Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 49

 

                                   నిత్య కల్యాణి

    భారత జనయిత్రి గారాబుబిడ్డవై
        తెలుగు సంస్కృతీ తీర్చి దిద్దినావు
    పంచగంగలలోన ప్రఖ్యాతి గదియించి
        కలికల్మషముల పోకార్చినావు
    తంగెళ్ళబీళ్ళలో బంగారు పండించి
        పేదల కన్నంబు పెట్టినావు
    అంధ్ర పౌరుషమున కద్దాల మీడవై
        వెలుగు వెల్లువలతో వెలసినావు

    కనకదుర్గాప్రదత్త ప్రకాశ కలిత
    లలిత మణిమేఖలా సముజ్జ్వలిత మధ్య!    
    తెలుగుబిడ్డలా ఆశీర్వదింపు మమ్మ!
    అమృతరసముల వెల్లి! కృష్ణమ్మతల్లి!

    సహ్యపర్వతరాజు సౌధాంగణమ్ములో
        అల్లారుముద్దుగా నటలాడి
    తుంగభద్రా పరిష్వంగ సంగతి సము
        త్తుంగ తరంగాల పొంగి పొరలి
    శైవ వైష్ణవ బౌద్ద సంస్కృతులను మేళ
        వించి అల్లిన నీలవేణి దాల్చి
    'అమరేశ్వరు"నకు 'దుర్గాంబ" కు 'ఆంధ్ర వి
        ష్ణు"నకు పాదాభివందన మొనర్చి

    కడలిరాయని యింటిలో నడుగు పెట్టు
    నిత్యకల్యాణి ! కృష్ణవేణీభవానీ!
    సర్వసౌపర్వ పుష్కర పర్వవేళ
    తెలుగుబిడ్డల ఆశీర్వదింపు మమ్మ!

    భాగీరధీ స్నానఫల మబ్బునటే! నీదు
        కెరటాల గాలి యొక్కింత సోక
    యమున ముంగిట వత్సరము తపస్సటే! నీదు
        జలములు నెత్తిపై చల్లుకొన్న
    నర్మదాతటిని యజ్ఞము చేసినట్లే! నీ
        వారి లోపల నొక్కసారి మునుగ
    సకల తీర్ధాలలో జలకమాడినయట్లే!
        నీలోని గ్రుక్కెడు నీళ్ళు త్రావ
    
    హరహరుల దివ్యతేజమ్ము నంది నీవు
    "కృష్ణ" వై "వేణి " వై ప్రవహించినావు;
    తెలుగుబిడ్డల ఆశీర్వదింపు మమ్మ!
    అర్తజన కల్పవల్లి! కృష్ణమ్మతల్లి!

    లంచాలు తెగమేసి లంబోదరాలతో
        పండిపోయిన మహాపాతకులును
    పార్టీలు మార్చి కొంపలు ముంచి గదియించి
        నీతి మాలిన నష్టజాతకులును
    హాస్టళ్ళసొమ్ము "స్వాహ" చేసి పిల్లల
        కడుపు గొట్టిన అన్నఘాతకులును
    తన క్రింది ఉద్యోగులను గ్రుడ్లురిమి "రాచి
        రంపాన బెట్టు "కిరాతకులును
    
    వచ్చియున్నారు కొందరు; వారి వారి
    కల్మషంబులు నీ "వారి ' కడిగికొనగ;
    ఇన్ని పాపాల నెట్లు భరింపగలవో!
    ఆశ్రితానందవల్లి! కృష్ణమ్మతల్లి!

    "పన్నెండేడుల కొక్కమాటు తమవో పాపాలు బావంగ నీ
    వున్నా" వన్న కడింది నమ్మకములో నుప్పొంగి, రాత్రింబవ
    ళ్ళేన్నో పాపము లాచరించిన కృపాహీనుల్ త్రాపాహీను, లీ
    కన్నుల్ గానని దుండగీంద్ర యెడ నీ కారుణ్య మేపాటిదో!!

    పాపాలకు కడు పశ్చా
    త్తాపం పడు దీనజనుల దయ లోగొని, త
    త్పాపంబులు శాపంబులు
    తాపంబులు దీర్చు జనని! దాక్షిణ్యధునీ!
    
    "గంగ" మును "కాకి" యై మునుగంగ "హంస
    దేహము లభించె హంసలదీవి నండ్రు!
    "దానవుడు" మున్గి మానవత్వము గనిన,
    "మానవుడు" మున్గి యే మహామహిమ గొనునో!!

