Previous Page Next Page 
చదువు పేజి 77

   

      పోలీసుల్ని చూసినా వాడికి అసహ్యంవేసింది. వెధవ జీతం డబ్బుల కాసించి, వాళ్ళు దేశద్రోహపాత్రను ఎందుకు నిర్వర్తించాలి? ఇది తమ ఉద్యమేనన్న జ్ఞానం వాళ్ళకుండరాదా?

    జ్ఞానంలో సుందరానికి చాలా విశ్వాసం. జీవితంలో రాదగినమార్పులు రావటానికి అజ్ఞానంతప్ప ఇంకే అడ్డూలేదని వాడు నమ్మేవాడు. అయితే పోలీసులపట్ల వాడికున్న ఆగ్రహంతగ్గ టానికి అనుకూలంగా ఒక సంఘటన జరిగింది. ఒకరోజుఉదయం సుందరం బజారులో దుకాణంముందు నిలబడి ఉండగా ఒకపక్క నుంచి ఊరేగింపువచ్చింది. "మహాత్మా గాంధీకి జై! ఇంక్విలా బ్ జిందాబాద్" అన్న కేకలు వినపడుతున్నాయి. మరోపక్క నుంచి వందగేదెలు పరుగెత్తుకుంటూవచ్చే చప్పుడయింది.

    "పోలీసులు: లాఠీచార్జీ:" అన్నమాటలు చుట్టూ ప్రతిధ్వనించాయి. పోలీసులే  పరుగెత్తుకొంటూ    వస్తున్నారు. ఈ దృశ్యం సుందరానికి అసహ్యంగా కనబడింది. వాళ్ళు పరుగెత్తు కుంటూ రావలసినవసరం లేదు. వాళ్ళను ఎవరూ తరుముకురావటం లేదు. వాళ్ళు ఎవర్నీ తరుముకురావటం లేదు. సర్కస్ లో గుర్రాలవాడించేవాడు కొరడా అదిలిస్తే గుర్రాలు పరిగెత్తినట్టు అధికారి ఆజ్ఞకు లోబడి ఈ పోలీసులు పరిగెత్తుకుంటూ వచ్చారు. అదికూడా ఒకగ్రామాన్ని అనుసరించి కాకుండా, బెదిరిన గొడ్లలాగా:

    పోలీసులు లాటీలు గాలిలో ఆడిస్తూ వీధిలోజనాన్ని, "పొండి: పొండి:"అని అదిలిస్తున్నారు. జనం బిత్తర బోయి చూస్తున్నారు.

    సుందరం సమీపంలో ఒక పోలీసువాడు, "పక్కకి పొండి నాయనా! మీకు దణ్ణంపెడతానూ; నిలబడకండి, బాబూ!" అని జనానికి దణ్ణాలుపెడుతున్నాడు. సుందరానికింకా ఆశ్చర్యం కలిగించిందేమిటంటే, ఆ పోలీసువాడు ఇంకోక్షణంలో బావురుమని ఏడవటానికి సిద్దంగా ఉన్నట్టు కనపడ్డాడు.

    "లాఠీ చార్జీ చెయ్యటం ఈ పోలీసులకే ఇష్టంలేదు. తప్పని సరై చేస్తున్నారు!" అనుకున్నాడు సుందరం ఆశ్చర్యపడుతూ.

    తరవాత సుందరం యీమాట ఎవరితోనో అంటే, "యీ పోలీసులకి బాగా పోయిస్తార్రా! లేకపోతే వాళ్ళు వచ్చి యీ లాఠీ చార్జీలూ అవీ చేస్తారనుకున్నావేం? అది ఒకటేనా. ఒక ఊరి పోలీసుల్ని ఇంకోఊరు తీసుకుపోతారు ఏ పూర్తీ పోలీసులావూర్లో రాక్షసత్వం చెయ్యలేరని!" అని సమాధానం వచ్చింది.

    ఇటువంటి నీ చత్వంమీద ఆధార పడి ఉన్న బ్రిటిషు పరిపాలనను అంతం చెయ్యటానికి ఇంత ఉద్యమమా? ఆలోచిస్తున్న కొద్దీ, పోలీసుల్ని కూడగట్టుకోకపోవటం చాలా పొరపాటేనని పించింది సుందరానికి. కాని ఆపని చెయ్యటానికి ఎంత ప్రయత్నం కావాలో సుందరానికి తెలీదు.

    ఒకనాడు సుందరం చొరవచేసి ఒక పోలీసుతో, "మీ పోలీసులకు జీతం ఎంతఇస్తారు నాయనా?" అని అడిగాడు.

