Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 39


    శిష్యులైదుగురు దూరమునుండియే బుద్ధుని సందర్శించి "మన మీతని పలుకరింపరాదు; గౌరవింపరాదు. వీనింగని లేవరా"దని నిశ్చయించుకొనిరి. కాని బుద్ధుఁడు సమీపించినంతనే ప్రశాంత సుందర మగు నాయన వదన మండలమును దర్శించిన వారి మనస్సులు మారిపోయెను. బుద్ధదేవుని సమీపమునందుఁగనుంగొని యొకఁడు దయసేయుఁడని పలికెను. మఱియొకఁడు భక్తితోఁ జేతిలోని భిక్షాపాత్రము, దండము నందుకొనియెను. ఇంకొకఁడు పీటవైచి కూర్చుండఁబెట్టెను. వేరొక్కఁడు నిర్మల జలముతోఁ బాదములను గడిగెను. మఱియు నొక్కఁడు పై వస్త్రమునఁ బాదముల తడి యొత్తెను. అనంత శాంతి నిలయము లగు నా మహానుభావుని వాక్యములు విని వారందఱు తమ యపరాధమునకుఁ బశ్చాత్తాప్త హృదయులై వెండియు నాత్రిదండి శేఖరునకుఁ బ్రియశిష్యులైరి. వారియందుఁ గౌండిన్యుఁ డనువాఁడు గౌతమబుద్ధుని ప్రధాన శిష్యులలో మొట్టమొదటివాఁడయ్యెను తొలుదొల్త ధర్మభ్రష్టుఁడని యాపత్సమయమున నాయనను నధిక్షేపించి పరిత్యజించి పోయినవారే చిట్టచివరకు తమ మూఢమార్గమును విడిచి బుద్ధదేవుని శిష్యులై తదీయ బోధామృత రసాస్వాదనమునఁ దమ జీవితములను బవిత్రములు గావించుకొనిరి.
    వీరి తరువాత బౌద్ధమతమును స్వీకరించినవాఁడు వారణాసీపుర నివాసుఁడగు యాసుఁడు. అతడొక వర్తకుని కుమారుఁడు; మహాధనవంతుడు; మహోన్నత సౌధములలో నిరుపమాన సౌందర్యవతులగు కాంతామణుల యాటపాటలతో యాసుఁడు ప్రపంచమునే మఱచిపోయి యుండెను. ఒక దినమున నాతఁడు తన మందిరములో మైమఱచి నిదురించుప్రియురాండ్రను గని, కొప్పులు వీడి కోకలు చెదిరి, నోట లాలాజలము స్రవింపుచున్న వారి వికృతాకారములకు విరక్తి పొంది హేయమైన తన జీవితమును దలఁచుకొని మిక్కిలి దుఃఖించి వైరాగ్య ప్రేరితుఁడై "గౌతముఁడు నిర్వాణమార్గమును గనిపెట్టి పతితులను బావనుల జేయుచున్నాఁ"డని మృగదావనమునకుఁ బోయి బుద్ధుని పాదపద్మములపైఁ బడెను. గౌతముఁడు యాసునకుఁ బరమార్థము నుపదేశించి వానిని దన శిష్యులలో గలుపుకొనెను.
    ఆ కాలమందు మగధదేశమున మువ్వురు మహాపురుషులుండిరి. మొదటివాఁడు కశ్యపుఁడు; ఉపాతికుఁడు రెండవ వాఁడు; మూడవవాఁడు సరిపుత్రుఁడు ఈ మువ్వురు గొప్ప యోధులు; మహా పండితులు వీరిలో నొక్కొక్కనికి వందల కొలఁది శిష్యులు గలరు. గౌతమబుద్ధుఁడు వీరివద్దకుపోయి తన నూతన బౌద్ధమత సిద్ధాంతములను వారికి బోధించి వారందరను తన శిష్యులుగాఁ జేసికొనెను. బుద్ధుని నామధేయము మగధదేశమందంతటను మాఱుమ్రోగఁ జొచ్చెను. మగధ దేశాధీశ్వరుఁడైన బింబిసారుఁడు వేనవేలు బ్రాహ్మణులతోఁ గలిసి గౌతముని సందర్శించి వినయ పూర్వకముగా నమస్కరించి భక్తి తత్పరుఁడై ప్రార్థించెను. శిష్యగణ సమేతముగా బుద్ధుని తన మందిరమున కాహ్వానించెను. బౌద్ధ బిక్షువుల కందఱకు శ్రద్ధాభక్తులతో భోజన సత్కారములఁగావించి గౌతమునితో "స్వామీ! తాము సశిష్యముగ నివసించుటకు నా 'వేలువనము'ను సమర్పించుచున్నాఁడ" నని, తన యుద్యాన వనమును బుద్ధభగవానున కర్పించెను.
    గౌతముఁడు రాజగృహ సమీపమున "వేలువనము" నందు వేలకొలఁది శిష్యబృందముతో నివసించుచున్నాడని విని జనకుఁడైన శుద్ధోదనుఁడు కపిలవస్తు పురమున కాయనను రమ్మని వర్తమాన మంపెను. పెద్ద కాలమగుటచే వృద్ధుడఁగు తండ్రినిఁ జూచుటకు గౌతముఁడు ప్రయాణమయ్యెను.
