4. ప్రేమ పుష్పం
"వెన్నెల్లో తాజ్ మహల్ ని చూడాలి అంటారుగానీ మురారీ, అలా అన్న వాళ్ళు, ఇంతవరకూ వెన్నెల్లో సముద్రాన్ని చూసి ఉండరని నా ఉద్దేశం. చూస్తే ఆ నిండు చంద్రుడు, ఈ పండు వెన్నెలా, పాల పొంగులా నురుగులు కక్కుతూ ఉరుకులు పరుగులతో ఉక్కిరిబిక్కిరయిపోతూ, ఉవ్వెత్తున ఎగిరిపడుతూ ఇసుక తిన్నెల మీదికి చేరుకోవాలని ఆరాటపడే సముద్ర తరంగాల ఈ సుందర సుమనోహర దృశ్యాలను చూస్తే ఇంద్రలోకం ఇదేనేమో అనిపించదూ? దానికితోడు ఎత్తు పల్లాలతో నిటారుగా నిలుచున్న కొండలు గడ్డిపోచలతో అల్లిన హరిత వర్ణపు పట్టు తివాచీని కప్పుకున్నట్లు మిడిసిపడుతూ వుంటే వెన్నెలతో పోటీగా విద్యుత్ కాంతి సృష్టికే ప్రతిసృష్టి చేసినట్లు తారామండలానికి ప్రత్యర్ధిలా నిలిచి మిరమిట్లు గొలుపుతూంటే, కవులూ కళాకారులే కాదు, మనసున్న ప్రతీ వ్యక్తి ఈ ఆనందాన్ని తనివితీరా అనుభవించరూ? ఈ సముద్రుని హోరు వాగ్గేయకారుడు మంగళపల్లి బాలమురళీకృష్ణ సంగీత కచ్చేరీలా తన్మయత్వంలో ముంచెత్తేస్తూ వుంటే, పిల్లగాలులు వింజామరలు వీస్తూ మేఘాల పల్లకిలో తేలిపోతున్న భావాలను కలిగిస్తే, గాలి వెంటబడి కొట్టుకొస్తున్న నీటి తుపరాలు పన్నీరు జల్లుతూన్నట్టుగా ఒంటిమీద పడి గిలిగింతలు పెడుతూంటే, వచ్చీరాని సంగీతంలో ఎంత హాయి ఈ రేయి ఎంత మధురమీ హాయీ' అని ప్రేమ గీతికలు పాడుకుంటూ వుంటే గుండె గుండెలో ఒక తాజ్ మహల్ నిలవదూ?" గుక్క తిప్పుకోకుండా దిగివచ్చిన దేవకన్యలా అనిపించింది కార్తిక్ కి. రెప్పవాల్చకుండా ఆమెకేసి అలాగే చూస్తుండిపోయాడు.
"ఉష్!.... ఏ లోకంలో వున్నావు?" అతని కళ్ళముందు తన అరచేతిని ఊపుతూ అడిగింది మానస.
"నేనున్నది భూలోకంలోనా, స్వర్గలోకంలోనా అని ఆలోచిస్తున్నాను." ఆమె ముఖం మీద ముఖం పెట్టి చిరునవ్వుతో చెప్పాడు కార్తిక్.
"స్వర్గం - నరకం! అవి మన చేతుల్లో, మన మనసుల్లో వున్నాయి కార్తిక్! ఈ అనుభూతిని ఆస్వాదించే తత్వం వుండాలి. దానితో ఆనందించే మనసుండాలి. అప్పుడీ గాలీ, నీరూ, చెట్లూ, చేమలూ, పక్షులూ, పశువులూ, కొండలూ, బండలూ అన్నీ ఎంతో అందంగా మనకోసమే అమర్చినట్టనిపిస్తాయి. మనసు లేని మనిషికి ఇవన్నీ పిచ్చి పిచ్చి ఊహలే!" అతని ముఖంపై పడుతూన్న క్రాఫ్ ని సుతారంగా మునివేళ్ళతో సవరిస్తూ అంది మానస.
