5. నాణేనికి మరో వైపు
పండక్కి బట్టలు కొనాలని లేఖరాజ్ దుకాణంలో కెళ్ళిన హంస డజను డ్రస్సులకు తక్కువ లేకుండా కొనుగోలు చేసి బిల్లు కడుతూన్న ఆమెకేసి చూసి రెప్పలార్పడం కూడా మరిచిపోయినట్టు అలాగే చూస్తూండి పోయింది.
"అవును. ఆమే! సందేహం లేదు" అనుకుంటూనే మరోసారి తిరిగి చూసింది అడుగు ముందుకు పడక.
అంతలోనే ఆమె కూడా అటే చూడటంలో ఇరువురి చూపులూ కలిశాయి. "హంసగారూ, నమస్కారం" అంది.
ఆ పలకరింపుకి తుళ్ళిపడింది హంస. అహంభావానికీ, అహంకారానికీ మారుపేరుగా ప్రసిద్ధిపొందిన రూపాదేవి, ఆప్యాయంగా పలకరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మెల్లగా తేరుకుని "నమస్కారమండీ! బాగున్నారా?" అంది.
"ఆ.....! పండగ షాపింగ్ కి వొచ్చారా?" అడిగింది.
"అవును. మా బుత్విక్ కీ, అమూల్యకీ బట్టలు కొనాలని వచ్చాను. మీరేమిటి ఇన్ని డ్రెస్సులు కొన్నారు! దేనికీ?" అంది ఖరీదైన బట్టల దొంతరల కేసి చూస్తూ.
"నేనీమధ్యన అనాధాశ్రమం నుంచి ఒక పాపని తీసుకొచ్చి పెంచుకుంటున్నాను. ఈ బట్టలన్నీ దానికోసమే!"
హంసకి మళ్ళీ షాక్ కొట్టింది.
మరమనిషిగా, పాషాణంగా, దయాదాక్షిణ్యాలకీ, ప్రేమాభిమానాలకీ అతీతంగా ఒక బండరాయిలా, స్వార్ధపరురాలిగా పేరుబడ్డ రూపాదేవి ఒక పాపని పెంచుకోవడమా? నమ్మలేకపోతోంది. మనసుని ఆలోచనలు కందిరీగల్లా చుట్టేశాయి. గుడ్లప్పగించి ఆ బట్టల దొంతరలవైపూ, వాటి దగ్గర నుంచుని డ్రెస్సులని చూసుకుంటున్న ఆ పాపవైపూ చూస్తుండిపోయింది. గుండ్రటి మొహమూ పెద్ద కళ్ళు, పొడుగాటి ముక్కు, చిన్న నోరూ, బుగ్గలూ - ఆ పాప ఆకర్షణీయంగానే వుంది. రెండు జడలు వేసుకుంది. కళ్ళకి కాటుక, చిన్న బొట్టూ, అన్నింటినీ మించిన తెల్లని పాలనురుగులాంటి అమాయకత్వం హంసని ఆ పాపకేసి మళ్ళీ మళ్ళీ చూసేలా చేసింది. "ఈ పాపంటే నాకు ఆరో ప్రాణం! దీన్లో నాకు బిడ్డ కనిపిస్తుంది. ఒక తల్లి కనిపిస్తుంది. ఒక మంచి స్నేహితురాలు కనిపిస్తుంది అందుకే దీనికి 'స్నేహ' అని పేరు పెట్టుకున్నాను" అంది బిల్లు కట్టేసి రశీదు నందుకుంటూ రూపాదేవి.
హంస రూపాదేవినీ, ఆ పాపనీ చూస్తూ యాంత్రికంగా 'ఊ' కొడుతూ నుంచుండిపోయింది.
"హంసగారూ! నేను ఎప్పటినుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అనుకోకుండా ఇక్కడ కలిశాం. సారీ.... మీ షాపింగు పూర్తయ్యేదాకా కారు దగ్గర వుంటాను. కానివ్వండి" అంది.
