Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 2 పేజి 47


                                     ఆనందలహరి

                                                           (పద్య గద్య కవితా సంపుటి)    

                                                         పసిడి పాదాలు

    పిలిచినవారికి ప్రేమాంబురాశియై
        సిరిసంపదలు కటాక్షించు స్వామి
    కొలిచినవారికి కొంగు బంగారమై
        కరువు కాటకము పోకార్చు స్వామి
    ప్రార్థించువారికి ప్రత్యక్షదైవమై
        కోరిన కోర్కె చేకూర్చు స్వామి
    మ్రొక్కినవారికి ముంజేతి దివ్వెయై
        దీప్తిరేఖలు దిద్దితీర్చు స్వామి

    ఏడుకొండల పయి వసియించు స్వామి
    లీల నీరేడు భువనాల నేలు స్వామి
    జాలిగల స్వామి "పసిడిపాదాల" స్వామి
    శ్రీనివాసుడు మమ్ము రక్షించు గాక!!

                                   శ్రీమహాలక్ష్మి

    "ధనలక్ష్మి"యై ప్రమోదము నిచ్చు తల్లి! "వి
        ద్యాలక్ష్మి"యై పూజలందు తల్లి!
    "సౌభాగ్యలక్ష్మి"యై శోభిల్లు తల్లి! "సం
        పల్లక్ష్మి"యై విరాజిల్లు తల్లి!
    "సంతానలక్ష్మి"యై సంతోషమిడు తల్లి!
        "ధాన్యలక్ష్మి"గ సిరుల్ దార్చు తల్లి!
    "గజలక్ష్మి"యై విశ్వవిజయ మ్మొసగు తల్లి!
        "వీర్యలక్ష్మి"గ ప్రభవించు తల్లి!

    "అష్టలక్ష్మీ" స్వరూపిణి యైన తల్లి!
    ఆమె వరలక్ష్మి జయలక్ష్మి ఆదిలక్ష్మి
    శ్రీ మహాలక్ష్మి మమ్ము రక్షించుగాక
    చల్లచల్లని చూపులు వెల్లివిరియ.

                                    ఆనందలహరి

    శ్రీ గౌరీ రమణీమణీ స్తనయుగ శ్రీ గంధ సౌగంధ్య సం
    యోగాభోగ భుజాంతరాళ! నిగమాంతోద్యాన కేళీ విలో
    లా! గోవింద పురందరాది నుతలీలా! భక్తచిత్తాను కూ
    లా! గీర్వాణ మునీంద్ర మానస మరాళా! బాలకోటీశ్వరా!

    మోక్షాధ్యక్ష! కృతాంత శిక్ష! భవసమ్మోహాబ్ధి నిర్మగ్న సం
    రక్షాదక్షకటాక్ష! వహ్నిశశిమార్తాండాక్ష! భక్తావళీ
    సాక్షాత్కాల్పకవృక్ష! దర్పకవిపక్షా! దంతిదైత్యేంద్ర హ
    ర్యక్షా! వందిత సిద్ధసాధ్యసురయక్షా! బాలకోటీశ్వరా!
    
    కారుణ్యామృతపూర! భూమిధరరాట్కన్యామనశ్చోర! సం
    సారాంభోనిధి కర్ణధార! మునిహృత్సంచార! దీవ్యద్దయా
    పారావార! ఫణీంద్రహార! విలసద్బాలేందు కోటీర! నీ
    హారాసార పటీర పారద శరీరా! బాలకోటీశ్వరా!

    దేవా! దేవకిరీటరత్న సుషమాదేదీప్యమానాంఘ్రి రా
    జీవా! గాంగ తరంగ శీతల దయా జేగీయమానోల్ల స
    ద్భావా! వేల్లిత భోగి భోగ మణి శోభాభాసమానామల
    గ్రీవా! పావన కీర్తి! సత్వమయమూర్తీ! బాలకోటీశ్వరా!