రెండు మనసులూ, ఒక్కటిగా, రెండు తనువులూ ఒక్కటిగా తేలిపోయారు ఇరువురూ. నిశ్శబ్దం సంగీతంలా పలికింది. గంటలు క్షణాల్లా గడిచాయి.
"మానసా! మన చదువులు పూర్తయిపోయాయి. రెండు మూడు రోజుల్లో ఇద్దరం ఇంజనీరింగ్ పట్టానందుకోబోతున్నాం. నువ్వు మీ ఊరికి, నేను మా ఊరికి వెళ్ళక తప్పదు. మన సంగతి మన పెద్దవాళ్ళకి చెప్పకా తప్పదు, వారి దగ్గరి నుంచి మనకి అభ్యంతరాలు రాకా మానవు. ఇవన్నీ మనం ఎదుర్కోవాలి. వీలైనంత త్వరలో! ఇక్కడే ఈ ఇసుక దిబ్బల దగ్గరే, మనం చిన్నారి ఇల్లు కట్టుకోవాలి! కలసి కాపురం పెట్టాలి! పిల్లా....పాపా...."
"ఏయ్....ఆపు." అతని నోటిని తన అరచేత్తో మాసేసింది మానస అతడి ఒడిలోకి వాలిపోతూ.
"చెయ్యి తియ్యి, నన్ను చెప్పనీ....నోటిమీది నుంచి ఆమె చెయ్యి తియ్యబోతూ అన్నాడు.
"అప్పుడే పిల్లలొద్దు బాబూ! కనీసం ఒక సంవత్సరమైనా మనం కట్టుకున్న ఈ అనురాగ కుటీరంలో ప్రేమ పక్షుల్లా మనిద్దరమే జాబిలితో ఆడుకుంటూ, సముద్రుడితో కబుర్లు చెబుతూ, ఈ ఇసక మీద దొర్లుతూ తుళ్లుతూ మైమరచిపోవాలి."
"ఊఁ ! అది నావల్ల కాదమ్మా!....మొదటి సంవత్సరంలోనే మనకి కవలలు ఒక బాబు, ఒక పాప. ఆ తరవాత మరొకరు. అలా ఎంతమంది పుడితే అంతమంది. మనం తారా శశాంకుల్లా, వాళ్ళు మన చుట్టూ నక్షత్రాల్లా...."
"చాల్లే ఊరుకో! ఫామిలీ ప్లానింగ్ డిపార్ట్ మెంటు వాళ్ళెవరైనా వింటే మనకి ఇప్పుడే శస్త్ర చికిత్స చేసేస్తారు...." పకపకా నవ్వింది మానస, నవరాగాలూ పలికించే సప్తస్వరాలలా. పెద్దగా నవ్వాడు కార్తిక్ ఆ రాగాలకి అనువుగా పలికే మృదంగ వాద్యంలా! వీరి సరసాలతో వేడెక్కిపోయిన చంద్రుడు మబ్బుల పరదాలని కప్పేసుకున్నాడు తాపం భరించలేనట్టు. తూరుపు దిక్కు అప్పుడే ప్రసవించింది రవికుమారుణ్ణి ఇరువురూ లేచి, ఒంటికంటుకున్న ఇసుకని దులుపుకుంటూ హాస్టల్ కి బయల్దేరారు.
* * *
కులాంతర వివాహానికి ససేమిరా ఒప్పుకోనన్నారు హరి విఠలరావుగారు. "వ్రతం చెడ్డా ఫలమైనా దక్కుతుందా అంటే, కట్నం కూడా ఏమీ లేదంటున్నావ్?" కళ్ళనీళ్ళు పెట్టుకుంది దేవికారాణి. ఎలాగైతేనేం? పెళ్ళికొప్పించాడు కార్తిక్ అతి తొందర సమయంలోనే. ఆ విషయాన్నే ఫోన్ లోనే చెప్పాలని మానస కోసం హైదరాబాద్ కి ఫోన్ చేశాడు భీమిలి నుంచి. ఎన్నిసార్లు చేసినా 'ఆమె లేదూ....లేదూ....లేదూ...." అనే సమాధానం! ఎన్నో ఉత్తరాలు రాశాడు. అన్నీ తిరిగొచ్చాయి. కార్తిక్ గుండె బద్దలయింది, అద్దాల మేడలా! అందంగా నిర్మించుకున్న అనుభూతుల భవంతి కుప్పకూలిపోయింది. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేసి, అతనిని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన మేనకలా అనిపించింది మానస అతనికి. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆమె రూపే! గాలి వీచినా, వాన కురిసినా ఆమె తలపే! నిదురలో, మెలకువలో - చివరికి శ్వాస పీల్చినా ఒదిలినా ఉచ్చ్వాస నిశ్వాసాలలోనూ ఆమే....ఆమే....ఆమే!
