"నీతో చర్చ అనవసరం నిముషం పూర్తయిపోయింది కాబట్టి నేనే చెబుతాను" అంది ప్రబంధ మొండిగా "నేనడిగిన సంస్కృత వాక్యానికి జవాబు నీ వ్యక్తిత్వానికి సంబంధించినదే ప్రణయా! సహసావిధ ధీత నక్రియాం అంటే తొందరపడి ఏ పనీ చేయకూడదు."
"అదికాదు ప్రబంధా." నచ్చ చెప్పబోయింది ప్రణయ.
"పోటీ ప్రారంభానికి ముందు ఏవి అడగవచ్చో ఏవి అడక్కూడదో మనం నిర్ణయించుకోలేదు ప్రణయా! కాబట్టి ఇప్పుడు నువ్వనే నియమాలు నాకు వర్తించవు."
ప్రణయ ఇక వాదించలేదు. కాని ఆమెకు విషయం అర్ధమైపోయింది. తానిప్పుడు ఓటమివైపు సాగిపోతూంది. తన జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన ఆశయం ఈ క్షణంలో గాడితప్పి తనకే తెలీని స్థితిలో తాను కూరుకుపోతూంది.
"వడగాల్పు నా జీవితమైతె వెన్నెల నా కవిత్వం అన్న కవి ఎవరు?"
"జాషువా."
"గుత్తి వంకాయ కూరోయి బావా, గీతాన్ని రాసిందెవరు?'
"బసవరాజు అప్పారావు."
"జంఘాలశాస్త్రి పాత్రను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిందెవరు?"
"పానుగంటి లక్ష్మి నరసింహారావు."
"నవీన గుణసనాథుడు అని బిరుదు గల కవి ఎవరు?"
"నాచన సోమనాథుడు."
"తెలుగులో రచించిన మొదటి స్వతంత్ర నవల ఏది? రాసిందెవరు?"
"కొక్కొండ వెంకటరత్నం పంతులుగారి 'మహాశ్వేత.' కాకపోతే ఇది స్వతంత్ర రచన కాదు. సంస్కృత 'కాదంబరి' ఆధారంగా రాశారు."
ఆగిపోయింది ప్రబంధ. తెలుగు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నల్ని అడగకూడదని నిర్ణయించుకుంది. అంతకన్నా సంస్కృత వాక్యాలు అడిగి కంగారు పెట్టేది కాని, రోహిత్ ప్రిపేర్ చేసిన ప్రశ్నావళిలో ఇకలేవు. ఉన్నవాటిని గుర్తుచేసుకుని అడిగి ఇందాకే ప్రణయని కంగారుపెట్టింది.
"హడ్ నట్ అంటే అర్ధం? HUDNUT"అక్షరాల్ని స్పెల్ చేస్తూ చెప్పింది ప్రబంధ.
ప్రణయ జవాబు చెప్పలేదు.
"చెప్పటానికి అంత సులభమయిన పదంకాదు ప్రణయా! డిక్షనరీలో కనిపించని స్నిగ్ లెట్ ఇది."
సరిగ్గా రోహిత్ అవలంభించిన పద్ధతినే ఇక్కడ ప్రబంధ ఫాలో అవుతూంది. అంతే అనుకుంది తప్ప, రోహిత్ అదృశ్య హస్తాన్ని వూహించలేకపోయింది.
"తెలీదు."
"విడిగా ఉన్న సైకిల్ లేక కారు భాగాల్ని అసెంబిల్ చేశాక చివరగా మిగిలిపోయిన ఓ బోల్టుని హడ్ నట్ అంటారు."
"ప్లీజ్ ప్రొసీడ్" నిర్లిప్తంగా అంది ప్రణయ.
"ఫూపర్స్ అంటే FOOPERs" విడమర్చి చెప్పింది ప్రబంధ.
ఇదీ స్నిగ్ లెట్టే తెలీదు ప్రణయకి.
నిముషం గడువు తరువాత చెప్పింది ప్రబంధ కాస్త గర్వంగా.... "మనం రెస్టారెంట్ లో భోంచేస్తుండగా బయట నడుస్తూ కిటికీల్లోనుంచి మనం తినడాన్ని చూసే వ్యక్తుల్ని ఫూఫర్స్ అంటారు."
ప్రబంధకి పట్టలేనంత ఆనందంగా వుంది. ప్రతి ప్రశ్నా ప్రణయని ఇబ్బందిపెడుతుంటే ఇంత అద్భుతమైన ప్రశ్నల్ని తయారుచేయించిన సౌదామినికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది.
"ఇరవై నాలుగుని మూడు అంకెలతో ఓ ఎక్స్ ప్రెషన్ గా రాయాలి. అన్నీ ఒకే అంకెలుగా రావాలి కాని అందులో ఎనిమిది ఉండకూడదు."
అప్పటికే నెర్వస్ అయిపోయిన ప్రణయ ఇప్పుడూ తొట్రుపడింది.
"ఇరవై రెండు ప్లస్ రెండు మొత్తం ఇరవై నాలుగు" చెప్పింది ప్రబంధ "మూడు రెళ్ళు ఉపయోగించడం జరిగింది."
మరో ప్రశ్న అడిగేదే..." టైమైపోయింది" అన్నాడు ఆదిత్య వాచ్ చూసుకుంటూ.
ప్రణయ నుదుట స్వేదం పేరుకుపోయింది. మాటకి కట్టుబడే అలవాటుగల ప్రణయ ఆదిత్య ఫలితం చెప్పకముందే గ్రహించేసింది. తను ఓడిపోయింది.
అది నిస్త్రాణో, మరెన్నటికీ సరిదిద్దుకోలేని పొరపాటు జరిగిపోయిందన్న భావమో సన్నగా కంపించిపోయిందామె.
ధైర్యం సడలిపోతుంటే ఆదిత్యని చూసింది.
ఫలితం చెప్పాలని లెక్క కడుతున్నాడు తల వంచుకుని.
"మొత్తం ప్రబంధ అడిగిన ప్రశ్నలు ఇరవై నాలుగు అందులో ప్రణయ చెప్పలేనివి ఆరు జవాబులు. అంటే...." గొణుగుతున్నట్టుగా చెప్పాడు. "ఫెయిల్యూర్ ఇరవై అయిదు శాతం."
పసిపిల్లలా గావుకేక పెట్టింది ప్రబంధ. ఆనందాన్ని పట్టలేనట్టు తనకు తానే చప్పట్లు కొట్టుకుంది.