Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 78

 

       "ఏమిటి భార్గవా? ఏమిటీ హడావుడి?" మాధుర్ బెడ్ మీంచి లేస్తూ ప్రశ్నించాడు.
   
    "క్వీన్స్ వాళ్ళు బి.పి.ఎల్ కి ఇచ్చిన ఏడ్ మిస్ లీడ్ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది నాకు. దీనిమీద ఏదో ఒకటిచేసి మనం దెబ్బకొట్టకపోతే మనం తలెత్తుకోలేం" అన్నాడు ఆయాసపడుతూనే భార్గవ.
   
    భార్గవ, భరద్వాజ చేసిన మోసాన్ని ఇంకా మరచిపోలేక అంతటి ఆవేశానికి గురయ్యాడని మాధుర్ కి తెలుసు.
   
    మాధుర్ నవ్వి "చూస్తుండు ఏం జరుగుతుందో" అంటూ బాత్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.
   
    "ఒకటా రెండా? పది లక్షలు నష్టపోయారు నాన్నగారు. నాసిరకం వేక్యూమ్ క్లీనర్ తయారుచేసి మీ కేంపైన్ మూలంగా మా ప్రోడక్టు మార్కెట్ లోకి ఎక్కలేదని దెబ్బకొట్టాడు నాన్నగార్ని వాడ్ని అంత తేలిగ్గా వదలిపెట్టను...." తనలో తానే అనుకుంటున్నట్లుగా అన్నాడు భార్గవ.
   
    మౌనిక భార్గవ మాటలు వింది- అతడి ఆవేదనను, కోపతాపాల్ని అర్ధం చేసుకుంది.
   
                               *    *    *    *    *   
   
    మాధుర్ డ్రసప్ అయి తన రూమ్ లోకి వచ్చేసరికి అక్కడున్న ఫోన్ రింగవుతోంది.
   
    మాధుర్ ఫోన్ ని చేసి చెవికి ఆనించుకుని "హలో.....దిసీజ్ ఎమ్.....ఎమ్" అన్నాడు గంభీరంగా.
   
    "ఈరోజు పేలిన బాంబును చూసావా?"
   
    అది వీనస్ కంఠమని వెంటనే పసిగట్టాడు మాధుర్.
   
    "చూడు.....నీకు విచక్షణాజ్ఞానం నశించినా, ఇంగితజ్ఞానం లేకున్నా, కామన్ సెన్స్ లోపించినా, స్త్రీవని...... ఒకప్పటి నా కలలకి, ఆశలకి బ్లూ ప్రింట్ వని స్పేర్ చేస్తున్నాను. ఛాలెంజ్ ప్రతిసారి వర్కవుట్ అవ్వదని గుర్తించటం మంచిది. ఇకపోతే బాంబన్నానే-దాన్నిప్పుడే ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో చూశాను. నువ్వన్నట్లు అది మీ పాలిట బాంబే. మరో వారం రోజుల్లో అది బ్రహ్మాండంగా బ్రద్దలయ్యేలా ఎక్స్ ప్లోజ్ కాబోతోంది. ఇలా అని నీ బాబుకి చెప్పు నేను యివ్వబోయే రిటార్ట్ నుంచి నిన్ను నీ బాబుని ఎవరూ రక్షించలేరు. నా నేచర్ మీ యిద్దరికీ బాగా తెలుసు. ఒకమాట అంత తేలిగ్గా అనను. అన్నానంటే హరిహరాదులు అడ్డువచ్చినా అమలు జరగకుండా ఆగదు. బై...." మాధుర్ ఫోన్ పెట్టేశాడు విసురుగా.
   
    భార్గవ లోపలికి వచ్చాడు.
   
