పుట్టింపన్ జలజాతసంభవుడవై, పోషింప వెన్నుండవై,
గిట్టింపన్ పురవైరివై, ఉపనిషద్గీర్వాణబృందంబులున్
పట్టంజాలని యట్టి యాదిమపర బ్రహ్మంబవే నీవు; నీ
గుట్టెవ్వారు కనంగనేర్తురు దయాకూపార! కోటీశ్వరా!
నీ కాల్దామరపాదులో మొలకలై, నీ ప్రేమవర్షాన మా
రాకుల్ వైచుచు, పాతకంబు లను పండాకుల్ ధరన్ రాల, నెం
తే కాంతం బగు నాదు భక్తిలత వృద్ధిం గాంచి నీ పాదమే
ప్రాకుంగాక, విపన్నభక్తజనకల్పక్ష్మాజ! కోటీశ్వరా!
ఆసింపన్ గనకాద్రి; లేడికొదమన్ యాచింప; జాబిల్లిపై
నాసం జెందను; వెండికొం డడుగ; నభ్యర్థింప వేరెద్దియున్;
నీ సాన్నిధ్యము జేర్పు మియ్యదియె తండ్రీ! నాయభీష్టం; బికే
లా సందేహము నందె దార్తజనపాలా! బాలకోటీశ్వరా!
వెయ్యార్లిమ్మనలేదె; సంపదల కువ్విళ్ళూరగాలేదె! నీ
వియ్యంబంద దలంపలేదె; సకలోర్వీరాజ్యసంప్రాప్తికై
చెయ్యిం జాపగలేదె; తావక శుభశ్రీ పాదపద్మమ్ములం
దయ్యా! నా మది నిల్ప వేడితి మహాత్మా! బాలకోటీశ్వరా!
భక్తింపంగనులేదె ఘోరవిషమున్ బ్రహ్మాండముల్ కావగా;
రక్షింపంగనులేదె "పాహి" యన మార్కండేయు; దైత్యావళిన్
శిక్షింపంగనులేదె, ఆర్తులగు జేజే పౌజులం గూర్మితో
నీక్షింపంగనులేదె; చేకొనగరాదే నన్ను! కోటీశ్వరా!
ఆలింపంగదవయ్య జాలిమదితో నస్మద్విలాపంబులన్!
లాలింపంగదవయ్య ప్రేమకలితాలాపంబులన్! నా పయిన్
చాలింపంగదవయ్య కోపముల! వే సైరించి నా పాపముల్
పాలింపంగదవయ్య నన్ను! కరుణాపాథోధి! కోటీశ్వరా!
ప్రాయం బెన్నగ పిన్న; ఎన్నదగు మేల్ పాండిత్యమా సున్న; ఏ
మీయంజాలుదు నన్న నీకు; నిపు డేనేదో యథాశక్తి త
ప్పో యొప్పో తగు భంగి పద్యకుసుమంబుల్ గ్రుచ్చి యీ మాలికన్
వేయంబూనితి నీదు కంఠమున; వేవే గొమ్ము! కోటీశ్వరా!
శ్రీదేవి - గౌరీదేవి
"ఎచ్చట కేగెనే బిచ్చాల బావయ్య?"
"బలి దానవేంద్రుని భవనమునకు;"
"తరళేక్షణా! నేడు తాండవం బెచటనే?"
"బృందనో! మరి ఆలమందలోనొ!"
"ఎగసి బుజా లెక్కు మృగశాబక మ్మేది?"
"ఆ వరాహం బెట కరిగినదియొ!"
"బిక్కచిక్కిన వృషభం బెక్కడే? అక్క!"
"గోపాలు డెచటనో మేపుచుండె;"
అనుచు ఎత్తుకు పైయెత్తు హాస్యమధుర
రమ్య సల్లాపముల దేలు రమయు నుమయు
భరతపుత్రుల జీవిత పథములందు
సిరులు శుభము లనుగ్రహించెదరు గాక!!
కైవారము
స్మితభాషణ! శ్రితతోషణ! హితభానుతనూజా!
సితమార్గణ! జితరావణ! ధృత సాధుసమాజా!
అతిధార్మిక! శ్రుతి మార్మిక! కృతకార్ముక! రామా!
రఘునందన! రఘునందన! రవివంశ లలామా!
