *    *    *    *    *
   
    బి.పి.యల్ టీవీ భరద్వాజ, వీనస్ ల ఏడ్ ఏజెన్సీకి వెళ్ళిపోయిన వారానికి ఫస్ట్ ప్రింట్ ఏడ్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చింది.
   
    ఉదయం పేపరు రాగానే మౌనిక దాన్ని తీసుకుని పరుగెత్తుకుంటూ వెళ్ళి నిద్రపోతున్న మాధుర్ ని లేపి దాన్ని చూపించింది.
   
    ఆ ప్రింట్ ఏడ్ ని చూడగానే మాధుర్ నిద్రమత్తు వదలిపోయింది.
   
    టి.వి. న్యూస్ అనే ఓ పత్రిక ఇండియాలో వున్నట్లు, ఇండియాలో తయారయ్యే అన్ని టెలివిజన్స్ కన్నా బి.పి.ఎల్. టీవీ గొప్పదయినట్లు అన్ని టీవీలకన్నా బి.పి.ఎల్ ఎక్కువ అమ్ముడు పోతున్నట్లు  ఆ పత్రిక ఉటంకించినట్లు ఏడ్ పైభాగంలో చూపించటం జరిగింది.
   
                దానిక్రింద
    బి.పి.ఎల్.టి.వి  -        1,27,922(అమ్మిన టీవీల సంఖ్య)
    ఒనిడా      -        1,17,666      "
    డైనోరా      -        1,07,946      "
    క్రౌన్      -        77,484          "
    వెస్టన్      -        47,660          "
   
    విడియోకాన్-కరెక్టు ఫిగర్స్ అందలేదు. అని ఇచ్చి ఆ క్రింద-
   
    'బి.పి.ఎల్ గివ్స్ యూ ది ట్రూ పిక్చర్' అనే హెడ్డింగ్ ఇచ్చి బి.పి.ఎల్. విశేషాలు అందించటం జరిగింది.
   
    ప్రకటన అంతా ఒకటికి నాలుగుసార్లు చదివి చిన్నగా నవ్వుకున్నాడు మాధుర్.
   
    "ఈ ఏడ్ యిలాగే మార్కెట్ లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా బి.పి.ఎల్. సూపర్ క్లిక్ అవుతుంది. అన్ని టీవీలకన్నా మా టీవీ ఎక్కువ అమ్ముడుపోతోంది. మాది నిజంగా మంచిది కాకపోతే ఇంతగా అమ్ముడుబోతుందా అని వినియోగదారుల్ని ఈ ఏడ్ నిలదీసి, ఆపైన కొనిపిస్తుంది.
   
    ఇండియన్ కన్స్యూమర్స్ సైకాలజీ ఎలా వుంటుందంటే- మెజారిటీ వినియోగదారులు దేన్ని ఇష్టపడితే దాన్నే మంచి వస్తువుగా మంచి బ్రాండ్ అని భావిస్తారు."
   
    "మొత్తానికి క్వీన్స్ వాళ్ళు చాలా అదృష్టవంతులు. బాగా ఖర్చుపెట్టగల క్లయింట్స్ దొరికింది. ఏడ్ కూడా చాలా బాగా వచ్చింది" అంది మౌనిక నిట్టూరుస్తూ.
   
    సరిగ్గా అప్పుడే రూమ్ లోకి సడన్ గా వచ్చిపడ్డాడు భార్గవ.
   
    అతను ఆయాసపడటాన్ని చూసి చాలా వేగంగా వచ్చినట్లు గమనించారు మాధుర్, మౌనికలు.

 Previous Page Next Page