    "ఇండియన్ టెలివిజన్ మార్కెట్ ని, శాసిస్తున్న బ్రాండ్స్ లో బి.పి.ఎల్. వీడియోకాన్ రెండే వున్నాయి. ప్రస్తుతం ఆ రెంటిమధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండే బ్రాండ్ వార్ నడుస్తోంది. బి.పి.ఎల్. తరపున క్వీన్స్ ఏజెన్సీ ఇస్తున్న కేంపైన్ మూలంగా మొదటిగా దెబ్బతినేది వీడియోకాన్. కనుక వీడియోకాన్ నే కేచ్ చేస్తే కథ దానంతటదే మలుపులు తిరుగుతుంది. కనుక ముందు వీడియో కాన్ మార్కెటింగ్ డైరెక్టర్ని కలవాలి. ఆ తరువాత కన్స్యూమర్స్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ కి వెళ్ళాలి. అన్నీ చకచకా జరిగిపోవాలి...." అంటూ మాధుర్ ఫోనందుకుని ఏదో నెంబరుకి డయల్ చేశాడు.
   
                              *    *    *    *    *
   
    సరిగ్గా మధ్యాహ్నం రెండుగంటలకు ఓ అంబాసిడర్ కారొచ్చి ఎం.ఎం.ఆఫీసు ముందాగింది.
   
    అందులోంచి నలుగురు మనుషులు దిగి రెసెప్షన్ హాల్లోకి వచ్చి అర్జంటుగా మీ ఎం.డి.ని కలవాలి అన్నారు.
   
    రిసెప్షనిస్ట్ మాధుర్ కి రింగ్ చేసి ఆ విషయాన్ని తెలియజేసింది.
   
    మాధుర్ వాళ్ళను లోపలకు పంపమనటంతో వాళ్ళకా విషయాన్ని తెలియజేసింది.
   
    వాళ్ళు నలుగురు మాధుర్ రూమ్ లోకి అడుగుపెడుతూ మాధుర్ ను విష్ చేసారు.
   
    "చెప్పండి ఎవరు మీరు? ఏ పనిమీద వచ్చారు?" అన్నాడు మాధుర్ మర్యాదపూర్వకంగా.
   
    "మేం ఎస్.టి.పి. పార్టీకి చెందిన ఎలక్షన్ ప్రచారకమిటీ సభ్యులం, మీకు తెలిసే వుంటుంది. నవంబరు 22, 24 తారీఖుల్లో పార్లమెంటుకి ఎన్నికలు జరగబోతున్నాయి..." నలుగురిలో ఓ వ్యక్తి అన్నాడు.
   
    "అఫ్ కోర్స్...."
   
    "వాటితోబాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎలక్షన్స్ జరగనున్నాయి."
   
    "పేపర్స్ లో చూసాను. బట్.... నాతో మీకు ఏ అవసరం వుండి వచ్చారు....? పార్టీకి ఫండా....?" మాధుర్ యిప్పుడు క్షణం వృధా పోవటాన్ని కూడా భరించలేకపోతున్నాడు.
   
    తన వదిన తన అప్రయోజకత్వాన్ని వెక్కిరించిందని కొన్నాళ్ళు, భరద్వాజ తన కలల ప్రపంచాన్ని కూలదోసాడని మరికొన్నాళ్ళు, కసిగా, పట్టుదలగా ఎదిగేందుకు పరిశ్రమించాడు. గంగాధరరావులాంటి ఉత్తముడు ఆర్హ్దికంగా చితికిపోయాడే అని ఇంకొన్నాళ్ళు నిద్రాహారాలు మానేసి శ్రమించాడు.
   
    కానీ యిప్పుడు ప్రపంచ ప్రచారరంగమే ఆశ్చర్యపోయే అద్భుతాన్ని సాధించాలని కలలు కంటున్నాడు. అందుకై అనంత్తం శ్రమిస్తున్నాడు. అందుకే క్షణం వృధా అయినా అసహనం తొంగిచూస్తుంది అతని ప్రవర్తనలో.
   
    "పార్టీ ఫండ్ ప్రజల దగ్గర్నుంచి వసూళ్ళు చేయటం నిజం చెప్పాలంటే ఒనాటకం. అది రాజకీయ నాయకులు ఆడే డ్రామా. ప్రజలనోట్లో దుమ్ముకొట్టి బడా వ్యాపారవేత్తల్ని, స్మగ్లర్స్ ని, మాఫియా గేంగ్స్ ని కొమ్ముకాస్తే వందలకోట్లు చాపక్రింద నీరులా అధికారపార్టీ కార్యాలయం ఇనప్పెట్టెల్లోకి చేరిపోతాయి...."
   