    వేలకొలఁది శిష్యులతో రాజగృహ నగరము నుండి కపిలవస్తు పట్టణమునకు విచ్చేయుచున్న బుద్ధుని నివాసము నిమిత్తము శుద్ధోదన భూపాలుఁడు పుర సమీపమందున్న న్యగ్రోధవనమును పరిశుభ్రము చేయించెను. గౌతముఁడు కపిలవస్తు నగరో పాంతమునకు వచ్చియుండెనని తెలిసి యెదుర్కొని సత్కరించుటకై పండ్రెండు సంవత్సరముల వయస్సు గల ఐదువందలమంది రాకుమారులను రాజపుత్రికలను జక్కగ నలంకరించి బారులు బారులుగా నిలువఁబెట్టెను. వారి వెనుక బదియారువేలమంది పరిజనములతోడను, బంధుజనులతోడను, దాను వేచియుండెను. గౌతముఁడు అరువదివేల మంది శిష్య బృందముతో శుద్ధోదనుని యాతిథ్యము నందుకొనెను. కాని మరుదినముననే భిక్షాపాత్రము హస్తమున ధరించి నగరములోఁ జరించుచున్న గౌతమునింగాంచి శుద్ధోదనుని హృదయము క్షోభించెను. రాజదండము చేత ధరించి రత్నఖిచిత కిరీట ధారియై సింహాసనముపైఁ గూర్చుండి సామ్రాజ్య భారము వహింపవలసిన కన్నకొడుకు హస్తమున భిక్షాపాత్ర ధరించి కాషాయాంబరధారియై కాలినడకతోఁ గడప గడపకుం జని భిక్షమెత్తుకొనుట తండ్రి చూడఁజాలకపోయెను.
    శుద్ధోదనుఁడు తన కుమారుని సమీపించి "నాయనా! ఏల నీవు నన్నిట్లవమానించెదవు? నీవు లక్షలకొలది శిష్యులతో వచ్చినను సంవత్సరముల కొలది షడ్రసోపేత మగుమృష్టాన్న భోజనము పెట్టఁజాలుదునుగదా! నా కనుల ముందటనే నీ విట్టిపని చేయుట నే నెట్టు సహింతును?" అని పలికెను. అది విని గౌతముఁడు "అయ్యా! ఇది నావంశాచారము. ఇందుకుఁ దప్పేమియులే" దని ప్రత్యుత్తర మిచ్చెను "ఏమేమీ! వంశాచారమా? మన వంశములో నెవ్వరిట్లా చరించిరి?"యని శుద్ధోదనుఁడు పలుకగా గౌతముఁడు "అయ్యోనేను మీ వంశమును గూర్చి చెప్పుటలేదు. నా వంశమనగా బుద్ధల వంశమని నా తాత్పర్యము. బుద్ధు లందఱు నావలెనే బిచ్చమెత్తి జీవించిరి" అని పలికెను. బుద్ధుని మాటలకు శుద్ధోదనుఁడు మిక్కిలి నొచ్చుకొని యిట్లనెను. "తండ్రీ! మమ్మెల్లర విడిచి యర్ధరాత్రమున నరణ్యమార్గములు బట్టి పోయితివి? కానలలో నెన్ని కష్టములు పాలయితివో! యెన్ని యుపవాసములు సల్పితివో? రాజకుమారుఁడ వగు నీకీ వైరాగ్యబుద్ధి యెక్కడ సంప్రాప్తమయ్యెనో! మన పట్టణములోని ప్రజలందఱును జంద్రుని రాక కెదురు చూచు చకోర బృందముల చందమున భవదీయాగమనమున కువ్విళ్లూరు చున్నారు. నీ యర్ధాంగలక్ష్మి యశోధర నీ వియోగమును సహింపజాలక చిక్కి శల్యమైపోయినది. నీ గారాలు తల్లి ప్రజావతి గౌతమి కన్నులలో బ్రాణములు పెట్టుకొని యున్నది. చిట్టి తండ్రి రాహులుఁడు నాన్న ఎప్పుడు వచ్చు నెప్పుడు వచ్చునని కలవరించు చున్నాడు. నీ వైరాగ్యమును మే మెట్లు చూడఁగలము?" అని యనేక ప్రకారముల వాపోవుచున్న తండ్రికి గౌతమబుద్ధుఁడు ధైర్యము గఱపి పరమ పవిత్రములగు బౌద్ధమత ధర్మములను బోధించెను. శుద్ధోదనుఁడు పరిశుద్ధాంత రంగుఁడై యా నూతన ధర్మమును స్వీకరించెను.
    బుద్ధుఁడచ్చటనుండి మెల్లమెల్లఁగా నంతఃపురమును బ్రవేశించెను. యశోధరాదేవి పొంగివచ్చు దుఃఖతరంగముల నాపుకొనఁజాలక "హా ప్రభూ! వచ్చితివా" యని వాయుకంపిత లతాలలామమువలె నాయన పవిత్ర పాదపద్మములపై వ్రాలెను. రాహులుఁడు పరిగెత్తుకొనివచ్చి కన్నతండ్రి యగు గౌతముని గౌగలించుకొనెను. ప్రజావతి గౌతమి, చెన్నుడు మొదలగు వారందఱు చుట్టును మూగి దీనాలాపనములు పలుక సాగిరి. బుద్ధభగవానుఁడు వారల నందఱ యథోచిత వచనముల నూరార్చి వారికి పవిత్రములగు బౌద్ధమత సిద్ధాంతములనుపదేశించి క్రమక్రమముగా నందఱను బౌద్ధమతము స్వీకరింపఁజేసెను.

 Previous Page Next Page