Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 76

  

       ఎం.బి.ఎ పూర్తయిన మాధుర్ ముందుగా వీనస్ ని కలిసి అన్నీ వివరంగా చెప్పి, ఆమెకు తనమీద ఏర్పడ్డ అపోహల్ని తొలగించాలని ప్రయత్నించాడు. దానికి భరద్వాజ అడ్డుతగిలాడు.
   
    చేసేది లేక నా భార్యను నా దగ్గరకు పంపించేందుకు సహకరించమని కోర్టుద్వారా ప్రొసీడ్ అయ్యాడు మాధుర్. దాంతో మరింతగా రెచ్చిపోయి రాక్షసుడయ్యాడు భరద్వాజ. తన కూతురు సంసారిక జీవితానికి అన్ ఫిట్ అని డాక్టర్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి మాధుర్ ని నెగ్గకుండా చేశాడు.
   
    మరోప్రక్క కూతురికి మాధుర్ మన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని చెప్పి ఆమె మనస్సును పూర్తిగా విరిచేశాడు.
   
    ఒక్కొక్కరి మానసిక ప్రవృత్తి ఒక్కో సంఘటన పట్ల ఒక్కో రకంగా రియాక్ట్ కావడానికి ప్రత్యేక కారణాలు ఏమీ వుండక్కర్లేదు.
   
    ఆరోజు నుంచే వీనస్ మాధుర్ పై పగ, ద్వేషాల్ని పెంచుతుంది. తన పండంటి జీవితం అల్లరిపాలు కావడానికి, మధురమైన అనుభూతుల్ని, అనుభవాల్ని పంచుకోవలసిన కాలంలో తన మనస్సును గాయపరిచిన మాధుర్ ని వూరికే వదలకూడదనుకుంది.
   
    అలా అని మాధుర్ మీద ఆమెకు బొత్తిగా ప్రేమ లేదనడానికి కూడా వీలులేదు. ఆమెకు తెలీకుండానే మాధుర్ ని ద్వేషిస్తూ ప్రేమిస్తోంది.
   
    మాధుర్ కన్పిస్తే కవ్వింపుకు గురవుతుంది. దూరంగా వుంటే వ్యామోహాన్ని, ప్రేమను పెంచుకుంటుంది.
   
    ఎంతగానో ప్రేమించి, నమ్మి, తను చెప్పినట్టు నడుచుకున్న నన్ను మోసగిస్తాడా? కోటీశ్వరుడ్నని చెబుతాడా? ఇవే ఆమెను అనుక్షణం రెచ్చగొట్టే కారణాలు.
   
    మాధుర్ తనను కలవాలని ప్రయత్నించినా వీనస్ అందుకు అంగీకరించలేదు.
   
    ఆరోజునుంచే మాధుర్ భరద్వాజపై ద్వేషం పెంచుకున్నాడు. అనుకోకుండా గంగాధరరావు ద్వారా తీగ కదిలింది. ఆ తీగకు చివర భరద్వాజ వుండడంతో మాధుర్ లోని పగ, ప్రతీకారం మరింతగా పుంజుకోవడమే కాక, డబ్బు మదంతో తనను కాదన్న తండ్రి, కూతుళ్ళకు బుద్ది చెప్పాలనే నిర్ణయానికి వచ్చాడు.
   
    కానీ అతని మనస్సులో ఓ కోరిక మిగిలిపోయింది.
   
    ఎప్పటికైనా వీనస్ తను తప్పు చేయలేదు..... మోసం చేయలేదని గ్రహిస్తే చాలు.
   
                              *    *    *    *    *
   
    పెళ్ళిఅయ్యి, కానట్టు సంధి దశలో ఓ ప్రశ్నయి మిగిలిన వీనస్ ఆ తరువాత పెళ్ళి ప్రయత్నాలన్నింటిని తిప్పికొట్టి తనకంటూ ఓ వ్యాపకం వుండాలని తండ్రిని ఒప్పించి, క్వీన్ ఎడ్వర్టయిజింగ్ ఏజెన్సీని స్థాపించి బిజినెస్ ఫీల్డ్ లోకి దిగిపోయింది.
   
