Read more!
 Previous Page Next Page 
అయినవాళ్ళు_పక్కవాళ్ళు పేజి 3


    "చూస్తూనే వున్నానండి"
    గొంతు సాధ్యమైనంత గంభీరంగా మార్చాడు.
    "చాలా రోజుల్నుంచి నేను కొన్ని విషయాలు అదే నీ భాషలో పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు సమయమొచ్చింది కాబట్టి చెప్పక తప్పదు.
    "ఏమిటండి అది?" సుజాత అమాయకంగా ముఖంపెట్టి అడిగింది.
    "పెళ్ళికాకముందు...నేను ఇరవైమూడు, ఇరవై నాలుగేళ్ళ వయసులో వుండగా చాలామంది అమ్మాయిలూ నన్నారాధించారు, ప్రేమలేఖలు రాశారు. వాటిలో కొన్నిటికి నేను జవాబులిచ్చానుకూడా."
    "నిజంగా" కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అడిగింది.
    "నిజం"
    "ఇప్పుడు మిమ్మల్ని చూసి గర్వంగా వుందండి."
    "వాళ్ళలో కొంతమందితో కలిసి సినిమాలకీ, షికార్లకి కూడా వెళ్ళా.
    "అబ్బ? నా గర్వాన్నింకా పెంచకండి."
    "సుజా!" అని అంతలోనే సర్దుకుని "సుజాతా" అన్నాడు.
    "ఏమిటండీ. యింత దగ్గర్లోవున్నా అంత పెద్దగా దేనికి అరుస్తున్నారు."
    "నీకు కోపంగా లేదా?"
    "ఉహు"
    "అసూయగా లేదూ?"
    "ఉహు"
    అతన్లో ఆక్రోశం పెరిగిపోతుంది. "నువ్వూ..." అంటూ చేయెత్తిబోతూండగా, ఆ చేతిని మృదువుగా ఆపి, దగ్గరగా జరిగి పేదలమీద ముద్దు పెట్టుకోబోతోంది.
    అతను కంగారుగా "అమ్మ అమ్మ" అంటున్నాడు.
    "పొయ్యరండి. ఆవిడ యిక్కడకు రారు."
    "అయ్యో అమ్మ"
    "అయ్యో. మరీ అంత బడాయిలు పోకండి" అంటూ ఆమె మళ్ళీ ముఖమెత్తి పెదవులకు దగ్గరగా జరుగుతుండగా వెనకనుంచి "విజయుడూ" అన్న కేక వినిపించింది. ఈసారి సుజాత కంగారుపడి అంది సిగ్గుతో వెనక్కిపడి జరిగింది.
    సుశీలమ్మగారు గదిలో కొచ్చింది.
    "మీ అబ్బాయికి కంట్లో నలకపడితే వూదుతున్నానత్తయ్యా" అంది సుజాత.
    సుశీలమ్మగారికి యాభయి ఏళ్ళుంటాయి. పచ్చటి పసిమి. జుట్టు ఏమాత్రం నెరవకపోగా పొడవాటి తలకట్టు. కళ్ళజోడు ఆమె ముఖానికి హుందాతనాన్ని కలిగిశ్తోంది. ఆవిడ స్కూల్ ఫైనల్ వరకూ చదివింది. ఇంటిని తెలుగు పత్రికలూ, జర్నల్స్ తోబాటు ఇంగ్లీషు కూడా తిరగేస్తూ వుంటుంది.
    "ఇదిగో డాటరిన్ లా. నువ్వు ఎందుకంత దగ్గరగావున్నావని ఎక్స్ పనేషన్ అడగలేదుగా. ఎందుకలా కంగారు పడతావు?" అంది.
    "అబ్బే! నాకు కంగారేముంది? ఫాక్ట్ ఫాక్ట్ చెబుతున్నానత్తయ్య" అంది సుజాత బింకంగా,
    "అవునూ! యిప్పుడు దేనికమ్మా పిలిచావు?" అనడిగాడు విజయ్ టాపిక్ మారుద్దామని"
    "అదా! అదీ" అంటూ సుశీలమ్మగారు దేనిగురించబ్బా అని గుర్తుచేసుకుంది.
    "మళ్ళీ ఏం జరిగిందత్తయ్యా!" అనడిగింది సుజాత.
    "రాత్రి చాలా సీరియసయి పోయింది. అసలు ప్రాణం పోతుందనుకున్నా, పాపం మీ ఫాదరిన్లా నిమ్మకాయ నీళ్ళతో కొంచెం హనీ కలిపిచ్చాక పోయిన ప్రాణం తిరిగొచ్చింది.
    "అయ్యో నన్ను లేపకపోయారా అత్తయ్యా"
    "లేపుదామనుకున్నా, కాని మీ ఫాదరిన్లా వాళ్ళని డిస్టర్బ్ చెయ్యను అంతే వూరుకున్నా...ఒరే విజయుడు.
