వన్ డే ఇంటర్నేషనల్ సుజా...సుజాతా, చాలా ఇంటరెస్టింగ్ గా వుంటుంది."
"ఉంటే ఉంటుందిలెండి. అంతకంటే చదువు, డ్యూటీ ముఖ్యం. మీరు కోప్పడతారా? కోప్పడరా?"
విజయ్ మొహమాట పడుతున్నాడు.
"మాట్లాడరేమిటండి?"
"నువ్వు చెప్పావు కాబట్టి కాదనలేకపోతున్నాను. కాని...నాలో ఉన్న బలహీనత తెలుసుగా, నాకు కోప్పడడం, కోపం తెచ్చుకోవటం చేతకాదు."
"ఇతరులు చేసిన తప్పులకు మీరే బాధపడి మిమ్మల్ని మీరే శిక్షించుకునే మనస్తత్వమని తెలుసుగాని ఎలాగైనా కోపం తెచ్చుకోండి, మందలించండి."
"అంతేనంటావా?"
"అంతేనండీ ఏదీ ఓసారి కోపంగా మొహం పెట్టండి... ఆ...అదీ కోపంతో మీరు చాలా ముద్దొస్తున్నారండి..."
"అదిగో మళ్ళీ నా మూడ్ పాడు చేస్తున్నావు."
"సారీ. ఆ! అది అలా వెళ్ళి కోప్పడండి.
విజయ్ ముందుకొచ్చి వాళ్ళిద్దరి మాటలూ విననట్లు నవ్వొస్తున్నా తమ్ముడితో గట్టిగా 'వినోద్' అన్నాడు.
అతనంత గట్టిగా పిలవటం చూసి వినోద్ తెల్లబోయాడు. "ఏమిటన్నయ్యా" చిన్నగా అన్నాడు.
"వినోద్. వినోద్. వింటున్నావా? నిన్నే నీతో మాట్లాడుతూంటే ఏమిటలా వదినవైపు చూస్తావు?"
"వదినా" అన్నాడు వినోద్ చాలా నెమ్మదిగా, "ఉన్నట్లుండి" అన్నయ్య ఎందుకలా మారిపోయాడు? వంట్లో బాగాలేదా?"
"నాకూ అర్థం కావటంలేదు. ఎందుకనో మాంచి ఉగ్రంగా వున్నారు."
'విజయ్' మళ్ళీ అరిచాడు. "నేనిక్కడ మాట్లాడుతుంటే వదినా మరదలు ఏమిటా సంప్రదింపులు? వినోద్ ఇలారా. నీతో చాలా మాట్లాడాలి. ఊఁ రమ్మంటుంటే?"
"వదినా! అన్నయ్యని చూస్తే ఎందుకో భయమేస్తున్నది. ఎవరయినా డాక్టర్ని..."
"డాక్టరూ లేడు, గీక్టరూ లేడూ యిలారా"
"అన్నయ్యా!"
"నువ్వు...నువ్వూ..."
"ఏమిటన్నయ్యా. చెబుతూ చెబుతూ ఆగిపోయావు?"
విజయ్ మాట్లాడకుండా అలా చూస్తూ ఉండిపోయాడు.
"ఉండరా. గుండె చిక్కపట్టింది" అంటూ విజయ్ కుర్చీలో కూలబడిపోయాడు.
సుజాత భయంగా చూస్తోంది.
"వదినా! అన్నయ్యకి గుండె చిక్కపట్టింది. త్వరగా మంచినీళ్ళు తీసుకురా వదినా" అంటూ విజయ్ గుండెమీద చేత్తో రాయసాగాడు.
2
రాత్రి పన్నెండు దాటింది.
విజయ్, సుజాత పడుకున్న గదిలో బెడ్ లైట్ వెలుగు మందంగా ప్రసరిస్తోంది.
విజయ్ నిద్రపోవటం లేదని సుజాతకు తెలుసు. అతని గుండెమీద చెయ్యివేసి గోముగా నిమిరింది. తర్వాత అతనివైపు యింకా జరిగి ఆ గుండెమీద తలవాల్చింది.
