Previous Page Next Page 
చదువు పేజి 75

   

    ఈ మాటను పూర్తిగా అర్ధంచేసుకోవటానికి ప్రయత్నించాడు సుందరం. ఆలోచించినకొద్దీ ఈ ఉద్యమం గురించి సరుసుకు అసంతృప్తి ఎక్కువవవుతున్నది. ప్రజలలో మానసిక చైతన్యం వచ్చింది నిజమేగాని, వారి రాజకీయ విజ్ఞానం పెంపొందలేదు. పత్రిక చదివేచోట జరిగే వ్యాఖ్యానాలు విన్నాడుగా. ఆవ్యాఖ్యానాల్లో బ్రిటిషువాడిమీద ద్వేషమూ, ఉప్పు సత్యాగ్రహంతో స్వరాజ్యంతప్పక  వచ్చేస్తుందన్న మూఢవిశ్వాసమూ తప్ప ఇంకేమీ లేదు. ఈ విశ్వాసం తొట్టిస్నానాల్లో విశ్వాసంలాంటిది. రంగు అద్దాల వైద్యంలో విశ్వాసంలాంటిది. కొందరికది మేలు చెయ్యవచ్చు; వారికి విశ్వాసబలాన్నీ, దృఢబుద్దినీ ఇవ్వవచ్చు. కాని అనేకమందికి ఈ సాధనానికీ, సాధ్యాలకూ గల సంబంధమేమిటో బొత్తిగా తెలీదు.

    శేషగిరిమావయ్య ఆ సంబంధంగురించి తెలిసిఉండదగిన వాడేగా. ఆయన వైఖరిమాత్రం ఏంబాగుందీ? "మా కెట్లాగూ తప్పదు" అంటాడేమిటి? దేశమంతటా జరిగే ఈ ఉద్యమం అప్పుడే ఒక లాంఛనంక్రింద జమ అయిపోయిందా?__ పెళ్ళిలో వరుడు కాశీకి ప్రయాణం గావటంలాగా!

    సుందరం ఆ వూళ్ళోవుండగానే బసవయ్యగారింట్లో చిన్నమీటింగు జరిగింది. ఇప్పుడు బసవయ్యగారు ఊళ్ళో పెద్ద మోతుబరు. ఆ వూరునుంచి ఎంతమండి జైలుకు వెళ్ళితే ఆయనకు స్వయంగా అంత ఖ్యాతి.

    ఈ మీటింగుకు శేషగిరి వెంట సరుసూ సుందరమూ కూడా వెళ్ళారు.

    "ఏం, అన్నయ్యగారూ, మన ఊరునుంచి ఎంతమంది శ్రీకృష్ణజన్మస్థానం పోతున్నమో ఆలోచించండి" అన్నాడు బసవయ్యగారు.

    జైలుకు వెళ్ళటానికి సిద్దంగా ఉన్న అయిదారుగురు పెద్దలూ మిగిలినవాళ్ళకేసి చూశారు.
 
    "ఏం, చలమయ్యబావా?" అన్నాడు శేషగిరి.

    "నేనుకూడా రావలిసిందేనంటావా?" అన్నాడు చలమయ్య.

    "అయ్యో. కుర్రకారును నువ్వు నడిపించాలిసిందే."

    "సరయితే ఇంకా చూసేదేముందీ? నన్నూ యేసుకోండి"
 
    "ఏంరా, శర్మా?"
 
    శర్మ కుండపగలేసి చెప్పేశాడు.

    "నా ఆర్ధికదుస్థితి మీకు తెలీంది కాదుగదా. నా భార్యకూ పిల్లలకూ ఆర్నెల్లపాటు సరిపోయే గ్రాసం ఏర్పాటు చేయించండి నేను సిద్దమే. లేకపోతే మటుకు నావల్లకాదు."

    "ఓరి నీ యిల్లు దొంగల్దోల ! ఈపాటి చెయ్యలేమా? శర్మగార్నికూడా వేసుకో."

    "మరి కుర్రకారు మాటేమిటి?" అన్న ప్రశ్న వచ్చింది.

    "మేం గుడిదగ్గర వేరే మీటింగుపెట్టి తేలుస్తాంగా" అన్నాడు సరుసు. శేషగిరి సరుసుకేసి చురచురా చూశాడుకాని ఏమీ అనలేకపోయినాడు.

    బసవయ్యగారింటో  జరిగిన మీటింగు సుందరానికి కాస్తయినా  ఆనందం కలిగించలేదు. అందులోఉన్న మంచి ఏమిటో వాడికి తెలీదు. ఆవేళ ఆ ఇంటోచేరి ఒక కుటుంబంలాగా వ్యవహరించిన మనుష్యులు, ఈ ఉద్యమమే లేకపోతే ఒకచోట సమావేశం కాదగినవారుకాదు; ఒకర్ని గురించి ఒకరు చాడీలూ, తప్పుడు కబుర్లూ చెప్పుకుంటూ ఉండవలసినవారు. అయితే ఈ విషయం సుందరం ఎరగడు. వాడికిమాత్రం ఈ ఉద్యమంగురించి సద్భావం ఏర్పడటానికి బసవయ్యగారింట జరిగిన మీటింగు తోడ్పడలేదు దేశభక్తీ, జాతీయోత్సాహమూ అన్నవాటికి అవమానం జరిగినట్టు వాడు భావించాడు. కాశీ విశ్వవిద్యాలయంలో యువకులు ప్రదర్శించిన ఆవేశానికీ దీనికీ ఏమీ సంబంధంలేదు.