మిథిలాధిప తనయా మృదు హృదయాబ్జ విహారా!
బుధసన్నుత! పదసంశ్రిత పవమాన కుమారా!
శిథిలీకృత భవబంధన! ప్రధనాంగణ భీమా!
రఘునందన! రఘునందన! రవివంశ లలామా!
సుజనావన! ఋజుభావన! త్రిజగన్నుత చరితా!
రజనీచర రణభీకర! విజయోత్సవ భరితా!
అజరామర సుయశోధర! భుజవిక్రమధామా!
రఘునందన! రఘునందన! రవివంశ లలామా!
సురరంజన! ఖరభంజన! శరణాగత బంధో!
పరిపాలయ! పరిపాలయ! కరుణారస సింధో!
అఘశోషణ! మఘపోషణ! అరిభీషణనామా!
రఘునందన! రఘునందన! రవివంశ లలామా!
కృష్ణమ్మ తల్లి
జయతు జయతు కృష్ణా శాంతినిష్క్రాంత తృష్ణా
జయతు జయతు వేణీ సంభృతామ్నాయవాణీ
జయతు విజయదాత్రీ సహ్యశైలేంద్రపుత్రీ
కలుష మపనయంతీ కృష్ణవేణీ స్రవంతీ
ముకు మూసుకొని ఒక్క మునక వైచిన చాలు
పూర్వపుణ్యమ్ములు పులకరించు;
దోసెడు నీళ్ళు పైబోసికొన్నం జాలు
సంసారతాపాలు సమసిపోవు;
కందోయి విందుగా గాంచి మ్రొక్కిన చాలు
పాతకమ్ములు పటాపంచలగును;
కదలాడు కెరటాల గాలి సోకిన చాలు
కైవల్య లక్ష్మి స్వాగత మొసంగు;
"కృష్ణ" యని ఒక్కసారి పల్కినను చాలు
మనసులోపలి వ్యథలెల్ల మాయమగును;
భువన పావన పుష్కర పుణ్యవేళ
ఆర్తజన కల్పవల్లి! కృష్ణమ్మతల్లి!
ఈ దయామయి గుండె లింత పొంగెనొ లేదొ!
మంటిలో బంగారుపంట లెగసె;
ఈ యమ్మ కెరటమ్ము లింత సోకెనొ లేదొ!
తొలి బాము నోములు తొలకరించె;
ఈ పవిత్రజలంబు లింత గ్రోలెనొ లేదొ!
తుద లేని దాహాలు తొలగి పోయె!
ఈ తల్లి తీరాన ఇంత వాలెనొ లేదొ!
దేహతాపము లెల్ల తీరిపోయె;
కడుపు చల్లనితల్లి! బంగారు వెల్లి!
సకలజన కల్పవల్లి! కృష్ణమ్మ తల్లి!
పొంగి ప్రవహించె పుష్కర పుణ్యవేళ
"రంగ దుత్తుంగ పుణ్యతరంగ" యగుచు.
వేదాద్రి శిఖరాన వేంచేసి యున్నట్టి
నరసింహు శ్రీ చరణాలు కడిగి,
అమరావతిని శ్రీ మదమరేశ్వరస్వామి
కమృతాభిషేక కృత్యమ్ము నెరపి,
కనకదుర్గమ్మ చక్కని వాలుజడపైన
చిరు కెరటాల క్రొవ్విరులు గురిసి,
శ్రీకాకుళేశుని చిన్నారి పెదవుల
స్మితరేఖలకు రసార్ద్రత ఘటించి,
లీల హంసలదీవి గోపాలదేవు
దివ్య మురళీ స్వరాలలో దేలియాడి
శ్రీలు చిందించె అందాల పాలవెల్లి
అర్థిజన కల్పవల్లి! కృష్ణమ్మ తల్లి!
"పదిరేండేండ్ల వరాలపంట" యయి సంప్రాప్తించు శ్వశ్రేయస
ప్రదమౌ "పుష్కర పుణ్యపర్వ"మిది; పాపాలన్ నివారించి సం
పద లందించు తరంగ హస్తముల రమ్మంచున్ మిముం బిల్చుచు
న్నది కృష్ణమ్మ; సబంధుమిత్రముగ స్నానంబాడ రండో ప్రజల్!