పిచ్చివాడయిపోతూన్న కొడుకుని చూసి కన్నీరు కార్చారు రావు దంపతులు. ఆమెని మరచిపోమని శతవిధాల బోధలు చేశారు. "ప్రేమ నటించి, నిన్ను వంచించిన ఆ పాతకిని మర్చిపోమ్మ" ని హితబోధ చేశారు స్నేహితులూ, పెద్దలూ, ఆప్తులూ అందరూ.
ఏది సత్యమో ఏ దసత్యమో తెలుసుకోలేకపోతున్నాడు కార్తిక్. ఆడదంటే అపర రాక్షసిలా, మనుషుల శరీరాలే కాదు. మనస్సును కూడా పీక్కుతినే కర్కోటకురాలిలా అనిపిస్తోంది కార్తిక్ కి. సముద్రాన్ని చూస్తే కోపం వస్తోంది. వెన్నెలంటే వొళ్ళు మండిపోతుంది. సంగీతం వింటే అసహ్యం పుడుతోంది. ఆడదాన్ని చూస్తే వొళ్ళు కంపర మెత్తుతోంది. కార్తిక్ పిచ్చివాడైపోతున్నాడు.
హరివిఠలరావుగారికి కాన్సరని తెలిసింది. ఇంటిల్లిపాదీ దుఃఖంతో మునిగిపోయారు. కొన్ని నెలలలో అతను అందరినీ, అన్నింటినీ వొదిలి శాశ్వతంగా కనుమరుగైపోతారని తెలిసి, ఎవ్వరూ కూడా అతణ్ణి క్షణం వదలడంలేదు. ఏది కావాలన్నా చిటికెలో చేసి పెడుతున్నారు.
సరిగ్గా అప్పుడే అతని వేలువిడిచినట్లు చెల్లెలు సుమతీ, ఆమె కూతురు పుష్కలా అక్కడికొచ్చారు. పొడవాటి జెడ, పెద్ద కళ్ళూ, తీరైన గుండ్రటి మొహమూ, నాజూకైన అంగసౌష్ఠవమూ - అచ్చం తెలుగుబిడ్డ, బాపూ బొమ్మలా కనిపించింది పుష్కల, హరి విఠలరావుగారికి. "రాజీ! ఈ పిల్ల మన కోడలైతే బాగుంటుందేమో, కార్తిక్ కి చెప్పి చూడు" అన్నారు. రాణీకి కూడా పుష్కల నచ్చింది. రూపమే కాదు, గుణం కూడా. ఎమ్. ఎస్ సి. పాసయ్యింది. పి హెచ్.డి. చెయ్యాలనుకుంటోందిట. అందం, ఆకర్షణ, గుణం అన్నీ సమపాళ్ళలో కనిపించాయి. వెంటనే తండ్రి కోరిక కార్తిక్ కి చెప్పింది. ఈ పరిస్థితుల్లో నోరెత్తలేకపోయాడు కార్తిక్. కన్నతండ్రి ఋణాన్ని తీర్చుకోవాలన్నా, అతణ్ణి సంతోషపెట్టాలన్నా ఇదొక్కటే అవకాశం అతడికి. అందుకే సరేనన్నాడు. ఆ సాయంత్రమే మేడమీది డాబాలో కూర్చుని, మానసతో తన ప్రేమ కథ ఎలా మొదలయిందీ, ఎలా ముగిసిందీ అంతా చెప్పాడు.
