మంచం పక్కన టీపాయ్ మీద సిగరెట్ పెట్టె, లైటర్ ఏష్ ట్రే వున్నాయి.
పరుశురామ్ దృష్టి వాటిమీద పడింది. బహుశా తను సిగరెట్ కాలుస్తుండగా మేడం చూసివుండాలి. అందుకే ఎరేంజ్ చేసివుంటుంది. లేకపోతే అది గెస్ట్ రూం కావడం చేత అతిధి మర్యాదల్లో అదో భాగంగా ఏర్పాటు చేసివుండొచ్చు.
కానీ అంత ఖరీదైన సిగరెట్ అతనెప్పుడూ కాల్చలేదు. సిగరెట్ పాకెట్ ని చేతిలోకి తీసుకొని సిగరెట్ బయటికి తీశాడు.
పెదిమల మధ్య పెట్టుకొని లైటర్ తో వెలిగించాడు. దమ్ము గట్టిగా పీల్చి పొగని గాలిలోకి వదిలాడు.
రంగన్న కాఫీ తీసుకొచ్చాడు.
"లేచారా బాబూ!"
"ఆ...."
"కాఫీ ఇద్దామని రెండుసార్లు వచ్చి మీరు పడుకొని వుంటే లేపడం దేనికిలే అని వెళ్ళిపోయాను బాబూ!" అంటూ కప్పులో కాఫీ పోసి అందించాడు. కాఫీ తాగి ఖాళీకప్పు రంగన్నకిచ్చేశాడు.
అతను గదిలోంచి వెళ్ళిపోగానే పరుశురామ్ ఆలోచించడం మొదలుపెట్టాడు.
"అసలు మేడం ఎవరు?"
తనని ఆమె కూడా తీసుకురావడంలో ఆమె ఆంతర్యం ఏమిటి?
రాజభోగాలతో తననెందుకు ముంచెత్తుతోంది? అసలు తనలో ఆమెకి కనిపించిందేమిటి?
ఆమె ఏమి ఆశించి ఇవన్నీ చేస్తోంది?
అన్నీ ప్రశ్నలే.
కానీ దేనికీ అతనికి సమాధానం దొరకడంలేదు.
విచిత్రంగా వుంది. ఇప్పుడతనికి ఎంతో ఆశ్చర్యంగా కూడా వుంది.
లేకపోతే అందమైన ఓ స్త్రీ ఆవారాలో రోడ్డుమీద తిరుగుతున్న తనని, ఏ మాత్రం పరిచయంలేని తనని ఆమె స్వయంగా తీసుకొచ్చి ఇంతగా ఆదరించడం దేనికి?
ఇందులో ఆమె స్వార్ధం ఏమైనా వుందా?
తను ఏదో రిస్క్ లో పడబోతున్నానా? అనే అనుమానం కలిగింది పరుశురామ్ కి.
సిగరెట్ పీకని ఏష్ ట్రేలో కుక్కి మరో సిగరెట్ వెలిగించి మంచం దిగి కిటికీ దగ్గరకి నడిచాడు.
విశాలమైన ఆవరణ.... చెట్లు.... వృక్షాలతోనూ, పూలతోనూ కళకళ లాడుతున్నాయి. బాగా పొద్దెక్కింది. గడియారం ఒక గంట కొట్టింది. వెనక్కి తిరిగి చూశాడు.
తొమ్మిదిన్నర.
'చాలాసేపు పడుకొన్నానన్న మాట!' అనుకుంటూ-
అతను అప్రయత్నంగా చేతిని ప్యాంట్ జేబులోకి పోనిచ్చి ఉలిక్కిపడ్డాడు.
తన జేబులో వుండే ప్లెయింగ్ కార్డ్సు లేవు.
అతనికి గుర్తుకొచ్చింది.
గత సాయంత్రం స్నానం చేసినప్పుడు తను విడిచిన బట్టల్లోనే వున్నాయి.
ఆ బట్టలు బాత్రూంలో వుండాలి.
ఇప్పుడు తన ఒంటిపైన వున్నవి నందిని ఇచ్చిన కొత్త దుస్తులు.
ఎప్పుడూ ఇలా జరగలేదు. అసలు తనెలా మరిచిపోయాడు.
కార్డ్స్....
కలవరపాటుతో గెస్ట్ రూం లోంచి బయటికి పరిగెత్తుకొచ్చాడు పరుశురామ్.
పనివాడొకడు ఎదురుపడి "ఏం కావాలి బాబూ?" అన్నాడు.
"నా బట్టలు...." అంటూ మేడమీదకి పరుగెత్తాడు పరుశురామ్.
పనివాళ్ళు అతన్ని విడ్డూరంగా చూస్తున్నారు. బాత్రూం తలుపుతోసి లోపలకెళ్ళాడు. అక్కడ తను విడిచిన బట్టలు లేవు.
పనిమనిషి ఉతకడానికి తీసుకెళ్ళిందా? లేక వాటిని దోభీకి వేశారా?
అతనిలో కంగారు ఎక్కువైపోతోంది.
విడిచిన ప్యాంట్ జేబులో వున్నాయి. తను అపురూపంగా చూసుకునే పేకముక్కలు.
బాత్రూంలోంచి బయటకొస్తున్న అతన్ని చూసి రంగన్న అడిగాడు.
"అవి కుళ్ళు గుడ్డలైనా, గజ్జి గుడ్డలైనా నా బట్టలు నాకు కావాలి. అందులో చాలా విలువైన వస్తువుంది" అరిచాడు పరుశురామ్.
రంగన్న అతని కళ్ళల్లో కనిపిస్తున్న ఎర్రజీరల్ని చూసి కలవరపడుతూ అన్నాడు.
"నాకు తెలీదు బాబూ! ఆ బట్టల్ని ఉతికించమంటారామ్మా అని అడిగితే ఆ కుళ్ళు బట్టలు వేసుకునే ఖర్మ మీకు పట్టలేదన్నారు అమ్మగారు. అందుకే ఎవరో అడుక్కునే వారికి ఇచ్చేశారు"