"... మహాత్ముడు మనల్ని మగవాళ్ళు చేసేపనులు చెయ్యమనటంలేదు, అచ్చగా ఆడవాళ్ళు చేసేపనులు చెయ్యమంటున్నాడు; నూలుతియ్యటం, ఉప్పువండటం, కొడితే కిక్కురుమనకుండా ఉండటం... అసలు సత్యాగ్రహమంటే ఏమిటి? రోజూ మన భార్యలు చేస్తున్నదేగా? అసలు ఆడవాళ్ళను చూసే, మహాత్ముడు సత్యాగ్రహం ప్రారంభించాడు మనం మగవాళ్ళం కాలేక పోతేపోయాం, ఆడవాళ్ళమన్నా కాలేమా?....
`ఈ మాటలూ వింటూ, "మన ఆడవాళ్ళ సత్యాగ్రహం వాళ్లకేం లాభిస్తున్నది?" అనుకున్నాడు.
ఇంకో ఉపన్యాసం :
"...ఈ బ్రిటీషు వాళ్ళుండే, భలే దగుల్బాజీలు. వాళ్ళని మనం యుక్తితో గెలవలేం. వాళ్ళు మనతో రాజీపడి ఒక ప్రతం రాసినా అందులో నలబై షరతులుంటే. మొదటి వాక్యాన్ని రెండోది రద్దుచేస్తుంది. మూడో వాక్యాన్ని నాలుగోది ఖండిస్తుంది. చివరకి సున్నాకి సున్నా, హళ్లికి హళ్లి మిగులుతుంది. పోనీ వాళ్ళతో యుద్ధం చేద్దామా అంటే వాళ్ళ దగ్గర తుపాకులుండె. మనదగ్గర లేకపోయే... ఎటోచ్చీ మనం ఉప్పునండక తప్పేదేముంది గనకా? గాంధీ మహాత్ముడు బాగా ఆలోచించే ఈ పద్దతి పెట్టాడు..."
కొందరు బాగా మాట్లాడేవారు, మరికొందరు మాట్లాడుతుంటే చప్పచప్పగా ఉండేది. కొందరు ఉపన్యాసకులు మధ్య మధ్య సి.ఐ.డీ.ల మీద హాస్యాలు వదిలేవాళ్ళు. "మారు వేషంలో అక్కడ కూచుని రాసుకుంటున్న హెడ్ కానిస్టేబుల్ ఈ మాటలు కాస్త జాగర్తగా రాసుకోవాలి." గొల్లున సభలో నుంచి నవ్వులు. అందరూ హెడ్ కానిస్టేబుల్ ను చూడటానికి యత్నించటం "మన మీటింగు అయేదాకా ఆయన పోడులేండి. మీకేం భయం అక్కర్లేదు" అని ఉపన్యాసకుడనటం.
ఇదంతా చాలా ఉత్సాహంగానే ఉండేది. దానికితోడు ఒక్కోరోజు రిజర్వు పోలీసు వస్తున్నట్టు పుకారు పుట్టటంకూడా ఉండేది. పోలీసులు రావటమూ, ఉపన్యాసకులను అరెస్టు చెయ్యటమూ, జెండా పీకటమూ, లాఠీ చార్జీ__ ఇవే ఈ మీటింగులకు మంగళహారతి.
సుందరం రోజూ మీటింగులకు వెళుతూనే ఉన్నాడు, పర్యవసానంకోసం అందరూ ఎదురుచూసేటంత ఆత్రంగా తానూ ఎదురుచూస్తున్నాడు. కాని వాడిలోపల ఏవో సందేహాలూ, ఏదో అసంతృప్తీ నూ. ఫదేళ్ళకిందటి ఉద్యమం ఇంతకన్న బాగా ఉన్నాదని వాడి అనుమానం. నిజానికి అప్పుడు ఉద్యమంపట్ల మామూలు ప్రజలలో ఇంత చైతన్యంలేదు. అయితేనేం? ఆ ఉద్యమంలో జాతీయ పాఠశాలలూ, గృహపరిశ్రమలూ, ఖద్దరు దీక్షా, నూలు తీయటమూ మొదలైనవి సాగినట్టయితే జీవిత స్వరూపం క్రమంగా మార్పుచెందేది. ఈసారి అటువంటిదేమీ లేనేలేదు. ఆ కార్యాక్రమం ఏదోఉన్నా ఈ ఉద్యమంవెంట లేదు. దానిదారిన అది గుంటపూలు పూస్తున్నది. అక్కడక్కడా కూలీలనుపెట్టి నూలుతీయించి, బట్టలు నేయించి ఖద్దరు వస్త్రాలయాలలో అమ్ముతున్నారుగాని ఇదంతా చేయించేవాళ్ళు డబ్బుదోచుకుంటున్నారు. నూలుతీసే కూలీలకు డబ్బుఏమీ గిట్టుబాటు కావటంలేదు, బేడా, మూడణాలు రోజుకూలీతో వాళ్ళేం బతగ్గలరు?........