        
                               ఆసతో మా సద్గుమయ
    
    అమరజీవి శ్రీరాములు అంతరాత్మ ఏమన్నది?
    "ఆరుకోట్ల తెలుగువారి ఆత్మ ఒక్కటే" నన్నది
    
    తెలివెలుగుల పాలవెల్లి తెలుగుతల్లి ఏమన్నది?
    "మనుజులు దనుజులుగ మారి అనుజుల తినరా" దన్నది

    చెల్లి మూడుపాయల సిరిమల్లెల జడ ఏమన్నది?
    'ఆంధ్ర తెలంగాణా రాయలసీమలె నే: నన్నది
    
    ప్రాగ్గిరిపై ఉదయించే భానుబింబ మేమన్నది?
    "నా ఉదయం నరుల కెల్ల నవననాభ్యుదయ" మన్నది.

    గడ్డిమోపు లమ్ముకొనే గుడ్డిపిల్ల ఏమన్నది?
    "గరీబైన నవాబైనా కష్టపడి తినా" లన్నది.

    
                                    ఆదికవి

    రసరమ్య హృదయుడౌ రాజరాజనరేంద్రు
        అనురాగపూర్వకాభ్యర్ధనములు
    ఆప్తమిత్రుడు సహాధ్యాయుడు నైన నా
        రాయణభట్టు సౌహార్దసుధలు
    రంగదుత్తంగ తరంగ గోదావరి
        స్నిగ్ధశీతల పయశ్శీకరములు
    భారత భారతీ దౌరేయుడైన పా
        రాశర్యు భవ్యదివ్యాశిషములు
    
    కారణమ్ములు సుద్భోధకములు గాగ
    బాదరాయణుపంచమవేద మైన
    భారతమునకు తెలుగురూపమ్ము దిద్దే
    "ఆంధ్రకవితాస్వరాట్టు"! నన్నయ్యభట్టు!
    
    నగములు కంపింప గగనానికెగసిన
        అల గరుత్ముంతు రెక్కల బలమ్ము
    సర్పయాగమునకు స్వస్త్రి చెప్పించు ఆ
        స్తీకుని మధురవక్ర్తుత్వ గరిమ
    కొలువులో సత్యమ్ము కొరకు పోరాడిన
        సతి శకుంతల ధైర్యసాహసమ్ము
    దుశ్శాసనుని పైకి దూకబోయేడి భీమ
        సేనుని వీరవిజ్రుంభణమ్ము
    
    ధర్మజు తీతీక్ష - భీష్ముని త్యాగదీక్ష-
    కర్ణు శౌర్యము - పార్ధుని గరువతనము -
    చైద్యుని దురక్తి - కృష్ణుని సహనశక్తి -
    కదను త్రిక్కెను నన్నయ్య గంటమందు.

    చెలువవుమొగ్గలై! రసము చిందేడు చందనచారుచర్చలై!
    నళినదళంబులై! మృదుమృణాళములై! నవనందనమ్ములై!
    జలనిధి మౌక్తికాలయి! లసత్తరతారకహరపంక్తులై!'    
    తళతళలాడు "నన్నయ్య పదమ్ముల " పై తలవంచి మ్రొక్కెదన్!!

    చిన్నారి తెలుగుకవితను
    కన్నయ్యా'! కవుల కగ్రగాణ్యూడవౌ పె
    ద్దన్నయ్యా! కైమోడ్పులు
    నన్నయ్యా! కనుము ముదమునన్ నన్నయ్యా!

    పావన హోమధూమముల పంక్తులు, శాంత తపోవనంబులున్,
    మావులు, క్రోవులున్, మలయమారుతముల్, ఘనసారపాంసులున్,
    దావులు జిమ్ము ఆదికవి నన్నయ గుండెలలో 'అఖండ గో
    దావరి" పొంగులేత్తెను గదా! నవభారత నాట్యలక్ష్మియై!

    అక్షరరమ్యతాగుణసమంచితమైన భవత్కవిత్వమం
    దక్షరలక్షలున్నవి గదయ్య! భవ ద్రుచిరార్ధసూక్తులన్
    ద్రాక్షలు పండే; నిండెను సుధారసవాహిని సాహితీ సహా
    స్రాక్షుడవైన నీదగుప్రసన్న కధాకలితార్దయుక్తిలో!

 Previous Page Next Page