హంసకి మతిపోతోంది. అర్జున్ ఊళ్ళో లేడు. ఆఫీసు పనిమీద టూరెళ్లాడు. పండగ ఇంక రెండు రోజులే వుందని గొడవ చేసేస్తున్నారు పిల్లలు. అందుకే తనొక్కర్తే పిల్లల్ని తీసుకుని బయలుదేరింది. అనుకోకుండా రూపాదేవిని ఈ విధంగా చూసేసరికి మూడంతా మారిపోయింది. ఎలాగో బుత్విక్ కీ, అమూల్యకీ వాళ్ళడిగిన డ్రెస్సులు కొనేసి ఆ ప్యాకెట్లని డ్రైవర్ కిచ్చి కారులో పెట్టమంది.
"రండి హంసగారూ! అక్కడ ఎదురుగ్గా ఐస్ క్రీం పార్లర్ వుంది కదా! అక్కడ కూర్చుందాం" అంది.
హంస యాంత్రికంగా నడుస్తోంది.
"నాకు కసాటా ఐస్ క్రీం కావాలి" అంది స్నేహ.
అమూల్యమ్ బుత్విక్ లు కూడా అదే అడిగారు.
"అందరం అదే తిందాం" అంటూ ఆర్డర్ చేసింది రూపాదేవి.
హంసకి అంతా ఆశ్చర్యంగా వుంది. గలగలా మాట్లాడే ఆమె గొంతు అంతులేని ఆలోచనలు అడ్డుపడి మూగగా వుండిపోయింది. ఆ క్షణంలో ఆమె ఒక శ్రోతగా, ఒక ప్రేక్షకురాలిగా మాత్రమే మిగిలిపోయింది.
అది గ్రహించింది రూపాదేవి. అందుకే తనే మాట్లాడుతూ పోతోంది:
"జీవితం చాలా చిత్రమైనది కదూ హంసగారూ!....పనీ....పనీ....పనీ....పని చెయ్యడం, చేయించడం, హోదా, పదవీ....పోటీ....ఇవ్వే తెలుసుకుని, వీటి కోసమే పాటుపడేదాన్ని. కానీ జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను"
చెప్పడం మాని ఒకసారి హంస మొహంలోకి చూసింది. మళ్ళీ చెప్పడం మొదలెట్టింది:
"హంసగారూ! ఎంతో మాట్లాడే మీరు పెదవి విప్పడం లేదూ అంటే నాలో మార్పు చూసి మీరు ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదనే అనుకుంటున్నాను. రాతితో కట్టిన స్థంభాల్లో సరిగమలు పలికిస్తున్నారే మేధావులైన శిల్పులు! పాషాణ హృదయాన్ని పవిత్రమైన ప్రేమాభిమానాలతో పానకంలా తియ్యగా ఎందుకు మార్చుకోలేమూ? అయితే అలా మార్చగల శిల్పి కావాలి. నా జీవితంలో ఆ శిల్పి మా స్నేహ. ఆ చిన్నారి పాప! మా అమ్మ నాపై చూపే పక్షపాతమే నాకు తెలీకుండా నన్ను రాయిని చేసింది. ఆమె కూడా అది తెలిసి చేసిన తప్పుకాదు. మా అమ్మకి నేనూ, మా అన్నయ్య ఇద్దరమే సంతానం. నాన్న పోలీస్ ఇన్ స్పెక్టర్ గా పనిచేసేవారు. పనీ....పనీ....పనిలోనే మునిగిపోయుండేవారు. అమ్మకి అన్నయ్యంటే పంచప్రాణాలు. ఆడపిల్ల ఎప్పటికయినా 'ఆడ' పిల్లేగానీ, 'ఈడ' వుండే పిల్ల కాదనీ, అత్తారింటికెళ్ళేటప్పుడు వేలకువేలు ఇచ్చి పంపేసి కొడుకుకి మిగిలినదేదో వుంచాలనీ, అసలు వంశోద్ధారకుడూ ముసలితనంలో చేయూతనిచ్చేవాడూ కొడుకేననీ ఆమె అభిప్రాయం. అందుకే ఆమె భవితవ్యంలో ఆదుకునే కొడుకుపైనే ఆశలు పెంచుకుని, కూతురంటే నిరసన చూపేది. ఆ ధోరణి నాలో అన్నయ్యంటే అసూయా, అమ్మంటే ద్వేషం కలిగించింది. అమ్మ నన్ను పదో తరగతి కాగానే చదువు మాన్పించమని కోరింది. నాన్నగారు మాత్రం 'ఆడపిల్ల మనిషి కాదా? దానికీ చదువవసరమే' అని కాలేజీలో చేర్పించారు. నా దురదృష్టం- నేను కాలేజీలో అడుగుపెట్టిన ఆర్నెల్లకే కన్నుమూశారు. కాలేజీ మానమని అమ్మ రోజూ పోరూ, అన్ని అధికారాలు సంతరించుకున్న ఇంటి పెద్దగా అన్నయ్య జోరూ నాలో రోషాన్ని మరీ పెంచాయి. సమాజం అన్నా, బంధుత్వాలన్నా - అసలు మనుషులన్నా ఒళ్ళు మండేది...."