    గుడిదగ్గర జరిగిన కుర్రకారు సమావేశం ఇంత అన్యాయంగా లేదు. అయినప్పటికీ అదికూడా సుందరానికి తృప్తికలిగించలేదు. ఈ సమావేశానికి నాయకుడంటూ లేడు. అందరిలోకీ కాస్త దీక్షగల గోపాలశాస్త్రి నడుముకూ మోకాళ్ళకూ పైబట్ట చుట్టి రాయిలాగా కూచున్నాడు.

    "ఏం శాస్రీ? మనఊరి కుర్రాళ్ళు ఎవరెవరు జైలుకు పోతారంటావు?" అన్నాడు సరుసు.

    "ఎవరికి పోవాలనుంటే వాళ్ళంతా పోతారు. నాకు పోవాలనుంది. నేను పోతానూ!" అన్నాడు గోపాలశాస్రీ నిర్లిప్తంగా.

    "అదేమిట్రా? ఎవరితోనూ సంబంధంలేనట్టు మాట్లాడతావూ?" అన్నాడు సరసు.

     "అబ్బాయ్, నేనొకటి చెబుతున్నా విను. నువ్వేదన్నా నాటకం ఆడించ దలిచినట్లయితే అందర్నీ కూడగట్టు. ఎవరెవరు ఏయే వేషాలు వేస్తారో కనుక్కో. నేను దానికీ తయారేలే__ మనలోమాట. అంతేగాని సత్యాగ్రహంలోకి ఎవరు వస్తారన్నది ఒక ప్రశ్నా ఏమిటి? వెళ్ళాలన్న ఉత్సాహం ఉన్నవాళ్ళని వెళ్ళనీ, లేనివాళ్ళను మాననీ, కిందటిసారి నాకయిన అనుభవం చాలు."

    ఈ అనుభవం గురించి తెలుసుకోవాలనిపించింది సుందరానికి. అడగగానే  శాస్త్రి చెప్పాడు. 1921లో శాస్త్రి చదువు మానేశాడు. అతనితో కూడా మానేసినవాళ్ళలో అతన్ని చూసి మానేసిన వాళ్ళున్నారు. వాళ్ళ తల్లిదండ్రులచేత శాస్త్రి చాలా కాలం మాటలుపడవలసి వచ్చింది.

    "అదీ కాకా" అన్నాడు శాస్త్రి. "నాకీ సత్యాగ్రహంలో నమ్మకంలేదు. సత్యాగ్రహం మనకూ, మన ఆరోగ్యానికీ మంచిదే. కాని దీనిద్వారా స్వరాజ్యం వస్తుందంటే, నామటుకునాకు నమ్మకం లేదు. ఒకళ్ళమాట నా కెందుకూ? మనం జైళ్ళకిపోతే ఇంగ్లీషు వారు ఈ దేశం వదిలిపెడతారుట్రా? కల్లోమాట. అయితే జైలుకెందుకు పోతున్నావంట వేమో, స్వరాజ్యంకోసం నలుగురూ కలసి రామకోటి రాద్దామని నిర్ణయిస్తే దానికికూడా నేను తయారే. ఈ ఉద్యమంకూడా వృధాఅయిందో ఈ సారి తుపాకు లతో పోట్లాడేవాళ్ళతో చేరుతా. అదీ ఉన్నసంగతి" అన్నాడు శాస్రి.

    కుర్రకారులో ఎవరు జైళ్ళకిపోయేదీ స్పష్టంగా తెలియలేదు. పోవటానికి సిద్దంగా ఉన్నవాళ్ళలో ఒక్కడికికూడా పెద్ద వాళ్ళ అనుమతి లభిస్తుందన్న ఆశలేదు. ఒకరిదాకా ఎందుకూ? సరుసులేడూ? సరుసు జైలుకు పోతాడంటే వాళ్ళనాన్న ఒప్పుకోడని అక్కడచేరిన కుర్రకారుకందరికీ తెలుసు.
   
                                              *    *    *    *

    సుందరం అత్తవారూరు తిరిగివచ్చాడు. సుందరం వచ్చిన మర్నాటినుంచీ ఈ ఊళ్ళో కాంగ్రెసు మీటింగులు ప్రారంభమైనాయి. రోజూ రెండువేలమందిదాకా సాయంకాలం పూట మీటింగులకు హాజరవుతున్నారు. సుందరంకూడా ఈ మీటింగులకు తప్పక వెళ్ళుతూ ఉపన్యాసాలు వింటున్నాడు. ఆ ఉపన్యాసాల్లో కొన్ని భావాలు సుందరం మనస్సులో అతుక్కున్నాయి కూడానూ.

 Previous Page Next Page