Previous Page Next Page 
ప్రణయ ప్రబంధం పేజి 72


    "విటమిన్ కె."
    
    "మనిషి చనిపోయాక కూడా అతడి శరీరంలో కొన్ని భాగాలు పెరుగుతాయి. అవేమిటి?"
    
    "గోళ్ళు, వెంట్రుకలు."
    
    "హిమాలయాల్లోని ఎవరెస్ట్ శిఖరానికి ఆ పేరెలా వచ్చింది?"
    
    నిశ్శబ్దంగా వుండిపోయింది ప్రబంధ.
    
    గడువు పూర్తికాగానే చెప్పింది ప్రణయ.
    
    "బ్రిటీష్ సర్వేయరు భౌగోళిక శాస్త్రజ్ఞుడైన సర్ జార్జి ఎవరెస్ట్ పేరుని ఈ శిఖరానికి నిర్ణయించడం జరిగింది."
    
    "దాదాపు నాలుగు శతాబ్దాలపాటు వర్షం పడని పొడి ప్రదేశం ఏది?"
    
    "దక్షిణ అమెరికా చిలీలోని అటకామా ఎడారి."
    
    "మనం రోజూ రోడ్లపై చూసే ట్రాఫిక్ లైట్స్ ని ప్రపంచంలో మొదట ఏ దేశంలోని ఏ పట్టణంలో ప్రవేశపెట్టారు?"
    
    "1918వ సంవత్సరంలో న్యూయార్కులో..."
    
    "గూడ్! ఐక్యరాజ్యసమితిలో గాత్ర కచేరీ చేసిన తొలి భారతీయ వనిత ఎవరు?"
    
    "ఎమ్మెస్ సుబ్బలక్ష్మి."
    
    "పి టి ఉష పూర్తి పేరు?"
    
    గుర్తు చేసుకోవాలని ప్రబంధ ప్రయత్నిస్తుండగానే నిముషం గడువు పూర్తయిపోయింది.
    
    "పిలవుళ్ళకండి తెక్కవరంబిలే ఉష" అంటూ ప్రణయ చెబుతుండగానే జోక్యం చేసుకున్నాడు ఆదిత్య.
    
    "ఓవర్..." రిస్ట్ చూసుకుంటూ అన్నాడు ఆదిత్య.
    
    "ఆరు నలభై అయిదు నిమిషాలయ్యింది. అంటే అరగంట పూర్తయిపోయింది."
    
    మొత్తం ప్రశ్నలన్నీ, ప్రబంధ చెప్పలేని జవాబుల్నీ లెక్కచూసుకుని చెప్పాడు ఆదిత్య. అరగంట వ్యవధిలో ప్రణయ అడిగిన ప్రశ్నలు ముప్పై ఒకటి. అందులో ప్రబంధ చెప్పలేనివి ఆరుమాత్రమే. అంటే పందొమ్మిది పాయింట్ మూడు అయిదు శాతం ఫెయిలైనట్టు.
    
    సరిగ్గా అయిదు నిముషాల తరువాత మళ్ళీ పోటీ ప్రారంభమైంది.
    
    "మిస్ ప్రణయా!" ప్రబంధ గొంతులో అహం ధ్వనించింది. "ఫోర్డ్ నాక్స్ అంటే ఏమిటి?"
    
    హఠాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది. ఆదిత్యకి అర్ధంకానట్టు చూస్తూండగానే చెప్పింది ప్రబంధ- "ఫోర్డ్ నాక్స్ ఆటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఓ సైనిక స్థానం స్థావరం ఇక్కడ ప్రభుత్వ బంగారు నిల్వలు వుంటాయి."
    
    "త్రాచుపాముకి, రేబిల్ స్నేక్ కి తేడా?"
    
    "మొదటిది గుడ్లు పెడితే, రెండోది పిల్లల్ని పెడుతుంది."
    
    "అతిథులు ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవటానికి యిచ్చే నీళ్ళను "పాద్యం" అంటారు. మరి చేతులు కడుక్కోటానికి ఇచ్చే నీళ్ళ పేరు?"
    
    "అర్ఘ్యం."
    
    "ధృతరాష్ట్ర గాంధారులకి నూరుగురు కొడుకులు గాక ఓ కూతురూ వుంది. ఆమె పేరు?"
    