    భర్గా! స్వీయకథాసుధారసరుచి ప్రాచుర్యదూరీకృత
    స్వర్గా! సుందర సుస్మితాంకురశిరశ్చంద్రప్రభాన్యోన్య సం
    సర్గా! ప్రేమరసాతిరేక మహిమాంచద్వామభాగోల్లస
    ద్దుర్గా! పూజిత భక్తి బంధుర సుధాంధోవర్గ! కోటీశ్వరా!

    శ్రీదంబుల్, భవబంధబంధురలతాచ్చేదంబు, లాత్మాశ్రితా
    హ్లాదంబుల్, కలిత ప్రసాదములు, దేవాధీశ మౌళిస్రగా
    మోదంబుల్, కలుషాపనోదములు, సన్మోదంబులౌ నీదు శ్రీ
    పాదంబుల్ భజియింతు, ప్రేమ గనుమప్పా! బాలకోటీశ్వరా!

    నిను బ్రార్థింపగ, నీ కథల్ చదువగా, నీ దివ్యచారిత్రముల్
    వినగా, నీదు మనోహరాకృతి మదిన్ వీక్షింపగా, నీదు పా
    వననామంబె స్మరింపజేసి నను దేవా! ప్రోవవే, శైలరా
    ట్తనయామానసరాజహంస! శిథికంఠా! బాలకోటీశ్వరా!

    దిట్టన్ గాను, బుధుండ గాను, విషయాధీనుండ, దీనుండ; నే
    పట్టున్ లేక భవాంబుధిన్ బడి భయభ్రాంతుండనై యుంటి; మీ
    దెట్టున్ తోచదు భక్తినావపయి నన్నెక్కించి కైవల్యపుం
    గట్టున్ జేర్చగదయ్య! చయ్యన, శుభాంగా! బాలకోటీశ్వరా!

    నెత్తిన్ దోసెడు నీళ్లు పోసిన వెసన్ నీ దాపుకుం జేర్తువౌ,
    బత్తిన్ పత్తిరి సుంత పైనిడ మహాభాగ్యంబు జేకూర్తువౌ;
    చిత్తంబందు తలంప పాపముల భస్మీభూతమున్ జేతువౌ;
    ముత్తింగూర్తువు కేలుమోడ్చిన స్వయంభూ! బాలకోటీశ్వరా!

    నీకున్ దీటగు వేల్పు లెన్న భువనానీకంబులో లేరుగా!
    నాకున్ దీటగు నల్పు లెన్నగ జగన్మధ్యంబునన్ లేరుగా!
    నీకున్ నాకును బాగుగా కుదిరె తండ్రీ! మంచియో చెడ్డయో
    శ్రీకారుణ్యకటాక్ష రక్షణచణా! శ్రీ బాలకోటీశ్వరా!

    నే నీ దాసుడ, నీవు నా దొరవు తండ్రీ! నూరు జన్మాలకున్;
    నే నీ భక్తుడ, నీవు నా పతివి తండ్రీ! వేయి జన్మాలకున్;
    నే నీ బిడ్డను, నీవు నా పితవు తండ్రీ! జన్మజన్మాలకున్;
    నీ నా చుట్టరిక మ్మఖండ మగు తండ్రీ! బాలకోటీశ్వరా!

    నీ వాడించెడి తోలుబొమ్మలము తండ్రీ! పుణ్యమో పాపమో
    నీ వాడించెడి భంగి నాడెదము; మా నేరంబు లేశంబు లే;
    దావేళన్ మము జూచి దండధరు డే యార్భాటముల్ సేయునో!
    దేవా! పిమ్మట మమ్ము నన్న పనిలేదే! బాలకోటీశ్వరా!

    ఆర్తత్రాణపరాయణుండవట గావా నీవు దేవేశ! యా
    యార్తానీకములోన ముఖ్యుడను నే; నట్లౌట నెట్లేని నా
    యార్తిం బాపి భరించు భారమది నీ యందుండె; లేకున్న త్వ
    త్కీర్తిన్ వ్యర్థము జేసికొందువె దయాబ్ధీ! బాలకోటీశ్వరా!

