"ఛీ.... దున్నపోతు...." అని బట్టలు అందుకోబోతూ గబాల్న చేయి పట్టుకుని అతన్ని లోపలికి లాగేసింది ఊర్మిళ.
పరుశురామ్ నిర్ఘాంతపోయాడు.
ఎదురుగా నగ్నంగా నిలబడి వుంది ఊర్మిళ. ఏ మహాశిల్పో జీవితమంతా కష్టపడి చెక్కిన అద్భుతమైన శిల్పంలా ఆమె శరీరం, సౌష్ఠవం, అవయవాలు, లోయలు, గుట్టలు, ఒంపులు, సొంపులు, సోయగాలు....
అదే మొదటిసారి ఓ వయసొచ్చిన ఆడపిల్లని నగ్నంగా చూడ్డం....
ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. అతని ఒంట్లో రక్తం మరిగి పోతూ వేగంగా ప్రవహించడం మొదలుపెట్టింది. శరీరంలో ఏదో కంపన, వణుకు.... గొంతులో ఏదో అడ్డుపడినట్లు, గుటకపడడం లేదు. పెదాలు తడి ఆరిపోతున్నాయి.
"నీకు సరసం కూడా తెలీదు. దివ్యదర్శనాన్ని ఇచ్చిన ఆడపిల్ల మొహాన చీర విసిరికొడతారా ఎవరన్నా! కట్టాలి కానీ!"
"ఉన్నవన్నీ విప్పుకుని కట్టమని అడగడానికి సిగ్గుపడాలి" అన్నాడు కోపంగా.
"సిగ్గెందుకు బావా! ఆడపిల్లని నగ్నంగా ఇద్దరే చూస్తారు. పసితనములో తండ్రి. వయసొచ్చాక భర్త. నువ్వు నాక్కాబోయే భర్తవని తెలుసు. అందుకే నీకిలా కనుపించడానికి నేను సిగ్గుపడలేదు."
"నిన్ను చేసుకోవడానికి ఎవరూ రెడీగా లేరిక్కడ!" అని వెనక్కి తిరగబోతుంటే అతన్ని పట్టుకుని గభాల్న చెంపపై ముద్దు పెట్టుకుంది ఊర్మిళ.
ఆమె చర్యకతను ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు.
"బావా, నా వాడు అనుకొన్నవాడికి నేనిచ్చిన తొలి కానుక ఈ ముద్దు!"
"తియ్యగా లేదా?"
"........." కోపంగా చూశాడు పరుశురామ్.
"మత్తుగా లేదా?"
"........."
"అంత చేదుగా వుందా? ఉహ్హు!"
"ఏయ్ నన్ను విడిచిపెట్టు. ఏమిటీ బాత్రూం ప్రేమా! ఎవరన్నా చూస్తే నిన్నేదో చేసాననుకొంటారు."
"ఏమీ చేయలేదుగా!" అంది చిన్నగా నవ్వుతూ.
అతను మాట్లాడలేదు.
"బావా! నువ్వు నన్ను ప్రేమించడంలేదా?"
"........."
"నేనంటే నీకిష్టం లేదా?"
"..........."
"ఇంకెవర్నన్నా ప్రేమిస్తున్నావా?"
"............"
ఊర్మిళ కళ్ళల్లో తళుక్కున కన్నీరు మెరిసింది.
"పోనీ నన్ను ప్రేమించడానికి ట్రై చెయ్యొచ్చుగా" అడిగింది ఊర్మిళ.
"ఏయ్! లోపల ఏం చేస్తున్నావు. స్నానమా? జపమా?" నందిని పిలుపుతో ఈ లోకంలో పడ్డాడు పరుశురామ్.
"ఆ కుళ్ళు బట్టలు వేసుకోకు మళ్ళీ!" హెచ్చరించింది.
పరుశురామ్ తికమకపడ్డాడు.
"నేనెలా బయటికి రావాలి? బట్టలు లేకుండా!"
నందిని నవ్వుతూ---
"బూచోడ్ని చూసి నేనేం దడుసుకోనుగానీ తలుపు తీసుకుని వచ్చేయ్" అంది.
తువాలు చుట్టుకుని బయటికి వచ్చాడు పరుశురామ్.
అతనికేసి చూసింది నందిని.
కడిగిన ముత్యంలా వున్నాడతను.
డ్రస్సింగ్ టేబిల్ దగ్గరకి తీసుకెళ్ళి---
"ఇవిగో ఈ బట్టలు తీసుకో!" అంది.
అతను ఆశ్చర్యంగా చూశాడు.
"నువ్వు స్నానం చేసేలోగా నీకోసం కొత్త డ్రస్ తెప్పించాను" చెప్పింది నందిని.
అతను పౌడర్ రాసుకొని, తల దువ్వుకొని, బట్టలు వేసుకొన్నాడు. ఇప్పుడతనికెంతో ఉల్లాసంగా వుంది. చాలా హాయిగా వుంది.
"ఎంత ఆకలి మీద వున్నావో పద. భోజనం చేద్దుగానీ...." అంది నందిని.
టేబిల్ పైన ఎరేంజ్ చేసిన ఆహార పదార్ధాలని చూడగానే ఆకలి గుర్తుకొచ్చింది పరుశురామ్ కి.
కుర్చీలో కూర్చోబోతున్న అతని కంటికి డైనింగ్ టేబిల్ పైన ఓ ప్లేటులో పెట్టివున్న కొత్త ప్లేయింగ్ కార్డ్స్ సెట్ కనిపించింది. అంతే! అతను అప్పటివరకు వున్న ఆకలిని మరిచిపోయాడు.
నందిని మొహంలో చిరునవ్వు వెలుగుతోంది. అతను కార్డ్స్ ని చేతిలోకి తీసుకొని షఫుల్ చేస్తూ వెళ్ళి కుర్చీలో కూర్చుని ఆడుతూ టీపాయ్ పైన ముక్కలు విసరడం మొదలు పెట్టాడు.
"అబ్బ పోలికలే అన్నీ!" మెల్లగా అంది నందిని.
పరుశురామ్ చెవికి ఆ మాటలు వినిపించినాయి. తలెత్తి ఆమె మొహంలోకి చూసాడే తప్ప 'ఏమిటీ!' అని అడగలేదు. ఆమె మాటల్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. ఆకలిని మరిచిపోయి పేకముక్కల ధ్యాసలో పడిపోయాడతను.