"శారద సరే. నువ్వెవరు?"
"ఎవరేమిటి? నీ భార్యను. ఇంకోసారలాంటి పిచ్చి ప్రశ్న వేయకు"
"నా...నా...నా...భార్యవా?"
"ఏం? అది కూడా అనుమానమేనా మీకు?"
"భార్యవా?"
"నేను మాట్లాడను పొండి" కోపంగా అందామె.
చిరంజీవికి మతి పోతున్నట్లుంది.
"ఏయ్! నిజం చెప్పు. నువ్వెవరివి?"
"అదిగో! మళ్ళీ మొదటికొచ్చారు కదూ?"
"ఇదిగో! చూడు నీరదా! నేనడిగిందానికి సమాధానం సరిగ్గా చెప్పు"
"నా పేరు నీరద కాదు"
"మరి?"
"శారద..."
"ఓ.కే! శారదా... నేనడిగిందానికి...."
"ఊరుకోండి! ఏమిటి అసహ్యంగా? పెళ్ళాన్ని పట్టుకుని ఎవరైనా ఇలా నువ్వు నా పెళ్ళానివేనా? అని అడుగుతారా?"
"నువ్వు...నువ్వు...నా పెళ్ళానివా?"
"అదిగో అదే వద్దన్నాను"
అతనికి కోపం ముంచుకొచ్చింది.
"నువ్వెవరో చెప్పమంటే నన్ను దబాయిస్తావేంటి?" అంటూ కోపంగా ఆమెను బెడ్ మీద తన బలమంతా వుపయోగించి లేచి కూర్చోబెట్టాడు.
ఆమె కెవ్వున కేక వేసి వంటికి దుప్పటి చుట్టేసుకుంది.
"ఏమిటీ పిచ్చి పని? ఎంత పెళ్ళాన్నయితే మాత్రం ఇలా చేస్తారా?"
చిరంజీవి అదిరిపడ్డాడు. అంటే రాత్రంతా ఇద్దరూ_
"వెళ్ళి ముఖం కడుక్కోండి. కాఫీ తాగితే సర్దుకుంటుంది. తాగే వాళ్ళంటే నాకందుకే చిరాకు! ఈ సారా వ్యతిరేకోద్యమం వూరికే రాలేదు. పెళ్ళాన్ని కూడా 'నువ్వు నా పెళ్ళానివా?' అని గావుకేకలేసే మీలాంటి వాళ్ళవల్లే వచ్చింది."
చిరంజీవి నిస్సత్తువగా ఆమెవేపు చూశాడు.
"ఇదిగో చూడండి! దయచేసి నాకు నిజం చెప్పండి! మీరెవరు?"
ఆమె కోపంగా చూసింది.
"నన్ను అలా 'మీరు' అన్నారంటే బావుండదు. భార్యనెవరయినా 'మీరు' అంటారా? భార్యను భర్త 'మీరు' అంటే భార్యకు పాపం చుట్టుకుంటుందట! ఆరో క్లాస్ టీచర్ చెప్పింది."
"నువ్వు నా భార్యవా?"
"అలా అన్నారంటే నేను వెళ్ళిపోతాను." మంచం దిగబోయిందామె.
చిరంజీవి ఆమె చెయ్యి పట్టుకుని లాగి కూర్చోబెట్టాడు.
"ఇదిగో చూడండీ! ఐ మీన్ చూడు శారదా!" మాట్లాడుతుండగానే ప్లాష్ వెలిగినట్లు గుర్తుకొచ్చేసిందతనికి.
ఆ రోజు తన పుట్టినరోజు. ఆ రోజు ఇంట్లో లంచ్ ఇచ్చారు. సాయంత్రం తన ఫ్రెండ్స్ తో 'హాలిడే ఇన్' హోటల్లో తన ఫ్రెండ్స్ కి కాక్ టైల్ పార్టీ ఇచ్చాడు. ఆ పార్టీ అయ్యాక తను గుళ్ళో సంగీతను పెళ్ళి చేసుకోవలసి వుంది. అంతే అంతవరకే గుర్తుంది.
సంగీత గుర్తుకొచ్చేసరికి అతను ఒక్క ఉదుటున బెడ్ దిగి నిలబడ్డాడు.
"మైగాడ్! సంగీతేమయింది?" గాబరాగా అన్నాడామెతో.
ఆ అమ్మాయి ఆశ్చర్యంగా చూసింది.