"నీ కభ్యంతరం వుంటే ఈ పెళ్ళి జరగదు" అని చెప్పాడు.
పుష్కల చిరునవ్వు నవ్వింది.
ఆ నవ్వులోని అంతరార్ధం అర్ధం కాలేదు కార్తిక్ కి.
"మీరు ఎంత నిజాయితీపరులో, ఎంతటి ప్రేమికులో మీరు కళ్ళకి కట్టినట్లుగా చెప్పిన మీ ప్రేమ కథే చెప్పింది. ఇంతటి మహోన్నత వ్యక్తి 'నన్ను పెళ్ళి చేసుకోవడానికి నీ కభ్యంతరమా?' అని అడిగితే నవ్వురాక మరేమవుతుంది?" అంది పుష్కల.
ఆమె మాటలు వెన్నముద్దల్లా వున్నాయి స్వచ్చంగా!
ఆమె బావాలు అమృత గుళికల్లా వున్నాయి కమ్మగా!
కార్తిక్ లో ఏదో సంచలనం!
ఆమె పట్ల ఏదో కమనీయమైన భావం!
ఆమె నడకలో రమణీయత!
ఆమె మౌనంలో భావుకత
మెల్లమెల్లగా కార్తిక్ ఆమెపట్ల ఆకర్షితుడౌతున్నాడు. రావుగారిలో సంతోషం! దేవికారాణికి పరమానందం! ఒక శుభ ముహూర్తంలో కార్తిక్, పుష్కలలు ఒకటయ్యారు. ప్రకృతి పులకించింది. కల్యాణ భజంత్రీలు నాదవర్షాన్ని కురిపించాయి!
ఆ పులకింతలో వేదోక్తుల మధ్య పెద్దల ఆశీస్సులతో సంసార నావలో అడుగుపెట్టారు కార్తిక్, పుష్కల.
* * *
రెండు వసంతాలు దాటాయి. వర్ష ఋతువు ప్రారంభమయింది. రావుగారు పోయాక ఉద్యోగరీత్యా బొంబాయికి బదిలీ అయి అక్కడే సెటిలయ్యాడు కార్తిక్. పుష్కల బొంబాయినగరంలో 'మహిళా సూపర్ బజార్' ప్రారంభించింది, తెలుగు యువతులందరినీ సమీకరించి. ఉజ్వల, ఉపేంద్ర వారి సంతానం. ఏ ఒడుదుడుకులూ లేక సాగిపోతుంది జీవన నావ.
ఉన్నట్లుండి సుడిగాలులు విరుచుకుపడ్డట్టు, కారుచీకట్లు కమ్మేసినట్లు, తుఫాను ముంచెత్తుకొచ్చినట్టు కార్తిక్ ఉక్కిరి బిక్కిరయిపోయాడు. జెస్ లోక్ హాస్పటల్లోవున్న తన కొలీగ్ సతీష్ ని చూడ్డానికెళ్ళిన కార్తిక్, పక్క బెడ్ మీద పడుకునున్న మానసని చూసి ఖంగుతిన్నాడు. ఆమె ప్రక్కన కూర్చున్న బాలచంద్రుడిలాంటి యువకిశోరాన్ని చూసి సెగల పొగలతో పాత కథలతో ఉడుక్కున్నాడు. 'బహుశ అతడు ఆమె మొగుడై వుండాలి. ఏదో మందు తాగిస్తున్నాడు" అనుకున్నాడు. అతనిలో ఒక్కసారిగా సీలువేసిన యెద గది భళ్ళున తెరచుకుంది! జ్ఞాపకాల దొంతరులు అగ్నిలా దొర్లి జ్వాలలు చుట్టూ చెలరేగాయి. ఆ కోపం ఆ తాపం భరించలేకపోతున్నాడు. ఆమెని పీక పిసికి చంపెయ్యాలనిపిస్తోంది. పక్కనే వున్న అతణ్ణి పిస్తోలుతో పేల్చెయ్యాలనిపిస్తోంది. ఆమెకేసి తీక్షణంగా చూశాడు.
