Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యము - 2 పేజి 51

 

                                   నవనవానంధం

    "నవత" నాట్యమ్ము సేయు "మానవత' తోడ
    "సమత" వెలుగొందు తీయని "మమత" తోడ
    కలము హలముల సాంగత్యబలము తోడ
    "నవయుగము" మీకు నవనవానంద మొసగు!

    కార్మికుల కర్షకుల ఘర్మకణము లన్న
    మణులు చెక్కిన కనక కంకణము లన్న
    సరిసమాన గౌరవ మిచ్చి పరిధవిల్లు
    "నవయుగము" మీకు నవనవానంద మొసగు!

    బీద గుడిసెకు ప్రభువు ప్రాసాదమునకు
    గడ్డి బండికి మోటారు కారునకును
    అంతరము లేని స్వర్ణ సంక్రాంతి వేళ
    "నవయుగము" మీకు నవనవానంద మొసగు!


                           ఒక్కమాటు దిగిరావయ్యా

    ఒక్కమాటు దిగిరావయ్యా!
    ఓ గాంధీ తాతయ్యా!
    భారతంలో జరుగుతున్న
    "భాగోతం" చూద్దువుగాని -

    గడియారం చూసుకొని
    కాలిజోళ్ళు వేసుకొని
    కళ్ళద్దాల్ పెట్టుకొని
    కర్ర చేత పట్టుకొని
    
    సత్యం గొంతుక నొక్కారు
    శాంతి పావురం రెక్కలు చెక్కారు
    అబోతులు అబోతులు క్రుమ్ములాడి
    దూడల కాళ్ళు విరగ ద్రోక్కారు

    కదిలిస్తే చాలు లంచాలు
    పదవులు పందిరి మంచాలు
    జీవితాలు ఎంగిలి చెంచాలు
    చేతస్సులు చిలుం పట్టిన కంచాలు
    
    గాంధీజీ! నీ మహోపదేశం
    గంగలో కలిపిం దీ దేశం
    నేటి సమాజం "కుళ్ళిన కిళ్ళీ"
    నిజాయితీ "హళ్లికి హళ్ళి"

    నిరుపేదకు గతి కనరాదు
    అధికారికి మతి అసలే లేదు
    జీతం చాలని మధ్యతరగతికి
    జీవితమంతా ఒకటే చేదు
    
    గద్దెల కోసం మిద్దెల కోసం
    గుద్దులాడు కొంటున్నారయ్యా!
    పెద్దదొరలు పేదల వీపులపై
    మద్దెల వాయిస్తున్నారయ్యా!

    మీరి పోయింది స్వార్ధం
    పారిపోయింది పరమార్ధం
    భారతంలో జరుగుతున్న
    "భాగోతం" చూద్దువు గాని
    ఒక్కమాటు దిగిరావయ్యా!
    ఓ గాంధీ తాతయ్యా!

                                       ప్రతిధ్వని

    నెహ్రూ ఎగురవేసిన వెన్నెల పావుర మేమన్నది?
    "స్వేచ్చా జీవనమే నా జీవితలక్ష్యం" అన్నది.
    
    గుట్టమీద మిన్నంటే గుడిగోపుర మేమన్నది?
    "మచ్చలేని ఔన్నత్యం మనిషికి కావా"లన్నది.

    చతుర్బుజాల్ పైకెత్తిన చార్ మీనా రేమన్నది.
    "భుజం భుజం కలిపి ప్రజలు పురోగమించా"లన్నది.

    చకచక పరుగెత్తే "కృష్ణా ఎక్స్ ప్రెస్ ' ఏమన్నది?
    "పట్టాలను తప్పనంత వరకే మన "పరు"వన్నది.

    నెత్తురు రుచి మరిగిన సరికొత్త కత్తి ఏమన్నది?
    "నను పట్టినవాడి చేయి నరికి పోగు లిడ" మన్నది.
    
    కరుణారస పూర్ణమైన కవి హృదయం ఏమన్నది?
    "సమసమాజ నిర్మాణం జాతికి ప్రాణం" అన్నది.

