Previous Page Next Page 
వసుంధర కధలు-7 పేజి 13


    నమస్కరించిన వాళ్ళను దీవించాలి. హంతకుడు త్వరలోనే పట్టుబడతాడు...." ఆన్నాడు కిల్లర్.
    "హంతకుడేమిటి?" అన్నాడు గోవర్ధన్.
     "మిస్టర్ గోవర్ధన్! మీకు చెప్పివున్నాను. చావుకు ముందు సీమ నన్ను కలుసుకుంది. తన పరణాలు ప్రమాదంలో వున్నాయనీ రక్షించమనీ కోరింది. కానీ నేను పట్టించుకోలేదు. అందుకు కారణం తెలుసా?" అన్నాడు కిల్లర్.
    "చెప్పండి!"
    "అప్పుడు సీమ కళ్ళలో కోరికను చూశాను. ఆ కోరికను కామవాంఛగా భ్రమించి అప్పుడు పెద్ద పొరపాటు చేశాను. అది జీవితంమీద ఆమెకున్న కోరిక అని తర్వాత అర్ధమయింది. ప్రాణాలపై ఆమెకెంతో తీపి వున్నదని నాకు తెలిసింది. ఆమె తనకుతానై చావదు. ఎవరో ఆమెను చంపారు.
    "మరి డాక్టరు రిపోర్టు...." అన్నాడు గోవర్ధన్.
    "జరిగింది హత్య అని నమ్మడం మొదలుపెడితే అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. ముందుగా ఆ ప్రేమికున్ని కలుసుకోవాలి...."
    గోవర్ధన్ కిల్లర్ తో కరచాలనం చేసి-"మీ పరిశోధన ముందుకు వెళ్ళడానికి నా శాయశక్తులా సహకరిస్తాను. కానీ మాకు సంబంధించినంతవరకూ కేసు ముగిసిందనే భావించండి-" అన్నాడు.
    "ఇదేమాట రేపు అనగలరేమో చూస్తాను!" అన్నాడు కిల్లర్ నవ్వి.