ఆమె చిరునవ్వుతో కార్తిక్ ని చూస్తూ కళ్ళతోనే పలకరిస్తోంది!
ఆ నవ్వు అతని గుండెలో మండే కొలిమిలా అనిపించింది!
ఆ చూపు అతని కళ్ళు భరించలేని జ్వాలలా అనిపించింది!
అంతలోనే ఒక ముగ్గుల గుమ్మ చిన్నారి బొమ్మలా వున్న పిల్ల పూలగుత్తులు తెచ్చి మానసకివ్వడం చూశాడు.
ఆమె వారి కూతురేమో? ఎంత వంచన! తనతో ప్రణయ సల్లాపాలు జరిపి, మరొకరితో పరిణయ వేడుకలు తీర్చుకుంది ఈ మానస ఛీ! ఈ రాక్షసిని ఘోరంగా ఆమె భర్త ఎదుటా, ఆ బిడ్డ ఎదుటా అవమానించాలి! అప్పటికిగానీ తనలోని బాధ చల్లారదు అనుకున్నాడు. మెల్లగా మంచం దగ్గరికి వెళ్ళాడు.
"హలో మానసా! బాగున్నారా? మనం ఆరోజు విడిపోయాక ఇదే కలవటం" అన్నాడు చాలా ఆప్యాయంగా!
"అవును కార్తిక్! నువ్వెలా వున్నావ్?"
"నాకేం, చాలా బాగున్నాను. ప్రేమాగీమా అంతా 'ట్రాష్' అని - మా నాన్నగారు కుదిర్చిన అమ్మాయి నా మేనత్త కూతురు పుష్కలని పెళ్ళి చేసుకున్నాను. ఇద్దరు అందమైన పిల్లలు ఉజ్వల, ఉపేంద్ర. మలబార్ హిల్స్ లో మా ఇల్లు! మా ఆవిడ బాంబేలో బిజినెస్ మాగ్నెట్! సంఘ సేవకురాలు!" గుక్క తిప్పకోకుండా చెప్పేశాడు.
మానస చిరునవ్వు నవ్వింది. "ఐ....యామ్....వెరీ....హాప్పీ....కార్తిక్! నువ్వు చాలా సంతోషంగా వున్నావు. జీవితంలో చక్కగా స్థిరపడ్డావు" అంది.
ఆమె అసూయతతో ఉడుక్కుంటుదనుకున్న కార్తిక్, అలా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడుతుంటే మరింత భరించలేకపోతున్నాడు.
"ఇతడు నీ భర్తా?" అతనికేసి అదోలా చూస్తూ అడిగాడు.
"కాదు, మా తమ్ముడు."
ఖంగుతిన్నాడు కార్తిక్!
"ఆ అందాలపాప నీ కూతురా? అచ్చు నీ పోలికలోనే వుంది" అన్నాడు పాపకేసి చూస్తూ.
"అది వాడి కూతురు. దానికి మేనత్తని కదా, నా పోలికే వచ్చింది. నా పేరే పెట్టారు దానికి."
ఈసారి మరీ షాక్ తిన్నాడు. ఏమనాలో, ఏమడగాలో అర్ధం కాలేదు.
అది గమనించిన మానస, పాపని తీసుకుని బజారుకెళ్ళి రెండు బిస్కట్టు ప్యాకెట్లు తెమ్మని చెప్పింది తమ్ముణ్ణి. అతడు పాపని తీసుకుని బయటికెళ్ళి పోయాడు.
గుండెల మీది బరువేదో తగ్గినట్టు తేలిగ్గా ఫీలయ్యాడు కార్తిక్.
"మీవారెక్కడ?" అడిగాడు.
"లేరు" అంది నవ్వుతూనే.
"అంటే? ఇక్కడ లేరా? ఈ వూర్లో లేరా? అసలు భూమ్మీదే లేరా?" వ్యంగ్యంగా అన్నాడు.
"ఇక్కడే వున్నారు కానీ, ఎవరికీ కనబడరు!" అంది నవ్వుతూనే.
"ఏం ఎందుకని?"
