Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 4


    "రాత్రి చాలా గాభరా చేసిందిరా. లైఫ్ ఎండ్ డెత్ మధ్య ఊగిసలాడాననుకో."
    వినోద్ కొంచెం సీరియస్ గా ముఖంపెట్టి "అమ్మా! నిజం చెప్పాలంటే నీ వ్యాధికి కరెక్టుగా ఎవరూ మందివ్వలేరు" అన్నాడు.
    "ఏమిట్రా నువ్వనేది?"
    "ఓసారి కాళ్ళనొప్పులు, మరోసారి కీళ్ళ నొప్పులు, ఇంకోసారి గుండె దడ దడమని కొట్టుకోవటం, తలదిమ్ము, నరాల వీక్నెస్, నీరసం ఒక్కోసారి అదేమిటో తెలీని బాధ."
    "మరేం చెయ్యనురా. చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి. కాని నా దిసీజేమిటో ఏ డాక్టరూ కనుక్కోలేకపోతున్నారు. ఇదిగో ఈవేళ మీ సిస్టరిన్ లాను తీసుకెళ్ళి మంచి డాక్టర్ని వెదకాలి" అంది సుశీలమ్మగారు కొంచెం విచారంగా.
    ఇంతలో లోపల్నుంచి ప్రసాదరావుగారి గొంతు "సుశీలా సుశీలా" అంటూ వినిపించింది.
    "ఇలా వచ్చానో లేదో ఆయనగారి పిలుపులు" అంది సుశీలమ్మగారు విసుగ్గా. ఆ విసుగుదలలో ఒకింత గర్వం, ప్రేమ మిళితమై వున్నాయి. నిజం చెప్పాలంటే అవే ఎక్కువ వున్నాయేమో.
    "నేను ఒక్కక్షణం కనిపించకపోతే ఆయనకు తోచదు. ఓసారి కాఫీ, ఓసారి పాలు, ఓసారి బటర్ మిల్క్...ఆయనకు వయసొస్తున్న కొద్దీ రకరకాల టేస్టులు..."
    "సుశీలా! వస్తున్నావా లేదా?" ప్రక్క గదిలోంచి మళ్ళీ ప్రసాదరావుగారి గొంతు.
    "అబ్బబ్బబ్బ వస్తున్నానండి" అంటూ అటుకేసి వెళ్ళింది.
    వినోద్ ఓసారి వదినగారి ముఖంలోకి చూసి తర్వాత విజయ్ కుమార్ వంక తిరిగాడు.
    "అన్నయ్యా! అమ్మకి కావాల్సింది బాగా వైద్యం చేసే డాక్టరుకాదు, ఒకసారి చెయ్యిపట్టుకుని పల్స్ చూసి, అవసరమున్నా లేకపోయినా బి.పి. చూసి, ఆప్యాయంగా పలకరించి చక్కగా కబుర్లు చెప్పే డాక్టరు కావాలి. అలాంటి శాంతమూర్తి, ఖాళీగా వుండే డాక్టరుకోసం గాలిస్తానుండు."
    "ఖాళీగా వుండి ప్రాక్టీస్ లేనట్లు కనిపించినా అమ్మకు నచ్చదురా. ప్రాక్టీస్ లేదుకాబట్టి మంచి డాక్టరు కాదనుకుంటుంది" అన్నాడు విజయ్.
    "అయితే ప్రాక్టీస్ బాగావుండి, విసుక్కోకుండా, ఈవిడ వేసే కుంటి గుడ్డి ప్రశ్నలన్నిటికీ ఓపిగ్గా జవాబు చెప్పే డాక్టరు కావాలి. నవ్వుతూ పలకరించాలి. సరే వెతుకుతాను"
    అంతలో విజయ్ కు, చిన్న సాకు దొరికితే బోలెడు టైము వేస్టు చేసే తమ్ముడి స్వభావం గుర్తుకొచ్చింది.
    "అది సరేగాని కాలేజి టైమయింది. ఇంకా నువ్వు తెమిలినట్లు లేదేమిటి? అన్నాడు కాస్త సీరియస్ గా ముఖం పెడుతూ.
    "అదా...అదీ..." అంటూ వినోద్ నసుగుతూ చెప్పటానికి తటపటాయిస్తున్నాడు.
    సరిగ్గా ఆ సమయానికి ఎవరో పిలిచినట్లు మాధురి వూడిపడింది.
    "వాడు కాలేజికెందుకెళ్ళడంలేదో నేను చెబుతానన్నయ్యా" అంది.
    "నువ్వు నోరు మూసుకోవే మాధురీదీక్షిత్" అన్నాడు వినోద్ వారించటానికి ప్రయత్నిస్తూ.