    స్వతహాగా తెలివికలది, హుషారైనది కావడంతో చేపట్టిన ఏడ్ కేంపైన్స్ అన్నిటిని సక్సెస్ ఫుల్ గా నిర్వహించడంతో మార్కెట్ లో కొద్ది కాలంలోనే పేరు, ప్రతిష్టల్ని సంపాదించుకోగలిగింది.
   
    అప్పుడే సింఘానియాతో తన తండ్రికున్న పాత పరిచయాల్ని ఉపయోగించుకొని ది గ్రేట్ జె.జె. ఎంపైర్ ని తన క్లయింట్ గా చేసుకోగలిగింది.
   
    జె.జె.ఎంపైర్ కి చెందిన ప్రోడక్టుకి కూడా ఎఫెక్టివ్ పబ్లిసిటీ కేంపైన్స్ నిర్వహించి ఆవైపు కూడా మంచి పేరును సంపాదించుకోగలిగింది.
   
    అయితే జె.జె. వ్యాన్ కేంపైన్ మొదలయిన దగ్గర్నుంచి భరద్వాజ కూతురు నడిపే ఏడ్ ఏజన్సీ వ్యవహారాలపై ఓ కన్నేసి వుంచడం మొదలెట్టాడు.
   
    వీనస్ ని ట్రాన్స్ లో వుంచి జె.జె. ఎంఫైర్ కేంపైన్స్ ని పాడుచేయాలనే తలంపుకు గత సంవత్సరమే వచ్చాడు భరద్వాజ.
   
    కూతురికి తెలీకుండానే ఆమెక్రింద పనిచేసే మీడియా ఎగ్జిక్యూటివ్స్ ని తన గ్రిప్ లోకి తెచ్చుకొని బ్రాండ్ వార్ లో జె.జె. ఎంఫైర్ ప్రోడక్ట్సు దెబ్బతినేలా చేసింది భరద్వాజే.
   
    సేల్స్ గ్రాఫ్ క్రమంగా పడిపోవడంతో జె.జె. స్వయంగా పని గట్టుకురావడం జరిగింది.
   
    ఈ తతంగంలో సింఘానియా బాగా సహకరించాడు భరద్వాజకు.
   
    సింఘానియా గత ఇరవైయేండ్లుగా జె.జె. ఎంఫైర్ లో మార్కెటింగ్ సైడ్ పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు.
   
    పందొమ్మిది సంవత్సరాలుగా నిజాయితీగా కష్టించి పనిచేస్తూ రావడంతో సింఘానియాని జె.జె. ఎంపైర్ లో ఎవరూ అనుమానించలేదు.
   
    సరిగ్గా అదే సమయంలో మాధుర్ సింఘానియా డిపార్ట్ మెంట్ లో చేరాడు.
   
    చేరిన నెల రోజులకే ఆ డిపార్ట్ మెంట్ లో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్టు పసిగట్టి, క్రమంగా వాటి గురించి ఎంఫైర్ లో నలుగురితో మాట్లాడటం మొదలెట్టాడు.
   
    ఆ టైమ్ లోనే క్వీన్ ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీ క్రియేటివ్ గా, ఎఫెక్టివ్ గా కేంపైన్స్ నిర్వహించడంలేదని మాధుర్ బయటకే అనేశాడు. అది సింఘానియాకి తెలిసింది. అతను ఎక్కువకాలం తన డిపార్ట్ మెంట్ లో వుండడం తనకు క్షేమం కాదని గ్రహించాడు.
       
    ఓ రోజు అదే విషయాన్ని మాటల సందర్భంలో భరద్వాజతో అన్నాడు. కూపీలాగడంతో తెర వెనుక మాధుర్ వున్నట్టు తెలిసింది. అంతే...ఆ మరుక్షణం సింఘానియా ద్వారా డ్రామా ఆడించాడు.
   
    సింఘానియా ఆరోజు నుంచి మాధుర్ ని హ్యుమిలియేట్ చెయ్యడం ప్రారంభించాడు.
   
    దాన్ని స్పేర్ చేయలేని మాధుర్ జాబ్ కి రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోయాడు.
   
    అయితే ఈ విషయం అటు మాధుర్ కి కానీ, ఇటు మౌనికకు కానీ తెలీదు.
   
    భరద్వాజకు జె.జె. ఎంపైర్ మీద కోపమెందుకో అతనికి తప్ప మరెవరికీ తెలీదు.
   