    ఎమ్ముల్ సొమ్ములు; చేదు భోజనము; నట్టిల్లా శ్మశానంబు; స
    ర్పమ్ముల్ పేరులు; తోలు ధోవతి; చితాభస్మంబు మైపూత; భా
    గ్యమ్మీరీతిగ నుండె నీకు; నిజభక్తశ్రేణి కేమిత్తు? మా    
    కిమ్మా నీ పదభక్తి యొక్కటియె; యింతే చాలు! కోటీశ్వరా!

    బంగారయ్యె విరించి బొజ్జ; యటులే పద్మాక్షు దువ్వల్వయున్
    బంగారయ్యెను; గాని, స్వామి పలుకే బంగారమైపోయెనే!
    కంగా రందుచునున్న నన్ గరుణ దొల్కం గారవింపంగదే!
    గంగాభంగ తరంగ సంగత వరాంగా! బాలకోటీశ్వరా!

    జడదారుల్ విడరాని భక్తిలతలన్ సంధించి బంధింపగా
    బడలే కెవ్వరు చేరకుండుటకు నీ పన్నాగముం బన్నితే?
    జడలున్ జెఱ్ఱులు పుఱ్ఱె లగ్గికనులున్ చర్మంబులున్ దాల్చినన్
    దడియన్ సుంతయు నిన్ను గాంచి, విడువన్ త్వద్భక్తి; కోటీశ్వరా!

    ఎత్తౌ కొండల సంచరింప తమ రెంతే డస్సినారో ప్రభూ!
    చిత్తం బీడకు రండు; ఇత్తునిదె నా చిత్తంపు నెత్తమ్మి పూ
    మెత్తన్; మెత్తగ నొత్తిగిల్లు డిట; కూర్మిన్ బత్తిపూబోణిచే
    నొత్తింతున్ తమ పాదపద్మములు బాబూ! బాలకోటీశ్వరా!

    నీ నామంబు సమస్తపాపహరమౌ; నీ దర్శనం బెన్న బ్ర
    హ్మానందంబగు; నీ పదార్చనము పాపానీకవిధ్వంసమౌ;
    కానన్ నాకు భయం బికేమిటికి? నీ కాల్దామరన్ నమ్మితిన్
    జ్ఞానానందమరందముం గొన మహేశా! బాలకోటీశ్వరా!

    నీవే దిక్కనినాను; నెమ్మదిని నిన్నే నమ్మియున్నాను; నీ    
    సేవల్ వీడగలేను; తుచ్ఛసుఖముల్ చేకోను; నీ కన్యమౌ
    దైవంబున్ భజియింపబోను; ఘనవిద్యావంతుడన్ గాను; నన్
    బ్రోవంబూను; కృశానుభాను హిమభానుత్ర్యక్ష! కోటీశ్వరా!

    ఆడాడన్ తిరుగాడ నేటికి దొరా! ఆయాసమౌ నీకు; నా
    దౌ డెందంపు టరణ్య మున్నదిట; నీ వౌత్సుక్యముం దీర వే
    టాడన్వచ్చును క్రూరజంతువుల నీర్ష్యారోషకామాదులన్!
    ఱేడా! ఆదికిరాత! భిక్షు! మృగధారీ! బాలకోటీశ్వరా!

    పల్కుంజెల్వయు నల్వయున్ హరియు ప్రాబల్కుంగముల్ రెండువేల్
    నాల్కల్గల్గిన చిల్వయుం గలసియైనన్ నీదు మాహాత్మ్యమున్
    పల్కన్ లేరు? సరికదా మనమునన్ భావింపలే రన్నచో
    పల్కంజాలుదు నెట్లు నేను నరుడన్ బాలుండ కోటీశ్వరా! 

 Previous Page Next Page