"ఏమండి" అన్నది.
"ఊ"
"నా గురించి నాకు తెలీదు"
"మీరెందుకంత సున్నితంగా వుంటారు?"
"నేను చెబుతాను. మీకు ప్రేమించడం తప్ప ద్వేషించటం చేతకాదు. అయితే వాళ్ళు చేసిన తప్పులకు కూడా మీరే తప్పుచేసినట్లు బాధపడిపోతూ వుంటారు. మీకంటే చిన్నవాళ్ళని కూడా కోప్పడడం మీకు చేతకాదు. వినోద్ ని కాస్త మందలించమంటే మీకు గుండె చిక్కపట్టేసింది."
"పోన్లే. మనకన్నా చిన్నవాళ్ళు ఆంక్షలు విధించి శాసనాల మధ్య ఇరికిస్తే వాళ్ళ మనసులు గాయపడతాయి. వాళ్ళని కొంత స్వేచ్చగా..."
"ఆ వయసులోనే స్వేచ్చ సద్వినియోగం కంటే ఎక్కువగా దుర్వినియోగమవుతూ వుంటుందండి."
"కాని మన వినోద్, మాధురి అలా స్వేచ్చను దుర్వినియోగం చేసుకునే మనుషులు కాదు."
"నిజం తెలిసేదాకా ప్రతిఇంట్లో పెద్దవాళ్ళు తమపిల్లల గురించి అలానే అనుకుంటారండి. అంటే నేను వాళ్ళని అనుమానిస్తున్నాని కాదు. ముందునుంచీ కంట్రోల్ లో వుంచితే అన్నివిధాలా మంచిదని"
అతనేమీ జవాబు చెప్పకుండా మౌనంగా వూరుకున్నాడు.
"అలా మెదలకుండా ఉండిపోయారేం?"
"సుజా!" అని పిలిచాడు. ఆ పిలుపులో చాలా స్వీట్ నెస్ వుంది.
"అదేమిటి? సుజాతా అని పిలవలేదేం? నా మీద కోపమొచ్చిందన్నారుగా"
"నాకు కోపం రాదని నువ్వే అన్నావుగా"
"అంటే...అలవోకగా వచ్చే చిరుకోపం.
"అదెప్పుడో పారిపోయింది.
ఆమె గుండెమీదనుంచి ముఖాన్ని కొంచెం పైకెత్తి అతని మెడమీద ముద్దు పెట్టుకుంది."
"నన్నింత అదృష్టం ఎలా వరించింది? గొప్ప సౌందర్యం, అంతకుమించిన ఓ మంచితనం, నేనంటే ప్రేమ, ఆరాధన..."
"అవన్నీ మీకేనా? నన్నూ వరించలేదా?"
"చాలామంది ఆడవాళ్ళలా అనుకోరు. ఉన్నవాటిని గుర్తించకుండా లేనివాటి గురించి సాధిస్తారు."
"మిగతా వారి గురించి నాకనవసరం. నా శైలి నాది."
అతని హృదయం పులకరించింది. "సుజా!" అంటూ చేతుల్ని ఆమె చుట్టూ పోనిచ్చి దగ్గరకు హత్తుకున్నాడు.
పెదవులు, పెదవులు వినీలమైనాయి. శరీరాలు పెనవేసుకు పోయాయి.
* * * *
సాయంత్రం ఆరుగంటలకి విజయ్ బయటకు వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. ప్రసాదరావు గదిలోకొచ్చాడు.
"ఏమిటి నాన్నగారూ?" అనడిగాడు విజయ్.
"ఒక అయిదు రూపాయలుంటే ఇవ్వరా" అన్నాడు ప్రసాదరావు.
విజయ్ జేబులోంచి ఓ పదిరూపాయల నోటుతీసి యిచ్చాడు.
"ఉహు. అయిదు రూపాయలు చాలులే"
"ఉంచండి నాన్నగారూ"