    "నా పేరు మాధురీదీక్షిత్ కాదు. మాధురి"
    "నువ్వనుకుంటున్నావుగా మాధురీదీక్షిత్ నని..."
    "ఎవరు చెప్పారు నీకలా అని?"
    "ఎవరు చెబితే నీకెందుకు? అనుకుంటున్నావా లేదా?"
    "అసలెవరు చెప్పారో చెప్పు. ఈ వ్యవహారమేదో ఇప్పుడు తేలిపోవల్సిందే"
    "నీ ఫ్రెండ్ శ్రీదేవి చెప్పింది"
    "శ్రీదేవి చెప్పిందా? అంతవరకూ వచ్చిందా? అసలు దానిపేరు శ్రీదేవికాదు. సీతారావమ్మ. తనంతట తనే శ్రీదేవిగా మార్చేసుకుంది. అవునూ దానికీ నీకూ ఏమిటి పరిచయం? అసలు నా గురించి చర్చించుకునేంతటి చనువెలా ఏర్పడింది మీ మధ్య? ఈ వ్యవహారమేదో ఇప్పుడు తేలిపోవల్సిందే."
    "అవన్నీ నా పర్సనల్ విషయాలు. నేను చెప్పను"
    "చెప్పకపోతే నేనే వెళ్ళి ఆ సీతారావమ్మ అంతు తేలుస్తాను."
    ఇహ వాళ్ళిద్దరి వాగ్వివాదం అంతులేకుండా అలా పెరిగిపోతుందని విజయ్ కలగజేసుకున్నాడు.
    "మాధురీ అసలు సంగతి వదిలేసి మీరిద్దరూ మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి ఇలా మాట్లాడుకోవటం బాగాలేదు. వినోద్! ఈవేళ కాలేజి కెందుకెళ్ళలేదో యిందాక చెబుతానన్నావు."
    "అదీ...అదీ..." అంటూ మళ్ళీ వినోద్ తటపటా యిస్తున్నాడు.
    మాధురి చెప్పేసింది. ఈవేళ టివి.లో మనకూ పాకిస్తాన్ కి జరిగే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్షప్రసారముందన్నయ్యా."
    విజయ్ కు ఎక్కడలేని ఉషారొచ్చింది. "ఉందా? మరి యిందాకట్నుంచీ చెప్పరేం? అయితే నేనూ ఈవేళ ఆఫీసు మానేస్తాను."
    "అవునన్నయ్య. అలా చేస్తే బావుంటుంది. ఇటువైపు అజరుద్దీన్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, అటు ఇమ్రాల్ ఖాన్, వాశిం అక్రం, మియానీదాద్ ఓహ్! బ్రహ్మాండంగా వుంటుంది.
    ఇందాకట్నుంచీ జరిగేదంతా ప్రేక్షకురాలిలా సుజాత చూస్తూ నిలబడిపోయింది. ఆమె ముఖంలో రంగులు మారుతున్నాయి. ఏమండీ అంటూ భర్త దగ్గరకొచ్చింది.
    ఆమె ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు.
    "ఒకసారిలా రండి. చాలా మెల్లగా అని అతన్ని చెయ్యి పట్టుకొని ఓ పక్కకి తీసుకుపోయింది.
    అతడు కూడా గొంతు తగ్గించి "ఏమిటి సుజా" అనబోయి ఆమెమీద తనకొచ్చిన కోపమింకా పోలేదని గుర్తు తెచ్చుకొని "ఏమిటి సుజాతా" అన్నాడు.
    "అబ్బ! అలా పిలవకండి. ఏమిటోగా వుంటుంది."
    "అదిసరే. ఈ ప్రక్కన పొంచి రహస్యంగా ఏం చెప్పదలిచావో చెప్పు"
    ఆమె చాలా చిన్నగా వినోద్ ఈ మధ్య సరిగ్గా చదవటంలేదు. ఈ ఊరొచ్చాక ఫ్రెండ్స్, పార్టీలూ, సినిమాలూ అని కాలేజి కూడా ఎగవేస్తున్నాడు. ఇదివరకు ఫస్టు ర్యాంక్ వచ్చేవాడు. ఇప్పుడు ఇరవయ్యో ర్యాంకుకు పడిపోయాడు. ఇవ్వాళ వన్ డే ఇంటర్నేషనల్ అని వంకపెట్టి కాలేజీ ఎగ్గొడతుంటే కోప్పడాల్సింది పోయి మీరుకూడా ఆఫీసు మానేసి చూస్తారేమిటండి? అంది. ఆమె కంఠంలో కోపం ధ్వనిస్తోంది.

 Previous Page Next Page