"సరే పద" అంది.
"పోనీ ఏదన్నా ఇంగ్లీషు సినిమాకి వెళదాం"
"అర్ధంకాక మధ్యలో నన్ను గిల్లితే మళ్ళీ ఆ రౌడిల్ని పిలిచి కొట్టిస్తాను!" అంది.
"ఇంగ్లీష్ సినిమా చూడాలనుకునేది నీ బుగ్గలు గిల్లడానికే" నవ్వుతూ అన్నాడు.
అర్జున పగలబడి నవ్వేసి అంది.
"ఏం స్వామి నా బుగ్గలు గిల్లడానికి వెళ్ళాలన్న మాట. పూర్ ఫెలో అది చూద్దాం పద"
విజయ్ కారు వెనక కూర్చున్నాడు. అర్జున కోపంగా చూసింది.
"నేనేం నీ డ్రయివర్ని కాదు వచ్చి ముందు కూర్చో" అంది.
విజయ్ మళ్ళీ కారు దిగివచ్చి అర్జున పక్కనే కూర్చున్నాడు.
-సినిమా జోరుగా సాగుతుంది. అర్జున దృష్టి సినిమా పైన లేదు. అతని చేతిని పట్టుకొని అతని వైపే చూస్తోంది.
విజయ్ అన్నాడు.
"మనం వచ్చింది. సినిమా చూడ్డానికి నువ్విలా నా మొహం చూస్తూ కూర్చోడానికి కాదు."
అర్జున సిగ్గుపడలేదు. తియ్యగా నవ్వింది. అతని చేతిపైన గిల్లింది.
"నాకిప్పడే ఓ విషయం తెలిసింది" అంది.
"ఏమిటి?"
"ఈ సినిమాకంటే నీ మొహమే బాగుంది."
"ధాంక్యూ"
"ధాంక్యూ అని కూర్చోకపోతే బయటపోయి ఓ కూల్ డ్రింక్ పట్రాకూడాదా!" అంది.
విజయ్ అర్జున కేసి చూసి అడిగాడు.
"నీ బాగ్ లో పెన్ నైఫ్ వుంది కదూ!
"ఉంది"
"ఇటివ్వు"
"దేనికి"
"నీ ముక్కూ, చెవులు కోసేయడానికి"
"ఆ తర్వాత బాధపడేది నువ్వు"
"నేనా!"
అర్జున అతని మొహంలోకి చూసింది. చీకటిలో ఆమె మొహం లోని భావాలు అతనికి కనబడలేదు.
అర్జున అతనికి దూరంగా జరిగికూర్చుంది. సీరియస్ గా స్క్రీన్ కేసి చూడ్డం మొదలు పెట్టింది.
విజయ్ ఓరగా చూశాడు. చీకటిలో ఆమె అందమైన పెదవులు వంకర్లు తిరగడం మాత్రం అతను గమనించాడు విజయ్. అర్జునకి కోపం వచ్చిందని గ్రహించాడు విజయ్.
పది నిమిషాలు గడిచినా అర్జున ఏమి మాట్లాడక పోవడంతో విజయ్ నొచ్చుకున్నాడు.
"నిజంగా కూల్ డ్రింక్ కావాలా?" అడిగాడు.
అర్జున చివాల్న చూసిందతన్ని.
"కూలి డ్రింక్ కాదు. నీ మొహం కావాలి ఇస్తావా?" అంది.
"ఊ!" అంటూ దగ్గరగా జరిగాడు విజయ్ అర్జున అతని చెంప పైన ముద్దు పెట్టుకుంది.
"నీ కోపం ఇంత త్వరగా పోతుందనుకోలేదు" అన్నాడు.
"నేను కోపంగానే వున్నానిప్పుడు !" అంది హాలులోంచి బయటకి నడుస్తూ.
"పోనీ ఏంచేస్తే పోతుందో చెప్పు"
"నన్నెత్తుకుని వూరంతా తిప్పు"
"అలాగే"
"ఫోజు తెలుస్తూనే వుంది"
"కారాపితే తెలుస్తుంది."
ఈ కారుకి ఎక్కడ పడితే అక్కడ బ్రేకులు పడవు మిష్టర్ అంది అర్జున.
కారు ఇల్లు చేరింది
అర్జున వెనకే నడిచాడు విజయ్.
"ఏమే రంగి డాడి రాలేదా?" అడిగింది వంటమనిషిని.
"నాన్నాగారు క్లబ్బుకి వెళ్లారమ్మా" మది అర్జున చేతి గడియారం కేసిచూసింది. ఆరయింది.
అర్జున క్రిమినల్ లాయర్ వరదరాజులుగారి ఎకైక పుత్రిక.
వరదరాజు చేతిలో కేసుపడితే నిందితుడు గుండెలపైన చెయ్యి వేసుకొని పడుకోవచ్చు.
అర్జున పుట్టిన రెండేళ్ళకి లాయర్ గారికి భార్యా వియోగం కలిగింది. అంచేత తల్లిలేని ఆ పిల్లని కంటికి రెప్పలా పెంచుకొంటున్నా డాయన.
అర్జునకి, విజయ్ కి గల స్నేహం గురించి ఆయనకీ పూర్తిగా తెలుసు వరదరాజులు స్టేటస్ కి ఏ కొండమీదినించో గొప్ప వరుడ్ని వేటాడి తేగలడు ఆయనకి ఆస్తిపాస్తులకి కొదువలేదు కూతురిష్ట పడింది కనుక విజయ్ నే అల్లుడిగా చేసుకోవాలని ఆయన కూడా నిశ్చయించుకున్నాడు.
అంచేత విజయ్ రాకపోకలకి ఆ ఇంట్లో ఏ విధమైన ఆభ్యంతరమూ లేదు.
"విజయ్ చూడు డాడి ఏంచేశారో, నేను పుట్టిన రోజని తెలిపి క్లబ్స్ కెళ్ళి పోయారు" అంది.
"ఈ రోజు నీ బర్త్ డే అని నాకెందుకు చెప్పలేదు" విజయ్ కోపంగా అడిగాడు.
"చెబితే ఏం చేసేవాడివి?" నవ్వుతూ అడిగింది.
"ఏమో!"
రంగి చెప్పింది.