ఏమంటున్నది
ఎఱ్ఱకోటపై ఎగిరే జెండా
ఏమంటున్నది? ఏమంటున్నది?
శౌర్యం త్యాగం సమైక్యభావం
జాతి కెల్ల కావాలంటున్నది
పూరిగుడిసెలో తిరిగే తిరుగలి
ఏమంటున్నది? ఏమంటున్నది?
ఇల్లూ వాకిలి తిండీ గుడ్డా
ఎల్లరకూ కావాలంటున్నది
సిపాయి పేల్చిన తుపాకిశబ్దం
ఏమంటున్నది? ఏమంటున్నది?
విరోధమూకల నిరోధించి నీ
పరాక్రమం చాటాలంటున్నది.
తూర్పున పొడిచే సూర్యుని కిరణం
ఏమంటున్నది? ఏమంటున్నది?
చీకటిగదిలో మూల్గె లక్ష్మిని
వెలుగులోకి తేవాలంటున్నది
వీరజవానులు బిగిసిన పిడికిలి
ఏమంటున్నది? ఏమంటున్నది?
హాద్దు దాటు తోడేళ్ళ గుండెపై
గ్రుద్ది బుద్ది చెప్పాలంటున్నది
చల్లగ ఎగిరే శాంతిపావురం
ఏమంటున్నది? ఏమంటున్నది?
"జగ మంతా ఒకటే కుటుంబ" మను
సద్భావం రావాలంటున్నది.
ఇన్నినాళ్ల స్వాతంత్ర్యవికాసం
ఏమంటున్నది? ఏమంటున్నది?
ఇక్కడి డెబ్బైకోట్లమంది ప్రజ
ఒక్కటియై నిలవాలంటున్నది.
తమసో మా జ్యోతిర్గమయ
నవనవ కాంతులు చిమ్మే రవికిరణం ఏమన్నది?
చీకట్లను చీల్చి వెలుగులోకి అడుగులిడమన్నది
ఎండుగడ్డి కొనుటకు పోయిన చిన్నది ఏమన్నది?
గడ్డంతా బొమ్మలకే ఖర్చయి పోయిందన్నది.
పాక మీద ఎగురుతున్న కాకిపిల్ల ఏమన్నది?
గద్దెలు మిద్దెలు స్థిరములు "కావు " "కావు" "కా" వన్నది.
గడప కింద మూల్గుతున్న గజ్జికుక్క ఏమన్నది?
"రామరాజ్య " మునకు సాటి "రామారాజ్య' మేనన్నది.
భజే శ్రీనివాసమ్
చిదానందమూర్తిం సదామోద కీర్తిం
కృపాక్షీర సింధుం ప్రసంనాత్ముబంధుం
ప్రవృత్తం సువృత్తం ప్రమోదార్ధ్రచిత్తం
ప్రభుం దివ్యభాసం భజే శ్రీనివాసమ్
పరబ్రహ్మరూపం విరాడ్విశ్వదీపం
సతాం కల్పవృక్షం క్రుతాశీః కటాక్షం
పవిత్రం సుగాత్రం ప్రమత్తారి జైత్రం
ప్రభుం మంజుహాసం భజే శ్రీనివాసమ్.
విరాజత్కిరీటం వరశ్రీలలాటం
స్పురత్తారహారం సుచేతోవిహారం
వరేణ్యం శరణ్యం త్రిలోకాగ్రగణ్యం
ప్రభుం ప్రీతదానం భజే శ్రీనివాసమ్.
మహామ్నయసారం మనోజ్ఞావతారం
ఖగాధీశవాహం సుగంధర్ధ్రదేహం
అనంతం మహాంతం నమస్తాగమాంతం
ప్రభుం హృద్వికాసం భజే శ్రీనివాసమ్.
వివన్నార్తినాశం విభుం వెంకటేశం
ప్రవన్నావలంబం ప్రసన్నాస్యబింబం
పరేశం సురేశం చిరం సుప్రభాశం
ప్రభుం చిద్విలాసం భజే శ్రీనివాసమ్.
కాంతిరేఖలు
వెలిగింపవె! వెలిగింపవే! వీరబాల! దీపమాల!
