Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 12


    "ఏడ్వకూడదు. ఏడ్చే మగవాన్ని నమ్మకూడదని సామెత..."
    మోహనరావు మరికొద్ది క్షణాలు ఏడ్చి-"సామెతలకు భయపడి యేడుపు ఆగదు-" అన్నాడు.
    "నేనాసామెత చెప్పకపోతే నువ్వు తప్పకుండా మరి కాసేపు యేడ్చేవాడివి...."
    "నిజమే!" అన్నాడు మోహనరావు.
    "నిన్న ఆమె యెన్నింటి కింటికి వచ్చిందీ చెప్పగలవా?"
    "చెప్పలేను నిన్న ఆమె కోరికమీద పొరుగూరు వెళ్ళాను...."
    కిల్లర్ ఆశ్చర్యంగా-"అంటే ఆత్మహత్య జరిగినపుడింట్లో ఇంకెవ్వరూ లేరా?" అన్నాడు.
    "నేను లేను...."
    "ఆమె కోరిక ఏమిటి?"
    "పొరుగూళ్ళో కనకదుర్గ అలయముంది. అక్కడ దుర్గా మాతకు కుంకుమ అభిషేకం జరిపించాలంది. అక్కడి కుంకుమ తీసుకుని - ఉదయం అనగా తెల్లవారుఝామునే శివుడి దర్శనం చేసుకొని-బయల్దేరి రమ్మంది. పొరుగూళ్ళో మా బంధువులున్నారు. వాళ్ళింట్లో బసచేశాను. రాత్రికి అభిషేకం జరిపించాను. తెల్లవారుఝామున లేచి శివుడి దర్శనం చేసుకున్నాను. బయల్దేరి ఇక్కడకు వచ్చాను. ఇంట్లో సీమ ఫ్యానుకు వ్రేలాడుతోంది-"
    "అంటే నీకు పటిష్టమైన ఎలిబీ వుందన్నమాట..."
    మోహనరావు నిట్టూర్చి-"అవును-..." అన్నాడు.
    "ఆమె తను ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. నీకు ప్రమాదం వుండకూడదనుకుంది. అంటే నిన్నామె ప్రేమిస్తోందన్న మాట..."
    "కావచ్చు....."
    "నిన్నామె ప్రేమిస్తున్నప్పుడు ఆత్మహత్య అవసరమేముంది?" అన్నాడు కిల్లర్.
    "ఆమె నన్ను ప్రేమించడంలేదు కానీ ద్వేషించడం లేహ్డు. నేనామెకే లోటూ చేయలేదు. దేవతలా ఆరాధించాను. ఆమె నా విషయంలో మనసు సరిపెట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఆ వ్యవహారంలో నేనిరుక్కోవడమామె కిష్టంలేదనుకోవాలి. లేదా నేనింట్లో వుంటే తన ఆత్మహత్యా ప్రయత్నం నిరాటంకంగా కొనసాగదని బావించి ఉంటుంది...."
    "రెండోదేనిజం కావచ్చు. కానీ ఈ కథ విన్న డిటెక్టివ్ ఇంకోవిధంగా ఆలోచిస్తాడు..." అన్నాడు కిల్లర్.
    "చెప్పండి..."
    "పోతుగూరి గుడికి సీమ నిన్ను వెళ్ళమన్నదనడానికి సాక్షులున్నారా?"
    మోహనరావు క్షణం ఆలోచించి-"లేరు!" అన్నాడు.
    "అంటే కావాలనే నువ్వు ఎలిబీ సృష్టించుకున్నావని ఆరోపించవచ్చు...."
    "అయితే మాత్రం.....నేను హత్య చేయను గదా...."
    "అందుకు రెండు మార్గాలున్నాయి. ఒకటి-నువ్వు రాత్రికి రాత్రి కార్లో యిక్కడికి వచ్చి హత్యచేసి తిరిగివెళ్ళి గన్ చిప్ గా పడుకోవడం రెండు-నువ్వు హత్యకు వేరే మనిషిని వినియోగించడం....."
    "ఆత్మహత్యను హత్యగా మార్చాలని చూస్తున్నారు మీరు. రాత్రంతా మా బంధువులింట్లో పేకాడుతూ కూర్చున్నాను. కావాలంటే వెళ్ళి అడిగి తెలుసుకోవచ్చు. హత్యకు వేరే మనిషిని వియోగిస్తే అందువల్ల నాకెప్పుడూ ప్రమాదమే!" అన్నాడు మోహనరావు.
    "నీ సందేహానికి సమాధానం చెప్పగలను. సీమ ఆత్మహత్య చేసుకున్నదన్న గ్యారంటీ లేదు. ఆమె నెవరైనా హత్యచేసి వుండవచ్చు. ఇక హత్యకు వేరేమనిషిని వియోగించడంలోని ప్రమాదమంటావా? డబ్బున్నవాళ్ళందరూ స్వయంగా హత్యలు చేయాలనుకుంటే ఈ గూండా లంతా యేమైపోతారు?"
    "మీరు చెప్పదల్చుకున్నదేమిటి?"
    "సీమ తన ప్రాణాలు ప్రమాదంలో వున్నాయని ముందుగా నన్ను బ్రతిమాలుకుంది. నేనామె మాటలు లక్ష్యపెట్టలేదు. ఒక విధంగా ఆమె చావుకు నేనూ బాధ్యుణ్ణి ఆమె చావును ఆపలేకపోయినా-అందుకు కారకులైనవాళ్ళని ఉరికంబం యెక్కించితీరతాను. ఈ విషయంలో నువ్వమాయకుడివే అయితే నీకే ప్రమాదముండదు. నీకు తెలిసినదంతా చెప్పు...." అన్నాడు కిల్లర్.
    "ఇంక నేను చెప్పవలసిందేమీ లేదు. సీమను చంపిన హంతకున్ని మీరు పట్టుకుంటే ఈ పరిశోధనకు మీ రడిగినంత ఫీజిస్తాను...." అన్నాడు మోహనరావు.
    కిల్లర్ కు అతడి కళ్ళలో నిజాయితీ కనిపించింది.
    "కళ్ళు చూసి మోసపోకు!" అంటూ హెచ్చరించిందతడి ఆత్మహత్య.

