ఆ కార్పెట్ మీద కాళ్ళు పెట్టి నించుంటే తనకే అగ్లీగా తోచింది పరుశురామ్ కి. ఆ కార్పెట్ పైన నడిచే అర్హత తనకి వుందా?
పనివాళ్ళు ఆమెని చూసి వెనక్కి తొలగి నించున్నారు.
ఆమె ఎవర్నీ పలకరించలేదు.
"కమాన్" అని మేడ మెట్లవైపు దారితీసింది నందిని.
పరుశురామ్ మంత్రముగ్ధుడవుతూ ఆమెతో మెట్లెక్కుతూ ఆగిపోయాడు స్టెయిర్ కేస్ లాండింగ్ దగ్గర. ఆమె వయసులో వున్నప్పుడు తీయించుకున్న లైఫ్ సైజి్ ఫోటో గోడకి వేలాడుతోంది.
అతను కళ్ళార్పకుండా ఆ ఫోటోకేసి చూస్తుంటే నందిని నవ్వుతూ అన్నది.
"బహుశా ఆ వయస్సులో నన్నుచూసి వుంటే ప్రేమించేవాడివా పరుశురామ్?"
ఆమె ప్రశ్నించిన తీరుకి సిగ్గుపడ్డాడతను. తనలా అంత పరీక్షగా చూడ్డం తప్పేమోననుకున్నాడు.
పరుశురామ్ ఆమెకేసి చూసి తలదించుకున్నాడు.
"నువ్వు తల దించుకొనే పనేం చేయలేదులే, పద." అని అతని చేయి పట్టుకుని పైకి తీసుకెళుతుంటే--- మురికిబట్టలు, సంస్కారం లేని జుట్టు, ఎవరో రోడ్డుమీద తిరిగే జులాయిలావున్న అతన్ని అంత చొరవగా, ఆప్యాయంగా వెంటబెట్టుకురావడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది పనివాళ్ళకి. మేడం కోసం ఇలాంటి బుక్కా ఫకీరు వేషాల్లో ఎప్పుడూ ఎవరూ రాగా వాళ్ళు చూళ్ళేదు. మేడం దగ్గరికి ఎవరొచ్చినా గొప్పవాళ్ళే వస్తారు. కారుల్లో వచ్చేవాళ్ళే తెలుసు వాళ్ళకి.
మేడ మెట్లు ఎక్కి డైనింగ్ హాల్ దగ్గరకొచ్చేసరికి ఆగిపోయాడు పరుశురామ్.
అతన్ని చూసి "ఏం ఆగిపోయావు?" అంది నందిని.
"ఆగిపోవడం కాదు. ముందు భోజనం చేయాలనుంది" అన్నాడు.
అతనికేసి జాలిగా చూసింది నందిని.
"నీకు అన్నీ పెడతాను. అన్నీ ఇస్తాను. ముందు స్నానం చేసిరా!"
"ప్లీజ్! స్నానంచేసే ఓపిక నాకు లేదు. నిజం చెప్పాలంటే ఎవరి చేతిలోనన్నా ఏదన్నా ఆహారం పొట్లం కనిపిస్తే లాక్కోవాలన్నంత కసిగా వుంది" అన్నాడు.
"నీ ఆకలి నాకు తెలుసు రామ్. నీ ఆకలి నేను తీరుస్తాను. కానీ ముందు స్నానం చెయ్యి. నీ దగ్గర గుర్రం వాసన వస్తోంది. ఇప్పటివరకు భరించాను. ఆ వాసన పోవాలంటే నా కారుకూడా కడిగించాలి. పద ముందు బాత్రూంలోకి."
అతన్ని చేయి పట్టుకొని బలవంతాన అటాచ్ డ్ బాత్ రూంలోకి తోసి తలుపు దగ్గరికి లాగేసింది నందిని.
ఆమె రెండు నిమిషాల తర్వాత బాత్ రూం తలుపు దగ్గరకొచ్చి మునివేళ్ళతో తలుపు మీద కొట్టింది.
"రామ్!" అని పిలిచింది.
"ఏమిటి? ఏం కావాలి?" అడిగాడు.
"తలుపు తియ్!"
ఆమె మాటలకి ఉలిక్కిపడ్డాడు పరుశురామ్.
"ఎందుకు?"
"దున్నపోతుకి నలుగు పెట్టడానికి" అంటూ నవ్వింది.
"అబ్బే.... ఒద్దు!" కంగారుగా అన్నాడు పరుశురామ్.
"నీ మొహం... నీ ఒళ్ళు పట్టటానికి నేను మాలిష్ చేసేదాన్ని కాదు. నువ్వు చేస్తే చేయించుకొంటాను. అంతే!" అని "టవల్ మర్చిపోయావు తీసుకో" అంది.
పరుశురామ్ మెల్లగా తలుపుతీసి టవల్ అందుకున్నాడు.
అతనికి ఊర్మిళ గుర్తుకొచ్చింది.
ఊర్మిళ అతని మేనమామ కూతురు. ఆ రోజు అతను ఏదో పని చేసుకొంటుంటే---
"బావా!" కేకపెట్టింది ఊర్మిళ బాత్రూంలోంచి.
"ఏమిటి? బాత్ రూం లో కూడా బావేనా?" విసుగ్గా అన్నాడు పరుశురామ్.