"అతనికి నేనంటేనే ఇష్టం. మరెవ్వరినీ చూడడు. అందుకే నా గుండెల్లోనే నివసిస్తారు" అంటూ నైటీ లోపల గుండెల మీద దాచుకున్న ఫోటో తీసి చూపించింది కార్తిక్ కి. కళ్ళు కనబడడం లేదు. పిచ్చిగా ఫోటోకేసి చూశాడు.
"డియర్ మానసా! ఐ.... లవ్.... యూ! కార్తిక్." ఆ అక్షరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఆ ఫోటో మీద వున్నాయి.
"మానసా!" అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు.
ఆమె కళ్ళు ఆనందంతో వర్షించాయి.
"ఎందుకిలా చేశావ్? నన్నెందుకు దూరం చేశావ్? నీ కోసం తపించి తపించి పిచ్చివాణ్ణయిపోయాను. మా నాన్న చావు బతుకుల మధ్య వున్నప్పుడు ఆయన కోసం పెళ్ళి కొప్పుకున్నాను. నీకోసం ఎన్ని ఫోన్లు చేశాను? ఎన్ని ఉత్తరాలు రాశాను? చివరికి హైదరాబాదొచ్చాను. మీరు అక్కడ లేరని తెలిసింది. చివరికి నువ్వు నన్ను మోసం చేశావని చెప్పి నీమీద ప్రేమనంతా కక్షగా మార్చుకున్నాను - ఎందుకలా చేశావ్? ఏం జరిగింది?" ఆవేశంగా ప్రశ్నల వర్షం కురిపించాడు కార్తిక్.
"పిచ్చి కార్తిక్! నీ ఆవేశం ఇంకా అలాగే వుందా?" అంది అతని చేతిని మెల్లగా నొక్కుతూ.
అతను పిచ్చిగా ఆమె కేసి చూస్తున్నాడు.
"కార్తిక్! ఈ దుప్పటి తీసెయ్యి. ఉక్కగా వుంది" అంది అతని చేతిని విడిపించుకుంటూ.
అతడు దుప్పటి తీసి స్థాణువులా నుంచుండిపోయాడు. కాలం స్తంభించిపోయినట్లు, ప్రకృతి మూగబోయినట్లు! ఆమె రెండు కాళ్ళూ తొడలవరకూ విరగ్గొట్టి వున్నాయి.
"కార్తిక్! హైదరాబాదు రాగానే నాన్నగారితో మన పెళ్ళి విషయం చెబుదామనుకున్నాను. ఆ రోజు నేనే కారు నడుపుకుంటూ, నాన్నగారిని ఆఫీసు నుంచి పికప్ చేసుకోవడానికి బయల్దేరాను. నావెనకే వస్తున్న లారీ ఓవర్ స్పీడులో బ్రేకులు పనిచెయ్యక నా కారుని గుద్దేసింది. అంతే. రక్తపు మడుగులో పడున్న నాకు ఏం జరిగిందో తెలీడానికి పదిహేను రోజులు పట్టింది. ప్రాణాలు దక్కాయి కానీ, పాదాల నుంచి మోకాళ్ళ వరకూ రెండు కాళ్ళూ పోయాయి. మన ప్రేమ కథ నాన్నగారికి చెప్పాను. నీ దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా లేనని చెప్పమన్నాను. నీకు తెలిస్తే, నువ్వు రెక్కలు కట్టుకు వాలతావని తెలుసు. కాని, బంగారంలాంటి నీ భవిష్యత్తుని పాడుచెయ్యడం నాకిష్టం లేదు. నువ్వు సుఖపడాలి! నీ కలలు నిజం కావాలి! నీ అనుభూతుల పొదరింట్లో, పిల్లా పాపల్తో నువ్వు కళకళలాడుతూ వుండాలి! అదే నా కోరిక! అందుకే నా అడ్రసు నీకు చెప్పలేదు. నాన్న రిటైరయిపోయారు. తమ్ముడికి బాంబేలో ఉద్యోగం వచ్చింది. అందరం బాంబే వచ్చేశాము. నిన్ను మళ్ళీ ఈ జన్మలో కలుస్తానని కలలో కూడా అనుకోలేదు. మనం నిర్మించుకున్న ఊహాసౌధంలో, ఆ పొదరింట్లో నీతోనే వున్నాను కార్తిక్! నీ తలపే నా ఊపిరి! నీ వలపే నా తలపు! అదే నా జీవితం!" ఆమె మాట్లాడుతూన్న ఒక్కొక్క అక్షరం అతడికి ఒక్కొక్క బాకులా గుచ్చుకుంది!