    చెప్పలేకపోయింది ప్రణయ.
    
    కేవలం ప్రణయను ఓడించడమే ధ్యేయంగా రోహిత్ చాలా శ్రమించి తయారుచేసిన ప్రశ్నలవి. ఓ రోజంతా లైబ్రరీలో కూర్చుని ప్రిపేర్ చేశాడు అదీ రాష్ట్ర హోం మంత్రి పద్మనాభం అభ్యర్ధనపైన. పద్మనాభం తమ్ముడు ప్రస్తుతం లండనులో వుండటంతో చాలా రోహిత్ కి పద్మనాభం పరిచయమై, అక్కడ అతడి ద్వారా ఓ యుద్దానికి అస్త్రాల్ని సిద్దం చేయించాడు. రోహిత్ కోరేదీ ప్రణయ ఓటమే మరి!
    
    "నిముషం పూర్తయింది" గొణుగుతున్నట్టుగా చెప్పాడు ఆదిత్య.
    
    "ధృతరాష్ట్రుడి కూతురి పేరు దుస్సల."
    
    "నాకు నమ్మకం లేదు" టక్కున అంది ప్రణయ.
    
    "తరువాత వెరిఫై చేసుకోండి!" ఎగతాళిగా నవ్వింది ప్రబంధ "నీకు తెలీనివన్నీ నిజాలు కాకుండా పోవు!" క్షణం ఆగి మళ్ళీ అడిగింది.    
    
    "ఏసుక్రీస్తు చేసిన మొదటి అద్భుతమేమిటి?"
    
    క్విజ్ కాంపిటేషన్ లా లేదు. ప్రబంధ పొంతనలేని ప్రశ్నలతో కంగారు పెడుతూందని బోధపడింది ఆదిత్యకి.
    
    "ఒక పెళ్ళి సమయంలో నీళ్ళను ద్రాక్షసారాయిగా మార్చి తన ప్రతిభను నిరూపించుకున్నాడు క్రీస్తు తొలిసారిగా."
    
    "గూడ్!" వెంటనే అంది ప్రబంధ. కాని అది అభినందనలా లేదు ఎగతాళిగా ధ్వనించింది.
    
    "సిక్కుల మత గ్రంథం పేరు?"
    
    "గురు గ్రంథ సాహెబ్."
    
    "అద్వైత మత స్థాపకుడు శంకరాచార్యులవారు పుట్టిన ఊరు, గురువు, పేరు ఏది?"
    
    "పుట్టింది కేరళలోని కాలడి గురువు గోవిందపాదుడు."
    
    "ప్రస్థానత్రయం అంటే?"
    
    "ఉపనిషత్తులు, వేదాంత సూత్రాలు, భగవద్గీత."

    "విద్యా విమీనః పశుః అనే వాక్యం ఎవరిది?"
    
    "భర్త్రుహరి వాడిన వాక్య మిది."
    
    "ప్రఖ్యాత హిందీ రచయిత ప్రేమ్ చంద్ అసలు పేరు?"
    
    "ధనపతిరాయ్ శ్రీవాత్సవ."
    
    "భారతీయ భాషల్లో ఉత్తమ సాహిత్య రచనకు ఏటా ఇచ్చే జ్ఞానపీఠ్ అవార్డ్ నెలకొల్పిందెవరు?"
    
    "శ్రీమతి రమాజైన్ శ్రీ కాంతి ప్రసాద్ జైన్ బార్య."
    
    "సహసా విధధీత నక్రియాం అంటే ఏమిటి?"
    
    వెంటనే అంది ప్రణయ "తెలీదు కాని ఇలాంటి ప్రశ్నలు అడగడం క్విజ్ నిబంధనలకి విరుద్దం ప్రబంధా!"
    
    "చేతకానప్పుడు చేతులెత్తి పక్కకు జరిగిపొ అంతేకాని అలా అడ్డం పడకు" మొండిగా అంది ప్రబంధ.
    
    "నువ్వడిగిన ప్రశ్నకు జవాబు చెప్పటానికి నేను సంస్కృతంలో పాండిత్యం గల వ్యక్తిని కాను."

 Previous Page Next Page