    "అమ్మా"
    "డాటరిన్ లా వంటపనిలో బిజీగా వుంటుందేమో, పోనీ నువ్వు ఆఫీసుకెళ్ళేటప్పుడు డాక్టరుగారి దగ్గరకు స్కూటరు మీద తీసుకెళ్ళకూడదూ?"
    విజయ్ వినయంగా జవాబిచ్చాడు. "మనం ఈ వూరికి కొత్తగా వచ్చానమ్మా, ఇక్కడ డాక్టర్లు ఎవరెవరున్నారో, వారిలో మంచి డాక్టరెవరో ముందు తెలుసుకోవాలి. అందులో నీ శరీరతత్వాన్నర్థం చేసుకుని, నీకు మంచి మంచి మందులిచ్చే డాక్టరుగార్ని జాగ్రత్తగా వెదకాలి అసలే నీ ఆరోగ్యం...
    "అవునవును. నాదసలే చాలా డెలికేట్ బాడీ. అందులో నా రోగం ఒక పట్టాన ఎవరికీ అర్థంకాదు" ఎక్కువ టైము వేస్టు చెయ్యకుండా మంచి డాక్టర్ని వెదకరా"
    "అందుకేనమ్మా. నేనేపని చేసినా బాగా టైము తీసుకుని జాగ్రత్తగా ఆలోచించి చేస్తాను. యింకోటి కూడా వుందమ్మా."
    "ఏమిట్రా అదీ?"
    "ఈ ఊళ్ళో రోడ్లన్నీ పెద్ద పెద్ద గోతులతో ఎగుడు దిగుడుగా వుంటాయమ్మా. స్కూటరు మీద పోతున్నప్పుడు నేనే ఆపసోపాలు పడిపోతున్నాను. నువ్వు తట్టుకోలేక క్రింద పడితే_"
    సుశీలమ్మగారి ముఖంలో ఆందోళన కనిపించింది. "చాల్లేరా ఇహ చెప్పకు క్రిందపడితే ఏ ప్రాక్చరో అయితే...వున్న డిసిజెస్ తోబాటు అదొకటి తోడవుతుంది. అసలే వారానికి రెండుసార్లు లైఫ్ ఎండ్ డెత్ మధ్య ఊగిసలాడుతున్నాను. నువ్వు మాంచి డాక్టరుగార్ని చూడు. నేను డాటరిన్ లాని తీసుకుని రిక్షాలో వెళతాను" అంది.
    ఈ లోకంలో కొందరు మనుషులుంటారు. వాళ్ళెంతసేపూ సుస్తీల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడూ వాళ్ళకు అస్వస్థతగా ఉందని భావించుకుంటూ ఉండటం వాళ్ళకో థ్రిల్. పరిచయస్తులెవరైనా కనిపించి తలవంచినప్పుడు ఏమిటో ఈ మధ్య వంట్లో బావుండటంలేదు అన్న డైలాగ్ తో మొదలుపెడతారు.
    సుశీలమ్మగారా కోవకు చెందిన మనిషి.
    సరిగ్గా ఆ సమయానికి ఓ గంటక్రితమే అర్జంటు పని ఉన్నట్లు బయటికి వెళ్ళిన వినోద్ యింట్లోకి ప్రవేశించాడు.
    వినోద్ కి యిరవై రెండు, యిరవై మూడేళ్ళుంటాయి. ఈ మధ్యనే యమ్.ఎస్.సి. పూర్తిచేసి ఉద్యోగం కోసం అన్వేషిస్తూ ఎందుకయినా మంచిదని కంప్యూటర్ కోర్సులో చేరాడు.
    వినోద్ ఇంకో తరహా మనిషి. ఎప్పుడూ బిజీగా, హడావుడిగా తిరుగుతూ వుంటాడు. ఒక్కక్షణం ఇంట్లో కనబడతాడు. మరో నిమిషం తర్వాత పనివుండి పిలిస్తే ఎక్కడికో వెళ్ళిపోయి వుంటాడు. ఆ బిజీ ఏమిటో ఎవరికీ అర్థంకాదు. జీవితాన్ని ఒక్కోసారి ఈజీగా తీసుకున్నట్లు కనిపిస్తాడు. మరోసారి పైకి రావటానికి రకరకాల ప్లాన్ లు వేస్తూ గొప్ప యోధుడిలా గోచరిస్తాడు.
    "ఏమిటమ్మా డాక్టరూ, మందులూ అంటున్నట్లు ఈ చెవికి సోకింది. మళ్ళీ కొత్త డిసీజేమయినా వచ్చిందా" అనడిగాడు.

 Previous Page Next Page