ఆఖరుకు అనుకున్నరోజు వచ్చింది. ఆ సాయంకాలం సుందరం మీటింగుకు వెళ్ళేసరికి అక్కడ అయిదారువేలమంది జనం కనిపించారు. వాతావరణం బిర్రున బిగదీసినట్టున్నది. "ఇంతకుముందే నాలుగు లారీలలో రిజర్వు పోలీసు దిగింది" అన్న వార్త సుందరం చెవిన పడింది.
"యీపూట పోలీసులు వచ్చారో వాళ్ళకి ప్రాణాలు దక్కవు!" ఎవరో అన్న యీ మాటకు సుందరం శరీరం ఒక్కసారి పులకరించింది. అంధకారంలో ఆశారేఖలుగా ఉన్న యీ మాటను పూర్తిగా నమ్మగోరాడు.
"ఏం? ఏం?"అన్నాడు సుందరం.
"కన్నబిడ్డలా? యీ వచ్చినవాళ్ళంతా యీ వూరివాళ్ళా? వీళ్ళు మీటింగుకోసం వచ్చారూ? వీళ్ళు పక్కగ్రామంవాళ్ళు. హత్యలు చెయ్యటంలో ప్రసిద్దులు ఇవాళ రిజర్వువస్తుందని ఎట్టా తెలుసుకున్నారో, తల్లి ముండమొయ్య!"
ఇదినిజంగానే కనబడింది సుందరానికి. ఎందుచేతనంటే అనేక వందలమంది జనం మీటింగుముఖమై కూర్చోవటానికి బదులు రోడ్డు వారని, ఉపన్యాసవేదికకు వీపుపెట్టి కూచున్నారు. వాళ్ళవన్నీ కొత్తమొహాలే. వాళ్ళు పోలీసులను కొట్టటానికి ఏ ఆయుధాలు తెచ్చిందీ సుందరానికి తెలియలేదు. ఎవరిచేతుల్లోనూ ఏమీలేదు__ ఎక్కడైనా ఒక చేతికర్ర తప్పిస్తే.
తాను విన్నది నిజమనుకోవటానికి వీలుగా ఆ పూట రిజర్వు పోలీసులు మీటింగు చాయలకు రానేలేదు మరి మూడు లారీల రిజర్వుకోసం కబురువెళ్లిందని ఎవరో అన్నారు. రాత్రి ఏడుగంటలదాకా మీటింగుదగ్గరే ఉండి సుందరం ఇంటికి వచ్చేశాడు.
మర్నాడు ఉదయం సుందరం కాఫీహోటలులో తెలుసు కున్నాడు. గంటకిందట రిజర్వుపోలీసులు మీటింగు జరిగే స్థలానికి వచ్చి జెండా పీక్కుపోయినారుట ఎవర్నీ ఎరెస్టు చెయ్యలేదు. పోలీసుల కెవరూ అడ్డుపోనూలేదు.
* * * *
ఊళ్ళో ఊరేగింపులు సాగాయి. రోజూ పోలీసుల లాఠీ చార్జీలు చేస్తున్నారు. లాఠీచార్జీ వార్త చెవినబడ్డ ప్పుడల్లా సుందరానికి రక్తం ఉడికిపొయ్యేది. ఇటు ఉద్యమంమీదా, అటు పోలీసుల మీదా వాడికి భరించరాని ఆగ్రహం వచ్చేది.
యీ వెధవ ఉద్యమంలో తెల్లవా డెక్కడున్నాడు? ఉద్యమం నడిపేది మనవాళ్ళు, దాన్ని చెడగొట్టేది. మనవాళ్ళు. తెల్లవాడి మేలుకోసం మన పోలీసులు మనవాళ్ళని, నిరాయుధులను కొట్టటమా? పోలీసులకు అక్కర్లేని స్వరాజ్యాన్ని యీ కాంగ్రెసువాళ్ళు తేకపోతేనేం? "మీరు కూడా స్వరాజ్యం కావలిసినవాళ్ళే" నని పోలీసులకూ, పోలీసాధికార్లకూ, ప్రభుత్వోద్యోగులకూ నచ్చచెప్పినమీదటనే ఉద్యమం సాగించరాదూ? పోలీసుల్ని కూడగట్టకపోవట మేగాక, స్వాతంత్ర్యోధ్యమానికి వాళ్ళను విరోధులుగా ప్రవర్తించనివ్వటం కాంగ్రెసు తప్పని సుందరం బలంగా విశ్వసించాడు.