    "జీతమేంటి  బాబూ, పదమూడునుంచి పదిహేడుదాకా ఇస్తారు" అన్నాడు పోలీసు.

    "యీ భాగ్యానికేనా యీ వెధవనౌఖరీ చెయ్యటం?" అన్నాడు సుందరం నిర్ఘాంతపోయి.

    "ఏం చెయ్యాలి. నాయనా ? మా పెళ్ళాం పిల్లలు బతికేదెట్లా? ఏదో పై ఏడుపులు ఏడిచి ఎట్లాగో పొట్ట గడుపుకుంటాం" అన్నాడు పోలీసు, "మా గొడవ నీ కెందుకులే" అనకుండా సుందరానికి పోలీసులమీద విశ్వాసం ఏర్పడటానికి యీ పోలీసు చాలా తోడ్పడ్డాడు.
   
                               *    *    *    *   
   
    కాశీ నుంచి ఉత్తరం వచ్చింది, కాలేజీలు తెరుస్తున్నా రనీ, ఫలాని తేదీకల్లా వచ్చిచేరితే పూర్తి అటెండెన్స్ వస్తుందనీనూ,
 
    సుందరం మేనమామగారి ఊరు వెళ్ళాడు. తల్లితో చెప్పాడు.
 
    "మరి డబ్బెట్లాగురా?" అన్నది సీతమ్మగారు.
 
    "ఎట్లాగైనా రెండువందలు పుట్టించాలి. లేకపోతే ఇంత చదువూ చెడిపోదూ?" అన్నాడు సుందరం.

    "రెండు వందలే!" అన్నదావిడ నిర్ఘాంతపోయి సుందరం రెండు టరముల జీతం కట్టవలసి వున్నాడని ఆవిడకు తేలీదు.
 
    "అవునమ్మా! పరీక్షలకుకూడా కట్టాలిగా. రెండువందల కన్నఎక్కువే కావాలి. ముందు అదన్నా ఉంటే__"

    "రెండువందలు కాదు, రెండు రూపాయలెక్కడ తెచ్చేదీ? మీ మామేమో జైల్లోపోయి కూర్చునే. నా కెవరు పలుకుతారు, నాయనా? ఇంకానయం, సరుసుకూడా జైలుకు వెళ్ళినట్టయితే అందరం పస్తులు పడుకునేవాళ్ళమే."

    తల్లి కావాలని సత్యాగ్రహం చేస్తున్నదనిపించింది సుందరానికి. తన రెండు డిగ్రీలు ఏగంగలోకలసినా ఆవిడకు చీమకుట్టిన పాటైనా ఉండేట్టు కనబడలేదు.

    "రెండువందలంటే ఎంతమ్మా? సరుసు రెండునాటకాలు వేస్తే వచ్చేభాగ్యానికి?"
 
    "అంత సులభమైతే యీ కర్మమేం నాయనా! యిపాటికి వేలకువేలు నిలవచెయ్యకపోయినాడూ?"
 
    తను తిరిగి కాశీకి వెళ్ళే యోగ్యతలేదన్నది చాలా క్రమంగా గాని సుందరానికి తెలిసిరాలేదు.
 
    యీదెబ్బకు సుందరం బాగా కుంగిపోయినాడు. అందరూ చేరి తన చదువు చెడగొట్టినట్టు వాడికి తోచింది. తాను ప్రయాణం మానుకున్న నెలరోజులకు సరుసు జానకికి యాభై రూపాయలుపెట్టి బంగారపు గొలుసు చేయించాడని తెలిసి సుందరం సరుసునుచూసి చాలా అసహ్యపడ్డాడు. తన స్వార్ధం తనలో నీచభావాలను రేకెత్తిస్తున్నదన్న ఆలోచన సుందరానికి కలగలేదు.

   
                                                                           ౨౮
 
    1935 డిప్రెషన్. సుందరం ఆస్తియావత్తూ అప్పులవాళ్ళ పాలయింది. సుందరానికి ఉద్యోగంలేదు. ఇంట్లో మిగిలిన వస్తువులు ఒక్కొక్కటే అమ్మి తింటున్నాడు. తన సంసారానికి నెలకు 20 రూపాయలు చాలు. కాని అవేలేవు. మూడు రూపాయలు అద్దెఇచ్చి తనూ, లక్ష్మీ, పిల్లాడూ ఎవరింటోనో అద్దెకుంటున్నాడు.

 Previous Page Next Page