    
                                                 విజయగోపాలము


    మధురానగారికి ఉగ్రసేనుడే మహారాజు ఒకనాడు
    కారాగారం కటకటాలలో కాలం గడుపును నేడు
    దయ మాలిన కంసుడు సృశంసుడై తండ్రిని చెరలో తోశాడు
    కత్తి దీసి గర్జించి బంధువుల కుత్తుకలను తెగ కోశాడు
    చెల్లెలైన దేవకిని భర్తతో జైలులోన బంధించాడు
    పొత్తుల పాపల ఖండించాడు నెత్తురు మాడుగుల నిండించాడు.
    
    శిశుహత్యలు గోహత్యాలు సాగెను చేలరేగెను పశుకృత్యాలు
    అశాంతి తల విరబోసుకు చేసెను పిశాచ రాక్షస నృత్యాలు
    నిరంకుశత్వం దురాక్రమణతో ధరాతలం క్రుంగినది
    స్వార్ధం పరమార్ధాన్ని మ్రింగినది సత్యానికి తల వంగినది.

    దేవదేవుడే వాసుదేవుడై దేవకీ కడుపునా పుట్టాడు
    శిష్టరక్షణం దుష్టశిక్షణం చేయగ శపథం పట్టాడు
    అన్నతోడ అరుదెంచి మల్లురను తన్ని కింద పడగొట్టాడు
    గద్దె మీది కంసుడు గుండె చెదరి దద్దరిల్లి గీపెట్టాడు.

    
                                కంసగోపాల సంవాదం

    "గారాన పాలిచ్చు నారీమణిని పట్టి
        ప్రాణాలు తీయుట పౌరుషంబె?"
    "పాలిత్తునని వచ్చి హాలాహలంబిచ్చె
        నారియా అది పెద్దమారి గాని;"
    "గోపాలుడవు కుర్రకుంకవు ఇటువంటి
        భూపాల సభ చేతు లూపదగునె?"
    "పాపాల పడిన భూపాల కోపాల తా
        పాల చల్లార్చు గోపాలు డితడు;"
    "పులిముందు నిలుచుండి పలికె నీనాడు "మే
        మే" యంచు ఒక నల్లమేకపిల్ల",'
    "కన్నతండ్రిని చెరగొన్నట్టి పులి భళీ!
        శ్రీరంగనీతులు చెప్పె నేడు;"
    "దొంగవై ఇల్లిల్లు దూరి వెన్నులు దెచ్చి
        పిల్ల జట్టుకు పంచిపెట్టుటేమి?"
    "బ్రతుకు పాల్కడలిలోపలి సార మీ ప్రేమ
        నవనీతమని చాటినాను మామ!"

    "మామ ఎవ్వాడురా ! నీకు మందబుద్ది?"
    'అమ్మతోబుట్టువును మామ అందురయ్య!"
    'అమ్మ ఎవ్వతెరా? యశోదమ్మ కొడుక!"
    "దేవరకు చెల్లి; దేవకీదేవి తల్లి"

    బెబ్బులివలె కంసుడు గదగొని పెనుబొబ్బ పెట్టినాడు
    సింహ కిశోరము వలె హరి కంసుని సంహరించినాడు
    చేరలోపలి దేవకీ వసుదేవుల శృంఖలాలు విడగొట్టాడు
    మధురానగరికి ఉగ్రసేనునే మళ్ళీ పట్టం గట్టాడు.

        
                             మధురాతి మధురం
    
    అందం మధురం! చిందిన మకరందం మధురం!
    ఉదయం మధురం! బుద్దదేవుని హృదయం మధురం!
    సమత మధురం! కన్నతల్లి మమత మధురం!
    నవత మధురం! మేల్కొన్న మానవత మధురం!
    కాంతి మధురం! నవయుగ సంక్రాంతి మధురం!
    దానవుని దాహించిన మానవుడు
    "మానవుడు" గా బ్రతకటం
    మధురాతి మధురం!!

 Previous Page Next Page