    ఆ నలుగురిలో ఓ వ్యక్తి ఆత్మవంచన చేసుకోకుండా అన్నాడు.
   
    మాధుర్ కి ఆశ్చర్యమేసింది.
   
    "మరి... మరి దేనికి వచ్చినట్లు...?" మాధుర్ కి చిరాగ్గా వుంది.
   
    "సడన్ గా ఎలక్షన్స్ డిక్లేర్ కావడంతో ప్రచారం ఎలా మొదలు పెట్టాలో అర్ధంకావటంలేదు. ఏవైనా మంచి స్లోగన్స్ మీరిస్తారేమో అని వచ్చాం. మీరెంత ఛార్జి చేసినా ఫర్వాలేదు. మేం మీకిచ్చే డబ్బు మాది కాదుగా.... ప్రజలదే...."
   
    మాధుర్ ముఖంలో అప్పుడు ప్రశాంతత చోటుచేసుకుంది.

    గరీబీ హఠావో.....Let us follow the MGR Polices గల్లీ గల్లీ మే చోర్..... లాంటి స్లోగన్స్ కావాలి. అవి ప్రజలకు బాగా పట్టేలా వుండాలి. తేలిగ్గా అనగలిగేలా వుండాలి. అన్నిటికీ మించి అవి ప్రజల్ని బాగా మోసగించాలి"
   
    "మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగస్థల పబ్లిసిటీ వ్యవహారాలన్నీ మీ ఏజెన్సీకే యిస్తాం- మంచి జబర్ధస్ట్ స్లోగన్స్ ఇవ్వాలి."
   
    "రడీ కేష్ తెచ్చాం...."
   
    అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కో విషయం మాట్లాడారు.
   
    "ఇప్పుడు మీ పార్టీ అధికారంలో వుందా...?" మాహ్డుర్ ప్రశ్నించాడు.
   
    "లేదు! అది లేకే చచ్చిపోతున్నాం. అధికారం చేతిలో లేకపోయేసరికి పిచ్చెక్కినట్లుగా వుంది... దాంతో ఎప్పుడూ లేని విధంగా ప్రజలు అన్యాయమై పోతున్నారంటూ తెగ అరవాల్సి వస్తోంది."
   
    "అధికారంలో వున్న పార్టీ ప్రభుత్వసారాని అమ్ముతోందా?"
   
    "తెగ అమ్మేస్తోంది..."
   
    "మీకు సారాయే కావాలంటే మాకు ఓట్లు వెయ్యక్కర్లేదు.... నీళ్ళు కావాలంటేనే వేయండి."
   
    "You gave us deer, now give us water.
    A vote for....is a vote For Hitler."
   
    రెండు స్లోగన్స్ చెప్పాడు అప్పటికప్పుడు మాధుర్.
   
    ఆ నలుగురు నోర్లు తెరిచి అలాగే చూస్తుండిపోయారు.
   
    "కమ్యూనిస్టులు బాగా పోటీ తగిలే నియోజక వర్గాల్లో ఏ స్లోగన్స్ వాడాలి?" ఒకతను అడిగాడు.
   
    "Better dead than red-" చెప్పటం ఒకింతసేపు ఆపి, అప్పుడు మరలా చెప్పటం ప్రారంభించాడు.
   
    "fime for a change....
    Change for a better life"
    "This time vote like your whole life depended on it."   
    "Vote for any candidate, but if you want food, clothes and shelter vote for S.T.P."
   
    "if you want to ban the Commissions vote for S.T.P."
   
    మాధుర్ చెప్పటం ఆపాడు.
   
    నలుగురూ మెస్మరైజ్ అయిపోయారు. ఒకింతసేపటికి తేరుకొని మాధుర్ కేసి అభినందనగా చూసారు.
   
    "మా పార్టీ అధికారంలో ఉన్నచోట తిరిగి నెగ్గాలంటే ఎలాగా?"
   
    "అధికారంలో వున్నప్పుడు ప్రజలకి మేలుచేసే పనులుచేసే వుంటారుగా..." మాధుర్ ప్రశ్నించాడు.

 Previous Page Next Page