                                        5

    డాక్టరు రిపోర్టు ప్రకారం సీమది ఆత్మహత్య! ఆమె వంటిమీద గాయాలు లేవు. ఎవరూ ఆమెను బలవంత పెట్టిన చిహ్నాలు లేవు.
    చనిపోయేముందు వ్రాసిన ఉత్తరంలో యిలాగుంది.
    "నా ప్రియుణ్ణి మరిచిపోలేక నన్ను నేను అంతం చేసుకుంటున్నాను. నా చావుకి ఎవ్వరూ బాధ్యులు కారు. డబ్బుకోసం ప్రేమను నిరసించే తల్లిదండ్రులకూ, ద్బబుతో ప్రేమను కొనాలనుకునే భాగ్యవంతులకూ నా చావు కనువిప్పు కలిగించగలదని ఆశిస్తున్నాను....."
    దస్తూరీ ఆమెదేననడానికి తగిన సాక్ష్యాలు లభించాయి.
    సీమ చనిపోయేముందు తనవద్ద దాచుకున్న ఉత్తరంలో ఇలా వుంది.
    "ప్రియా!
    ఇక మనం కలుసుకునే అవకాశంలేదు. డబ్బు కోసం నన్ను మరిచిపోవాలనుకున్నావు. అది నీ అసహాయత కావచ్చు. డబ్బు ప్రేమను కొనగల ఈ లోకంలో డబ్బులేని నేను ప్రేమించడమే ఒక తప్పు.
    ఇకమీదట ప్రేమకోసం కాక, డబ్బుకోసం జీవిస్తాను. వీలుపడితే తిరిగి నిన్ను డబ్బుతోనే కొనడానికి ప్రయత్నిస్తాను. నా విజయంకోసం నువ్వు యెదురుచూస్తావన్న నమ్మకం నాకుంది. ప్రస్తుతానికి నేను చేయగలిగినదల్లా శుభకాంక్షలందజేయడమే!"
    ఉత్తరం క్రింద సంతకం
                                                                                -భగ్న ప్రేమికుడు,
      అని పెట్టివుంది.
    "కేసు చాలా సులభంగా తేలిపోయింది...." అన్నాడు గోవర్ధన్.
    "అనవసరంగా సంబరపడిపోవద్దు మీరెవ్వరూ ఆ భగ్న ప్రేమికుడి గురించి ఆలోచిస్తున్నట్లు లేదు...." అన్నాడు కిల్లర్.
    "మధ్యలో అతడి ప్రసక్తి ఎందుకు?"
    "అసలతడెవరో తెలుసుకున్నారా?"
    "ఎందుకు?" అన్నాడు గోవర్ధన్ విసుగ్గా.
    "అతడికి డబ్బులేదు. అయినా సీమ అతణ్ణి ప్రేమించింది. డబ్బున్న మోహనరావును చేరుకున్నా ఆమె అతణ్ణి మరిచిపోలేదు సరిగదా అతడికోసం ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. ఆ మహానుభావుణ్ణి కళ్ళారా చూసి తరించాలని లేదూ?" అన్నాడు కిల్లర్.
    "లేదు...." అన్నాడు గోవర్ధన్.
    "అతణ్ణి కలుసుకుంటే ఆత్మహత్య హత్యగా మారవచ్చు...."
    గోవర్ధన్ భయంగా-"ఎందుకు?" అన్నాడు.
    "ఉత్తరం చదవలేదా? సీమ తనదికానందుకతడు బాగా అసూయపడ్డాడు. ఆమెను చంపాలనికూడా అతడే అనుకొని వుండవచ్చు. తనకు దక్కని సీమ మోహనరావుకు దక్కకూడదని అతడి ఆలోచన...."
    "మీకో నమస్కారం! కోడిగుద్దుకు ఈకలుపీకవద్దు" అన్నాడు గోవర్ధన్.

 Previous Page Next Page