ఆమె సంస్కారం ముందు, ఆమె పవిత్రమైన ప్రేమ ముందు, తను చిన్నగా, ఆకాశంలో పున్నమి చంద్రుడి ముందు నుంచున్న కొవ్వొత్తిలా అనిపించింది!
సముద్రమంత ఆమె ఆరాధన ముందు తన పిల్ల కాలువలా అనిపించింది!
ఎంత అపార్ధం చేసుకున్నాడు! ఎంత అసహ్యించుకున్నాడు! తలచుకున్న కొద్దీ ఆమె దేవతలా, తానొక కిరాతకుడిలా అనిపిస్తోంది!
"కార్తిక్! ఏమిటలా అయిపోయావ్? నిన్ను అలా చూడలేను....ప్లీజ్! నా కార్తిక్ భీరుదు కాదు - ధీరుడు. నా కార్తిక్ ఆవేశ పూరితుడు, అనురాగ భరితుడు! ఇలా దీనుడు కాకూడదు. కార్తిక్! ప్రేమించడం, ప్రేమించబడడం గొప్ప అదృష్టం! అదొక వరం. అది మన ఇద్దరికీ లభ్యమయింది. అది ఫలించడమంటావా, అది అందరికీ సాధ్యం కాదు. అయితేమాత్రం అది బ్రహ్మానందం! పూసిన పూలన్నీ పరమేశ్వరుని పాదాలనే తాకుతున్నాయంటావా? అంతమాత్రం చేత అవి పూలు కావా? వాటికి అందం లేదా? ప్రేమ పువ్వు లాంటిది! వాడినా, రాలినా, దాని జ్ఞాపకాలను శాశ్వతంగా నిలుపుకుంటుంది!"
కార్తిక్ కళ్ళు సముద్రాలమయ్యాయి. చెంపలమీది జలపాతం ఆగడం లేదు. ఆమెని కౌగిలించుకుని ముద్దు పెట్టుకోవాలో, చేతులెత్తి ఆమెకి నమస్కరించాలో అర్ధంకాని అయోమయస్థితి!
"కమాన్ .... ఐ. సే ... ఊఁ .... నన్ను లేపి కూర్చోబెట్టు" అంది చెయ్యి నందిస్తూ మానస.
అంతలో అప్పుడే తయారయిన ఆర్టిఫిషల్ లెగ్స్ తీసుకువొచ్చారు డాక్టర్ జోషీ, డాక్టర్ వైద్యా తదితరులు.
కార్తిక్ మెల్లగా ఆమెను లేపి కూర్చోబెట్టాడు.
అప్పుడే బిస్కట్ ప్యాకెట్లుతో లోపలికొస్తున్న బేబీ మానస ప్యాకెట్లను కార్తిక్ కి ఇచ్చింది.
అప్రయత్నంగా అందుకున్నాడు కార్తిక్.
మానస చిన్నగా నవ్వింది.
అదే నవ్వు! బీచ్ లో సముద్రుడి ముందు నవ్విన నవ్వు!
వెన్నెల్లో చంద్రుడు ముందు నవ్విన నవ్వు!
తన బిగి కౌగిట్లో ఉక్కిరిబిక్కిరవుతూ నవ్విన నవ్వు!
ఆ నవ్వే కార్తిక్ గుండెల్లో నిలిచిపోయిన పువ్వు!
ప్రతీ వ్యక్తి జీవితంలో ఆ నవ్వుని కాస్త నాకివ్వమని కోరుకుంటే బ్రతుకు ధన్యం!
('వనిత' మాస పత్రిక - జూన్ 1994)