పాపపు టిన్పపెట్టియల బంగరు నాణెము లొక్కకోటి యీ
కాపుకుమారు నెన్నొసటి ఘర్మకణానికి సాటి వచ్చునా!
ఈ పనిలేని నేత లొనరించెడి జాతర లెల్ల - ఒక్క పా
కీ పనివాని కుంచె కలిగించెడి మేలును బోలునా ప్రభూ!
కన్నులు లేని భిక్షుకుని కంఠములో, గుడిగంటలో, సుసం
పన్నుని భర్మహర్మ్యములపై విహరించెడి పావురాలలో,
చిన్నికుమారు చిర్నగవు చిందెడి చెక్కులలో, తమస్సులో,
వెన్నెలలో, కృషీవలుని వేదనలో నిను గాంతు నో ప్రభూ!
పువ్వుల తావిలోన, పసిబుగ్గల నిగ్గుల చంటిపాప చి
ర్నవ్వుల మోవిలోన, రసరాగిణి పిల్లనగ్రోవిలోన, దౌ
దవ్వుల ప్రాగ్వధూటి మెయి దాల్చిన బంగరు కావిలోన, ఆ
దివ్వెల దీవిలోన గురుతింతు ప్రభూ! భవదీయ రూపముల్!!
బీదల పాకపై - ధనకుబేరుల ఆకసమంటు మేలి ప్రా
సాదముపై - పిశాచుల శ్మశానముపై - గుడిలోని తోటపై -
భేద మొకింతలేక కురిపింతువు వెన్నెలలో ప్రభూ! అదే
మాదిరి మర్త్యు లందర సమానముగా గమనింపవేమయా?
రూపములేని స్వాములు పరోక్షముగా పడియుండలేక ఏ
మో పడిపోయినట్లు జగముల్ సృజియించు టిదేల! చూపులున్
రూపు లివేల! స్నేహము - విరోధము, ఆశ - నిరాశ, పుణ్యమున్ -
బాపము రువ్వనేమిటికొ మాపయి? ఆపయి నవ్వనేటికో?
ఎందుకు తెచ్చిన ట్లిచటి? కీ కను లెందు కొసంగినట్లు? ఏ
యందము చూడగూడదని ఆంక్షల నెందుకు పెట్టినట్లు? నీ
చందము చిత్రమయ్యెడిని స్వామి! రసాలఫలం బొసంగి "దీ
నిం దినగూడ"దన్న కరణిన్; రమణీయము గర్హణీయమే?
పద్యము సాగునప్పుడు, శుభంకరమౌ నవరాగవల్లకీ
వాద్యము మ్రోగునప్పుడు, భవత్కరుణామయమైన గోస్తనీ
మద్యము త్రాగునప్పుడు, సుమంబులు గాలికి నూగునప్పుడున్,
హృదయములైన నీ మహిమలే నయనమ్ముల నాట్యమాడెడిన్!!
వేదము లప్పజెప్పిన - కవిత్వము గుప్పిన - తర్క శాస్త్ర సం
వాదము లందుకొన్న - ఉపవాసము లున్న - ఖురాను విన్న - మ
క్కాదుల గన్న - నెమ్మది దయారస మన్నది సున్నయైనచో
నీ దరహాస చంద్రికలు నిండవు; పండవు వాని భాగ్యముల్!
ఎన్నో వేషములన్ ధరించితిని స్వామీ! నిన్ను దర్శింప; ఎ
న్నెన్నో రంగులు పుల్ముకొంటిని దయాబ్దీ! నిన్ను మెప్పింప; ఇం
కెన్నో రాగము లాలపించితిని తండ్రీ! నిన్ను రప్పించు; ఎం
దున్నావో కనరావు; నీకు వినరావో! అస్మదాక్రందనల్?
జగతి తమస్సు వైదొలగ, చల్లని వెచ్చని వెల్గుదివ్వియల్
గగనము దాక రాత్రులు పగళ్లును త్రిప్పుటెగాక; పొంగి బి
ట్టెగసి ధరిత్రిపై పడగలెత్తు సముద్ర తరంగపంక్తి నే
ర్పుగ వెనువెన్కకున్ మడచిపుచ్చెద వెంత దయార్ద్రమూర్తివో!
అస్తవ్యస్తపు శుష్క తర్కములతో నార్భాటముల్ సేయుచున్,
హస్తాల్ త్రిప్పుచు, మస్తకాలు మసిబుడ్లై, పుస్తకాల్ విప్పుచున్,
కుస్తీల్ పట్టుచు, "అస్తి" "నాస్తి"యని యాక్రోశించు వాక్శూరు లీ
స్రస్తాచారులు నీ యనుగ్రహము గాంచన్ లేరు నూరేండ్లకున్!!
తీవలు వృక్షశాఖలు ప్రతిక్షణమందు ఖయామ్ సమాధిపై
పూవులు క్రుమ్మరింపవలె! పున్నమిరేల ఖయామ్ సమాధి నల్
గ్రేవల వెండిజ్యోత్స్న ప్రసరింపవలెన్! తొలిసంజె వేళలో
జీవము పొంగ, చల్లగ స్పృశింపవలెన్ మలయానిలార్భకుల్!!
* * *
కణకణమందు నీ యునికి గంటి; సుమధ్య సువర్ణ కింకిణీ
క్వణనములందు నీ మధురగానము వింటి; విశాలసృష్టిలో
అణువణువందు నీమహిమ లారసికొంటి; ప్రగాఢ భక్తితో
ప్రణతు లొనర్చుచుంటి; నను బాయకుమంటి; దయాపయోనిధీ!
* * *
"ఉమరుఖయామ్" మహాకవి రసోజ్జ్వల మార్గము నాశ్రయించి యీ
"అమరుఖయామ్" రచించితి; తదాస్తికభావన నుగ్గడించితిన్;
సుమధురమైన ఆ సుకవి సుందరభావ మొకించునంత యిం
దమరిన - చిత్తగింపగల రాంధ్రమహోదయు! లౌచితీప్రియుల్!!
* * * *