Previous Page Next Page 
అనగనగా ఓ హనీమూన్ పేజి 23


    చిరంజీవికి ఆమె చెప్పిన విషయాలేమీ జరిగినట్లు గుర్తురావటం లేదు.
    అంతా వింటూంటే ఆశ్చర్యంగా వుంది.
    ఓ పక్క తను సంగీతను పెళ్ళి చేసుకోవాల్సి ఉండగా మధ్యలో ఈ అమ్మాయినెలా పెళ్ళి చేసుకున్నాడు. పైగా ఆ అమ్మాయి వద్దంటున్నా వినకుండా తనే బలవంతం చేశాడంట.
    "అసలు మనం ఎక్కడ కలుసుకున్నాం?" అడిగాడు చిరంజీవి.
    "ఎక్కడేమిటి? మీ బర్త్ డే పార్టీలో"
    "బర్త్ డే పార్టీలో ఎలా కలుసుకున్నాం?"
    "ఎలాగేముంది? మీరు మందు కొడుతున్నారు. నేను డాన్స్ చేస్తున్నాను. మీరు నా డాన్స్ అయ్యాక స్టేజిమీదకొచ్చారు. ఇంత మంచి డాన్స్ మీ జన్మలో చూడలేదన్నారు.
    'థాంక్యూ' అన్నాను.
    ఇంత అందమైన అమ్మాయిని కూడా మీ జన్మలో చూడలేదన్నారు.
    'థాంక్యూ' అన్నాను.
    'అయ్ లవ్ యూ' అన్నారు.
    'థాంక్యూ' అన్నాను.
    "నేను నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అన్నారు.
    "పెళ్ళంటే చిన్న పిల్లల ఆటేమిటి?" అన్నాను.
    అలా అన్నందుకు మీకు కోపం వచ్చింది.
    "అంటే నేను చిన్నపిల్లాడిలాగా కనబడుతున్నానా" అనడిగారు.
    అవునన్నాను.
    మీకు కోపం ఎక్కువయిపోయింది.
    "ఇప్పుడే పెళ్ళి చేసుకుని నేను చిన్నాడినో పెద్దాడినో చూపిస్తాను" అన్నారు.
    "ఇప్పుడు పెళ్ళా?" అంటూ విరగబడి నవ్వాను.
    మీరు కోపంగా నా చేయి పట్టుకుని ముద్దు పెట్టుకున్నారు.
    నాకు కోపం వచ్చింది.
    "బయటికెళ్తారా లేదా?" అన్నాను.
    "నేను వెళ్ళను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్తే వెళ్ళిపోతా"నన్నారు.
    "మీరంటే నాకు ఇష్టం లేదు" అన్నాను.
    "అయితే నేను ఇప్పుడే ఆత్మహత్య చేసుకుంటాను" అంటూ కేకులు కోసే చాకు తీసుకున్నారు.
    నాకు భయం వేసింది.
    మీ చేయి పట్టుకున్నాను.
    "అంత పని చేయకండి! ప్లీజ్" అన్నాను.
    "అయితే నన్ను చేసుకోవటం నీకిష్టమేనా?"
    "ఇష్టమే!"
    "నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావా?"
    "చేస్తున్నాను."
    "అయితే పద! గుళ్ళోకెళ్ళి పెళ్ళి చేసుకుందాం!" అన్నారు.
    "మీ పెద్దాళ్ళ అనుమతి తీసుకుని తర్వాత చేసుకుందాం" అన్నాను.
    "నా పెళ్ళి నా యిష్టప్రకారం జరుగుతుంది. అంతే."
    "నాలాంటి బీదింటమ్మాయిని చేసుకోడానికి మీ వాళ్ళెవరూ ఒప్పుకోరు."
    "నీలాంటి అమ్మాయికి అందమే కోట్ల ధనం" అంటూ నా చేయి పట్టుకుని బలవంతంగా బయటకు లాక్కెళ్ళారు. నన్ను కార్లో కూర్చోబెట్టి మీరే డ్రైవ్ చేసుకుని గుడికి తీసుకెళ్ళారు. అక్కడున్న పురోహితులకు దోసెడు నోట్లు ఇచ్చేసరికి వాళ్ళు క్షణాల్లో అప్పటికే అవుతోన్న మిగతా జంటల పెళ్ళిళ్ళతోపాటు మన పెళ్లి కూడా చేసేశారు.
    నేను బ్రతిమాలుతూనే ఉన్నాను. "ఇలా వద్దండీ, అందరి సమక్షంలో చేసుకుందామండీ" అని.
    కాని మీరు వినిపించుకోలేదు.
    "నీలాంటి అందగత్తె మళ్ళీ నాకు దొరకదు" అనేసి బలవంతంగా తాళి కట్టేశారు.
    "కావాలంటే అందరి సమక్షంలో తర్వాత చేసుకుందాంలే. ఇవాళ ఎలాగయినా పెళ్లి అయిపోవాలి. మనం భార్యా, భర్తలమయిపోవాలి! మన శోభనం జరిగిపోవాలి! జైహింద్" అంటూ అరిచారు.
    నేనింక ఎదురు చెప్పలేకపోయాను.
    పెళ్ళి అవగానే కార్లో మళ్ళీ హోటల్ కొచ్చేశాం! మన కోసం హోటల్ వాళ్ళు ఈ రూమ్ అలంకరించి ఇచ్చారు. రాత్రంతా నన్ను ప్రణయంతో చంపుకు తిన్నారు. ఉదయం నేను బెడ్ దిగబోతూంటే అడ్డుపడ్డారు. మూడు రాత్రుళ్ళు ఈ గదిలో గడపాల్సిందేనని అన్నారు."
    చిరంజీవి ఆమె మెడ వంక చూశాడు అనుమానంగా. తాళిబొట్టు కనబడుతూనే ఉంది.
    "ఏమిటలా చూస్తున్నారు? ఈ తాళిబొట్టు నేను కట్టలేదంటారా ఏమిటి?"
    కోపంగా అడిగిందామె.
    "ఇది నేను కట్టానా?"
    "అబ్బే కాదు. గుళ్ళో పూజారి కట్టాడు! లేకపోతే ఏమిటా పిచ్చి మాటలు?"
    "శారదా!"
    "ఏమిటి?"
    "మీరెవరసలు?"
    "......."
    "మాట్లాడరేం?"
    "......"
    "శారదా!"
    "మీరు అనొద్దని ఓసారి చెప్పాను. భారత స్త్రీని భర్త ఎప్పటికీ నువ్వు, ఒసేయ్, ఏమేవ్ అని అనాలి గాని 'మీరూ' అని అనకూడదండీ! అలా అన్జెప్పి మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. మా టెన్త్ క్లాస్ తెలుగు వాచకంలో కూడా ఉందలా అని!"
    "శారదా!"

 Previous Page Next Page