స్వాతంత్య జ్యోతులతో ప్రజాభ్యుదయ గీతులతో
లేశమైన మసి అంటని లేతలేత చేతులతో
చెల్లీ! బంగారు తల్లీ! చైతన్యపు పాలవెల్లి!
ప్రతి ఒక దీపం ప్రతి ఒక మృతవీరుని "స్మృతిపతాక"
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
అస్వతంత్ర భారతీయ దాస్యతమస్సమూహముల
శాశ్వతముగ పోకార్చిన విశ్వశాంతి చేకూర్చిన
"బాపూజీ" త్యాగానికి ప్రతిరూపం ఒక దీపం
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!'
ఆంధ్రరాష్ట్ర సంసిద్దికి ఆమరణం దీక్ష బూని
ఆత్మాహుతి గావించిన - అసువులు అర్పణ చేసిన
'అమరజీవి' దివ్యస్మృతి కనురూపం ఒక రూపం ఒక దీపం
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
మన్యంలో నవనవ చైతన్యం రేకెత్తించిన
తెల్లదొరల గుండె లదర విల్లెక్కిడి గర్జించిన
వీరశిరోమణి మన 'అల్లూరి" పేర ఒక దీపం
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
పారతంత్ర్య శృంఖలాలు ఫటపట,మని త్రెంపివైచి
కటకటాలు వెడలివచ్చి 'జైహిం"దని పిలుపు నిచ్చి
జాతికి జీవం పోసిన 'నేతాజీ" పేరు మీద
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
దుండగులగు శ్వేతముఖుల గుండెలలో నిద్రపోయి
చిరునవ్వులు చిందిస్తూ ఉరికంబం పైకెక్కిన
భరతమాత ముద్దుబిడ్డ "భగత్సింగు పేరు మీద
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
"రాణా ప్రతాపసింహుని " రక్తారుణ రోచిస్సులు
ఛత్రపతి "శివాజీ" ప్రభు క్షత్రోచిత వర్చస్సులు
వీరనారి "ఝాన్సీ" దుర్వారశౌర్య తేజస్సులు
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
యుగయుగాల చైతన్యం జగజగాల నిండించిన
చండ ముండ నిశుంభాది దుండగులను ఖండించిన
మహాదుర్గ "మహిషాసుర మర్ధని" కై ఒక దీపం
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
వేణిన్ జోల్లెమ్ము జుట్టి పాణిన్ విల్లమ్ము పట్టి
యుద్దమందు నరకాసురు నౌద్దత్యము చెదరగొట్టి
జగతికి వెలుగులు వెలార్చు 'సాత్రాజితి' పేరు చెప్పి
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
"మాధవ విద్యారాణ్యుల" మహిత శుభాశీస్స్రవంతి
"కృష్ణదేవరాయ" మకుట కీలితనవరత్నకాంతి
"భువనవిజయ' గుళికలుగా నవనవ సుమకళికలుగా
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
కాకతీయ సామ్రాజ్య శ్రీకాంతులు నలుదిక్కుల
ప్రాకించిన - అరుల గిరుల ప్రాకించిన వీరాంగన
భద్రాయితమూర్తి యైన "రుద్రాంబిక' పేరు మీద
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
బ్రతుకంతా పరుల కొరకే పాటుపడే "హనుమానులు"
కల్లా కపటం తెలియని పల్లెటూరి "భగవానులు"
కార్మిక కర్షక పవిత్ర ఘర్మజలం తైలంగా
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
స్వాతంత్ర్య మహాయజ్జ జ్వాలలలో భస్మమైన
అజ్ఞాత మహావీరుల ఆత్మల కొక ప్రతీకగా
సమ సమాజ మానవ నవజాగృతి జయపతాకగా
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!
మాలిన్యం మలగిపోవ! మాత్సర్యం తొలగిపోవ
దౌర్భాగ్యం తరలిపోవ! చీకట్లని చెదరిపోవ
జాతీయత చివురించిన చైతన్యం వికసించిన
లేత లేత చేతులతో చెల్లీ! బంగారు తల్లి!
వెలిగింపవె! వెలిగింపవె! వీరబాల! దీపమాల!