"ఆంటీ....ఇంకో అయిస్ క్రీం తినొచ్చా మేము ముగ్గురం?" రూపాదేవి మాటలకి అడ్డుపడుతూ, అడిగింది స్నేహ.
ఆమె తలనిమురుతూ "తీసుకోండి బేబీ" అని వెయిటర్ ని పిలిచి "వాళ్ళకేం కావాలో ఇవ్వు" అంది.
హంసకేసి చూచి, "బోరుకొడుతున్నానా?" అంది.
"లేదు చెప్పండి" అంది ఇంటరెస్టింగ్ గా హంస.
"అన్నయ్యా, అమ్మా నాకు ఫీజు కట్టేవారు కాదు. పుస్తకాలు కొనేవారు కాదు. నేను ప్రయివేటు ట్యూషన్లు చెప్పి ఫీజు కట్టుకునేదాన్ని. వాళ్ళదగ్గరా వీళ్ళదగ్గరా పుస్తకాలు తెచ్చుకునేదాన్ని. అన్నయ్య కన్నా నాకే ఎక్కువ మార్కులొచ్చేవి. ఒచ్చిన పెళ్ళి సంబంధాలు, కావాలనే దురుసుగా ప్రవర్తించి వాళ్ళు వెళ్ళిపోయేలా చేసేదాన్ని. దాంతో నాకు పొగరుబోతు అనీ, తిరుగుబోతనీ బిరుదులొచ్చాయి. అమ్మకీ నాకూ మధ్య దూరం పెరిగింది. అన్నయ్య ఇంజనీరింగ్ అయిపోయింది. నాకు ఎమ్.ఏ. అయింది. పట్టుదలతో పిహెచ్.డి. మొదలెట్టాను. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే అన్నయ్య ప్రేమలో పడ్డాడు. కోడలొస్తోందని అమ్మ పొంగి పోయింది. కోడలు రావడం, భార్యతో సహా అన్నయ్య అమెరికా వెళ్ళడం, ఒక కలలా జరిగిపోయింది అమ్మకి. ఆ నిరాశలో, నిస్పృహలో ఆ వయస్సులో అమ్మకి నేనే తోడయ్యాను. పెళ్ళీడు దాటిపోవడంతో అన్నీ రెండోపెళ్ళి సంబంధాలే వొచ్చాయి నాకు. నేను తిరస్కరించాను. అమ్మ తిట్లు మళ్ళీ ప్రారంభం! అందరూ నన్నందుకోవాలనీ నా అందాన్ని జుర్రుకోవాలనీ చూసేవారే! అధికారులూ, అనధికారులూ, నాయకులూ, అందరి కళ్ళూ నాపైనే! నవ్వుతూనే అందర్నీ నా వశం చేసుకునేదాన్ని. ఎవ్వరికీ అందకపోవడం వల్ల నామీద నిందలు మోపేవాళ్ళు. దాంతో అమ్మకి నామీద కోపం, నాకు సమాజం మీద కోపం రెచ్చిపోయాయి. పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని" అంది రూపాదేవి హంస కళ్ళల్లోకి చూస్తూ.
హంస కళ్ళలో బాధ!
రూపాదేవి కళ్ళల్లో కన్నీటి పొర!
హంస ఆమెకేసి చూస్తూనే వుంది ఆరాధనతో.