                                     6

    కిల్లర్ సీమ ఇంట్లోవారిని కలుసుకున్నాడు. వారు చెప్పిందాన్ని బట్టి సీమ మనస్ఫూర్తిగానే ఈ వివాహం చేసుకుంది. వివాహమైనాక కూడా ఆమె సంతోషంగా వుంది.
    "ప్రేమికులను విడదీసి మీరు పెద్ద తప్పుచేశారు. అందుకని మీరిలా చెప్పడంలో ఆశ్చర్యంలేదు. భర్త తన్ను చంపుతాడేమోనన్న భయమున్నపుడు ఆమె మీ యింటికి రాలేదు. వరుసగా మూడు సినిమాలు చూసి కేబరే షో చూడ్డానికి వెళ్ళింది. అంటే ఆమెకు మీపై వున్న నమ్మకం అర్ధమవుతోంది-" అన్నాడు కిల్లర్.
    సీమ తండ్రి తలవంచుకొని-"కన్నవారి మనసును బిడ్డలే అర్ధంచేసుకోలేనప్పుడు - పరాయివాళ్ళపార్దం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు-" అన్నాడు.
    "అంటే?"
    "సీమ నవనీత్ ను ప్రేమించింది. ఇప్పటికింకా అతడి కుద్యోగం లేదు. ప్రైవేట్లు చెప్పి పొట్ట పోషించుకుంటున్నాడు. పైగా అతడిది మా కులం కాదు."
    "మోహనరావు మీ కులమేనా?" అన్నాడు కిల్లర్ మధ్యలో ఆయన్నాపి.
    "అవును....."
    "ఊఁ చెప్పండి-" అన్నాడు కిల్లర్.
    "సీమకింకా పెళ్ళికావలసిన చెల్లి వుంది. కులంకానిపెళ్ళివల్ల దాని'పెళ్ళి కష్టమవుతుంది. మోహనరావును పెళ్ళిచేసుకోవడంవల్ల దాని అన్నకుద్యోగం, చెల్లి పెళ్ళికి డబ్బు-ఏర్పాటవుతున్నాయి మోహనరావు అందవికారి కాడు, దురార్గుడు కాదు. మనసుపడి సీమను చేసుకుంటా నన్నాడు. సీమ గతం గురించి తెలిసినా ఫరవాలేదన్నాడు...." సీమ తండ్రి ఆగాడు.
    "మోహనరావలా ఎందుకన్నాడో నని మీ కనుమానం కలగలేదా?"
    "ఇందులో అనుమానించతగ్గదేమీ నాకు కనబడలేదు. సీమ సుఖం గురించి ఆలోచించాను. దానికి ఇంటిల్లపాదీ నచ్చజెప్పి చూశాము. ఓ పట్టాన వినలేదు. నేను, నా ఆవిడ ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తే ఒప్పుకుంది."
    "చివరికి తను ఆత్మహత్య చేసుకుంది..." అన్నాడు కిల్లర్.
    సీమ తండ్రి తప్పుచేసినవాడిలా తలవంచుకొని-"ఇలా ఎందుకు చేసిందో నాకు తెలియడంలేదు. అతడు చాలా యోగ్యుడు...." అన్నాడు.
    "మీ అమ్మాయి అతడితో సుఖపడిందా?"
    "వాళ్ళు సుఖంగానే ఉన్నారని నాకు అనిపించేది. కానీ అమ్మాయి మాత్రం అతడు తన్ను కష్టపెడుతున్నాడని చెప్పేది. అది చెప్పే ఒక్క మాటకు కూడా ఋజువులభించేది కాదు-"
    "అంటే?"
    "అతడి ప్రవర్తన గురించి చాలా అబద్దాలు చెప్పింది. తనను హింసిస్తున్నాడనేది. వంటిమీదలాంటి గుర్తులేమీ వుండేవి కాదు. తన మాట వినడనేది అమ్మాయి కోరిక లెలాంటివో నాకు తెలుసు. పెళ్ళయ్యాక ఆ వస్తువులన్నీ అమిరాయి. అంటే దాని'మాట వింటున్నాడనేగా?"
    "మరి అబద్దాలెందుకు చెప్పేది?"
    "ఎందుకంటే దానికి మా అందరిమీదా కోపం. మా గురించి తనేదో పెద్ద త్యాగం చేశానని అంతా అనుకోవాలనుకునేది. మోహనరాఉతో పెళ్ళయ్యాక జీవితంలో దానికి తీరని కోరికలేదు. తృప్తిదాని కళ్ళలోనే కనపడేది. కానీ ఒప్పుకోవడం దానికిష్టంలేదు...."
    "ఆత్మహత్య యెందుకు చేసుకుందంటారు?"
    "అదే ఆశ్చర్యంగా వుంది...." అని సీమ తండ్రి స్వరం తగ్గించి-"చిన్నతనం నుంచీ సీమ మహా మొండిమనిషి. తాననుకున్నది సాదించనిధే ఊరుకునేది కాదు. ఇప్పుడేమో ఈ పెళ్ళి విషయంలో ఇలాగయింది. అందుకే అటు మోహనరావుమీదా, ఇటు మాపైనా పగబట్టి ఇలా సాధించాలనుకుంది. మేము చేసిన పనికి జీవితాంతం విచారించాలంటే దానికిదే మార్గం తోచింది....-" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు.
    అప్పుడాయన ముఖం చూస్తూంటే కిల్లర్ కు జాలేసింది-"ఈ పెళ్ళి చేసినందుకిప్పుడు విచారిస్తున్నారా?"
    "అవును అది సుఖపడుతుందనుకున్నాంగానీ ఇలా ప్రాణాలు తీసుకుంటుందనుకోలేదు. ఈ పెళ్ళి జరక్క పోతే కనీసం మనిషైనా మిగిలేది...నా తెలివితక్కువ తనంవల్ల అసలుకే మోసం వచ్చింది. దాని మొండితనం గురించి తెలిసీ తప్పటడుగు వేశాను..."
    "ఒక వేళ సీమ ఆత్మహత్య చేసుకోలేదేమో..."
    "అంటే?"
    "సీమ హత్య చేయబడిందని నా నమ్మకం.."
    "దాన్నెవరు చంపుతారు? ఎందుకు చంపుతారు?"
    "ఎందుకో చెప్పలేను. కానీ భర్త అయుండవచ్చు.."
    "అతడెందుకు చంపుతాడు?దాన్ని మనసారా కోరి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు. అదే తప్పుచేసినా క్షమించడానికి సిద్దంగా వున్నాడు...."
    "కావచ్చు...కానీ సీమ భర్తను విసిగించింది. అతడిపై దుష్ప్రచారం ప్రారంభించింది.."
    "అవును ఆ విషయం అతడు నాకు చెప్పుకుని బాధపడ్డాడు...."
    "మీకు చెప్పుకున్నాడా?" ఆశ్చర్యంగా అడిగాడు కిల్లర్.
    "అవును..."
    "అందువల్ల ప్రయోజనం...."
    "సీమ ప్రేమను తప్పు అంచనా వేశామని అతడు బాధపడేవాడు అయితే సీమ నిప్పులాంటి మనిషనీ-పేమతో ఆమెను తనవైపు తిప్పుకుంటాననీ అతడన్నాడు..."
    "ప్రయత్నించి విసిగిపోయాడేమో!"
    "లేదు విసుగంటూ కలిగితే అతడు తననైనా చంపుకుంటాడు తప్ప సీమ వంటిమీద చేయివేయలేడు. సీమకు చీమ కుట్టినా అతడు సహించలేక పోయేవాడు..."
    "అదంతా నటన కావచ్చు..."
    సీమ తండ్రి చురుగ్గా కిల్లర్ వంక చూసి-"సీమ గురించి మాకు తెలిసినట్లు మీకు తెలియదు. అది మొండితనంతో ఆత్మహత్య చేసుకుంది-" అన్నాడు.
    "కన్నకూతురి గురించి మీకంతా తెలుసనుకున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేక పోయారు!" అన్నాడు కిల్లర్.
    "అంటే మీ ఉద్దేశ్యం..."
    "చాలా విషయాలు మనకు తెలుసుకుంటాం. కానీ తెలియవు.."
    సీమ తండ్రి క్షణం తటపటాయించి-"మీరు మా అల్లుడిననుమానిస్తున్నారనుకుంటాను. ఒక్కసారి మా చిన్నమ్మాయి స్నేహతో మాట్లాడితే మీ సందేహాలన్నీ తీరిపోతాయి-" అన్నాడు.

 Previous Page Next Page