                                *    *    *    *    *
   
    మాధుర్ క్రమంగా గతం తాలూకు ఆలోచనల నుంచి తేరుకొన్నాడు. ఎదురుగా భార్గవ, మౌనిక ఆశ్చర్యపోయి మాధుర్ కేసే చూస్తూండిపోయారు.
   
    గత జ్ఞాపకాలు అతన్ని బాధిస్తుండవచ్చని భార్గవ భావిస్తే ఏదో కేంపైన్ గురించి హఠాత్తుగా ఆలోచించటం మొదలెట్టి వుండవచ్చని మౌనిక భావించింది.
   
    "సారీ ఫ్రెండ్స్..... వున్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోయాను" అన్నాడు మాధుర్ నొచ్చుకుంటూ.
   
    "ఆఫీసుల్లో, బ్యాంకుల్లో, ఫ్యాక్టరీల్లో కంప్యూటర్స్ ని ప్రవేశపెడుతున్నాం గదా! ఉన్న ఉద్యోగాలు వూడిపోతాయేమోనని భ్రమపడి కొందరు ఏంటీ కంప్యూటరైజేషన్ మూమెంట్ ని తీసుకువస్తున్నారు. సాంకేతికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా ఎన్నాళ్ళు ఆగిపోగలం? ఆ సందర్భంలో కంప్యూటరైజేషన్ ని సమర్ధిస్తూ మోస్ట్ ఎఫెక్టివ్ గా వుండేలా ఏదైనా స్లోగన్ చెప్పవా?" మౌనిక తన అవసరాన్ని గుర్తుకుతెచ్చుకుంటూ అడిగింది.
   
    మాధుర్ ఏ మూడ్ లో వున్నాడో వెంటనే స్పాంటేనియస్ గా చెప్పడం మొదలెట్టాడు.
   
    "కంప్యూటర్స్ హెల్ప్ పీపుల్ టు హెల్ప్ పీపుల్."
   
    "మేకింగ్ మెషిన్స్ డు మోర్ సొ మెన్ కెన్ డు మోర్."
   
    "ఎ కన్సర్న్ ఫర్ ది ఫ్యూచర్."
   
    "పై స్లోగన్స్ బాగా ఎఫెక్టివ్ గా వుంటాయి. కంప్యూటర్ మనుష్యులకి సహాయపడేందుకు, మానవుడి తెలివితేటలకి, శ్రమకి విలువ పెరిగింది. కూడికలు, తీసివేతలకే మానవ జీవితంలో సగభాగం ఖర్చయితే ఇక సాధించేదేమిటి?
   
    కంప్యూటర్స్ ని ప్రవేశపెట్టకుండా ఆపడమంటే మన దేశాన్ని ముందుకు వెళ్ళనీయకుండా మనమే అడ్డుపడుతున్నామన్నమాట.
   
    మనం నియంత్రించినట్టు చేసే యంత్రాలకి మనమే భయపడుతున్నామా? ఇవన్నీ కాపీలో వస్తే బావుంటుంది" అన్నాడు సాలోచనగా మాధుర్.
   
                               *    *    *    *    *
   
    వర్క్ మోర్ గో ఎబ్రాడ్ స్కీమ్ కి సంబందించిన పేపర్ పబ్లిసిటీ వర్కు పూర్తయిపోయింది.
   
    లిటరేచర్, బ్రోచర్స్ ఇండియాలోని జె.జె. ఎంఫైర్ సేల్స్ డిపార్ట్ మెంట్స్ కి, డీలర్స్ కి పంపించబడ్డాయి.
   
    ఆ ఆఫర్ ని చూస్తూనే మార్కెటింగ్, సేల్స్ వింగ్ లు, డీలర్స్ లో అత్యధిక ఉత్సాహం ప్రోదిచేసుకుంది.
   
    జె.జె. ఎంఫైర్ ప్రోడక్ట్సుని ఎక్కువగా అమ్మి, ఫారెన్ ట్రిప్ ని అందుకోవాలనే కోర్కె అంతటా వూపందుకుంది.
   
    చూస్తుండగానే ఈ సరికొత్త ఇన్సెంటివ్ స్కీమ్ బ్రహ్మాండంగా క్లిక్ అయింది.

 Previous Page Next Page