"సంగీత? సంగీతెవరు?"
"నాక్కాబోయే భార్య"
ఆమె కోపంగా చూసింది.
"ఏమిటండీ ఆ మాటలు? ఎవరయినా రెండు పెళ్ళిళ్ళు చేసుకుంటారా?"
"రెండు పెళ్ళిళ్ళేమిటి? ఒకటే పెళ్ళి! నేను సంగీతనే చేసుకోవాలి! సంగీత ఎక్కడుంది?"
"మీ మాటలు నాకేం అర్థంకావటంలేదు. అంత ఎక్కువ తాగకండీ అని నిన్న సాయంత్రం నుంచీ చెప్తూనే వున్నాను. వినకుండా తాగేశారు. ఓసారి డాక్టర్ దగ్గరకెళ్దాం పదండి."
చిరంజీవికి పిచ్చెక్కిపోతున్నట్లుంది.
"నిన్న సాయంత్రం నుంచి మనం కలిసి ఉన్నామా?"
"ఛీ! ఏమిటండీ ఆ మాటలు? శోభనం రాత్రి కలిసి ఉండకపోతే ఎవర్దారిన వాళ్ళుంటారా?"
"ఛీ! మరీ బరితెగించిపోయారు మీరు. లేకపోతే పరాయి పురుషుడితో ఇలా హోటల్లో వుంటానా ఏమిటి?"
"మరి సంగీతేమయింది?"
"సంగీతెవరండీ అసలు? మాట్లాడితే దాని పేరు కలవరిస్తారు? పోనీ అదంటే అంత ప్రేమ వుంటే దాన్నే చేసుకోపోయారా? మధ్యలో నన్నెందుకు చేసుకున్నారు?" చిరాకుగా అంది.
"అసలు మన పెళ్లి ఎలా జరిగింది శారదా?"
"ఏ పెళ్ళయినా పెళ్ళిలాగానే జరుగుతుంది. ఇంకెలా జరుగుతుంది?"
"అయ్యో! నేననేది అది కాదండీ"
"అదిగో మళ్ళీ అండీ అంటున్నారు."
"ఓ సారీ! అదే...శారదా! నేననేదేమిటంటే అసలు నువ్వెవరు? మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకున్నాం? ఎందుకు పెళ్ళి చేసుకున్నాం? దయచేసి నాకంతా చెప్పు! లేకపోతే పిచ్చెక్కిపోతుంది."
శారద కళ్ళవెంబడి నీళ్ళు తిరిగాయి.
"నాకు ముందే తెలుసండీ మీరిలా అంటారని! అందుకే మీరు నా వెంటబడి పెళ్ళి చేసుకుందామని ఎంత బ్రతిమాలినా నేను ఒప్పుకోలేదు. తాగినవాడి మాటలు నమ్మకూడదని నాకు బాగా తెలుసు. అయిదో క్లాస్ తెలుగువాచకంలో వుందా విషయం. అందుకే ఇప్పుడు వద్దండీ, ఇంకో రెండు రోజుల తర్వాత పెళ్ళిచేసుకుందామండీ అని ప్రాధేయపడ్డాను. కానీ మీరు వినలేదు. ఏమయినా సరే ఇప్పుడే మన పెళ్ళయిపోవాలని పట్టుబట్టారు. ఇంత రాత్రిలో పెళ్ళేమిటండీ! పొద్దున వరకూ ఆగండి అన్నాను. అయినా మీరు వినలేదు. నేను వద్దంటున్నా వినకుండా బలవంతంగా గుడికి తీసుకెళ్ళారు. అక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. మనం కూడా వాళ్ళతోపాటు పెళ్లి చేసేసుకున్నాం. పెళ్ళయిన వెంటనే శోభనం ఇక్కడ ఏర్పాటు చేశారు మీరు. వద్దండీ! మీ ఇంటికెళ్దాం అని నేను ఎంతగా అడిగినా మీరు ఒప్పుకోలేదు. మన పెళ్ళికి మా నాన్నగారు ఒప్పుకోరు, అందుకని ఇంటికి వెళితే గొడవయిపోతుంది అన్నారు. గత్యంతరం లేక మీరు చెప్పినట్లల్లా చేశాను. చేసినందుకు ఇప్పుడు మంచి శాస్తే చేస్తున్నారు. నువ్వెవరో తెలీదనే వరకూ వచ్చారు."