"సుత్తి కొడుతున్నానా?" అడిగింది రూపాదేవి.
"లేదు చెప్పండి. మీరు చెప్పే విషయాలన్నీ నిజంగా ఒక కథలాగా వున్నాయ్" అంది హంస.
"అవును. నా గురించిన విషయాలన్నీ కథలు కథలుగానే చెప్పుకుంటున్నారు కదా!" నవ్వింది రూపాదేవి.
ఆ నవ్వులో ఆనందం లేదు. అవ్యక్తమైన అగుపించని బాధ. హంసకి కడుపులో మెలికలు తిరిగినట్టయింది.
"హంసగారూ! అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. దిక్కులేని ఒక పాలని పెంపకానికి తీసుకున్నాను. నాకు తీరనికోరికలన్నీ ఈ పాప ద్వారా తీర్చుకోవాలనుకున్నాను. అమ్మకాని అమ్మని! అమ్మ ప్రేమని అంతగా పొందలేని నేను పాపకి నా పూర్తి ప్రేమని అందివ్వాలనుకున్నాను. అంతే!" అంది నవ్వుతూ.
"రూపాదేవిగారూ!నాకో చిన్న సందేహం. పాపకి మీరు అమ్మగా నిలవాలనుకున్నారు కానీ, అమ్మా అని ఎందుకు పిలిపించుకోవడంలేదు? పై పెచ్చు మీరు అమ్మకాదనీ, ఆమెని పెంచే వ్యక్తి మాత్రమేనని అ పిల్లకి అర్ధమయ్యేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?" అడిగింది హంస.
"చెబుతా. నేనిప్పుడు అమ్మా అని పిలిపించుకున్నా, రేపది పెరిగి పెద్దయ్యాక నేను అమ్మని కానని బాధపడొచ్చు. ఒక్కసారిగా తెలుసుకున్న ఆ నిజం ఆమె గుండెని కలిచి వెయ్యొచ్చు. అలాకాక ఇప్పుడే నిజం తెలుసుకుని పెరిగితే ఆ బాధ ఆమెకి అప్పుడుండదు. పైగా పిలుపులో ఏముంది హంసా? నాకు కావలసింది అమ్మతనం! ఆ పాపకి కావలసింది అమ్మలాంటి ప్రేమ. ఇవి ఇద్దరికీ దక్కుతూ వుంటే ఎలా పిలిస్తే యేం?" అంది.
ఆ మాటల్లో ఎంతో ఆప్యాయత, వాస్తవం కనిపించాయి హంసకి. 'పాషాణంలా ప్రవర్తించే ఈమె గుండెలో అమృతంలాంటి ఇతర ప్రేమ నిండి వుందా? ఆమె దురుసు ప్రవర్తనకి వెనక వున్న కారణాలు ఇంత కటినమైనవా? నిజంగా ఈ కారణాలు ప్రతి తల్లీ తండ్రీ తెలుసుకోవలసిన అక్షరసత్యాలు' తనలో తనే గొణుక్కుంది హంస.
"ఇక వెళదామా?" అంది రూపాదేవి.
ఒకనాటి ప్రిన్సిపాల్ రూపాదేవి!
ఆ కాలేజీలో పనిచేసే సంగీతం టీచర్ హంస!
నాడు దురుసుగా మాటలు రువ్వి హంసని ఆక్షేపించిన పరమ కోపిష్టి రూపాదేవి!
నేడు పల్లవిలా పాడుతూన్నట్టు మాట్లాడుతూన్న రూపాదేవి రూపాంతరానికి స్పందించిన హంస!
హంస మనసు హంసధ్వని రాగంలా వూగిపోతోంది. ఇరువురూ లేచి బయలుదేరారు.
రూపాదేవి స్నేహ చెయ్యిపట్టుకుని నడిపిస్తోంది!
అది చూస్తూ బుత్విక్ నీ, అమూల్యనీ చెయ్యిపట్టుకోవడం మరచిపోయిన హంస, తప్పుచేసినదానిలా వెంటనే తేరుకుని వాళ్ళ చేతులు పట్టుకుని నడిపిస్తూ బయలుదేరింది.
(సుప్రభాతం పక్షపత్రిక - జూన్ 1994)