Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 40


    తరువాత బుద్ధుఁడు తన మతమును సర్వత్ర వ్యాపింపఁజేయుటకై దేశము నాలుగు మూలల సంచరింప సాగెను. రాజులు, ప్రజలు, భాగ్యవంతులు, దరిద్రులు, పెద్దలు, పిన్నలు నెందఱెందఱో బుద్ధునకు శిష్యులగుచుండిరి. బుద్ధుని వాదశక్తియు, సత్యానురక్తియు, ధర్మాసక్తియు, నెల్లెడలంబ్రకీర్తి తములయ్యెను. దూరమనక భారమనక పట్టణములనుండి, పల్లెలనుండి జనులు తండోప తండములుగా వచ్చి యామహాత్ముని దర్శించి, యా మహనీయుని మూర్తికి నమస్కరించి, యా కరుణామయుని పాదపరాగము శిరసావహించి, యాప్రేమనిధి సుధామధుర బోధనల నాలకించి తరించుచుండిరి.
    బుద్ధుని మహాత్మ్యము దేశమంతయు వ్యాపించినది. ఎచ్చట చూచినను "బుద్ధం శరణం గచ్ఛామి" "ధర్మం శరణం గచ్ఛామి" "సంఘం శరణం గచ్ఛామి" యను నినాదములే వినవచ్చుచుండెను.
    ఆ రోజులలో గోసలదేశమును ప్రసేనజిత్తను రాజు పరిపాలించు చుండెను. అంగుళీమాలుఁడను నొక దొంగ యా రాజ్యమునందలి ప్రజల నందఱఁ బలువిధముల బాధించు చుండెను. వాని పేరు విన్న జనులు భయోత్కంపమానసులగుచుండిరి. ఆ చోరుని యత్యాచారములచే నా రాజు రాజ్యమునందు శాంతి సంతోషములు నామమాత్రాన శిష్టములయ్యెను. నగరములు విద్వంసము గావింపఁబడెను. పల్లెలు కొల్లగొట్టఁబడెను. కోసల దేశమునందలి జనులా బాలగోపాలము నాదుష్టుని దురంతములకు నాగలేక హాహాకారములు గావించుచుండిరి.
    ఆ సమయమున బుద్ధ భగవానుఁడు శ్రావస్తిలోని "జేత వనము"నందు నివసించుచుండెను. చోరాగ్రేసరుఁడగు నంగుళీమాలుని క్రూరకృత్యములు విని గౌతముఁడు వాని నెట్లయిన సన్మార్గమునకుఁ గొనివచ్చి తన శిష్యసంఘములోఁ జేర్చుకొనవలయునని సంకల్పించెను. భిక్షాపాత్రమును హస్తమున ధరించి యాశ్రమమును వెలువడి యంగుళీమాలుఁడు నివసించు భయంకరా రణ్యమునకుఁ బయనమైపోయెను. మార్గమధ్యము నందు నెదురైన వారందఱు బుద్ధుని యుద్దేశామును దెలిసికొని "మహాత్మా! వాఁడు మిక్కిలి భయంకరుఁడు కఠినహృదయుఁడు ఆ ఘాతుకుని గుండెలలో దయా ధర్మములకుఁ దావులేదు. మీరేల యచ్చటికి బోయెదరు? వాఁడు మిమ్ముల హింసింపగలఁడు స్వామీ! మీరీ మార్గమునఁ బోవల"దని యనేక విధముల హెచ్చరించిరి.
    కాని సిద్ధసంకల్పుఁ డగు బుద్ధ భగవానుఁడు వీరి మాటలు లెక్కించునా? ఆయన త్వరత్వరగా నా చోరుని నివాసస్థానము వైపుకు నిర్భయముగా నడిచిపోవు చుండెను.
    అది యొక దట్టమైన నట్టడవి. క్రూర మృగారావములు కర్ణకఠోరముగ వినిపించుచుండెను. నిర్మానుష్య మగునా భయంకరారణ్యమే యంగుళీమాలుని నివాసస్థానము. తన వైపునకు వచ్చుచున్న గౌతముని దూరముననే గనుంగొని యంగళీమాలుఁడాశ్చర్యము నందెను. వెంటనే ప్రళయకాల హుతాశనునివలె మండిపడుచు బుద్ధుని వద్దకుఁ బరువెత్తుకొని వచ్చి "సన్యాసీ! ఆగు మాగుము! కురంగము సింహము గుహ జొచ్చినట్లు నీవు నా నివాసస్థానమును జొచ్చితివి. నీ ధైర్యము కొనియాడదగినది. రమ్మురమ్ము! ఇంకెందు బోయెదవు" అని యాయనను సంహరింప విల్లెక్కు పెట్టెను. బాణమును వింట సంధించెనేకాని ప్రయోగించుటకు సమర్థుఁడు కాలేదు. బుద్ధభగవానుఁడు నిర్ణిమేషలో చనములతో నా చోరాగ్రేసరుని దర్శించి మందహాసము చేసెను. అంగుళీమాలుడట్లే చూచుచుండెను గౌతమబుద్ధుఁడట్లే నవ్వుచుండెను! మహానుభావుడగు బుద్ధదేవుని మహత్వ మెట్టిదో గాని భయమనుమాట యెఱుగని యాదొంగ యంతరంగము వ్యాకులమయ్యెను. వాని చేతిలోని విల్లు వానికిఁ దెలియకుండగనే జారి పడిపోయెను. వాఁడు గడగడ వడఁకుచు గౌతముని పాదములపైఁబడి "ప్రభూ! మీరెంతటి మహాత్ములో? మిమ్ముఁ లకించిన కొలఁది నెన్నడును నెఱుఁగని క్రొత్త క్రొత్త భావము లేనియో చిత్తమున మొలక లెత్తుచున్నవి. మీ చిరునవ్వులో, మీ చూపులో, మీయాకారములో మనస్సులను మార్చివేయగల మహాశక్తి యేదియో యున్నది. స్వామీ! నే నెందఱినో వధించితిని. వారి చేతివ్రేళ్ళన్నియు దండలుగాఁ గట్టుకొని కంఠమున ధరించితిని కనుకనే నా కంగుళీమాలుఁడను పేరు వచ్చినది. భగవానుఁడా! నా యపరాధములు క్షమింపుము! నన్నుద్ధరింపుము! నేను నీ శరణు జొచ్చుచున్నాను" అని ప్రార్థించెను. గౌతమబుద్ధుఁడు తన శీతల హస్తములతో వాని శిరస్సు స్పృశించి, మేను దువ్వి వానికి బౌద్ధధర్మమూ నుపదేశించి తన శిష్యుని గావించుకొనెను.
    బుద్ధదేవుఁడట్లు క్రొత్త శిష్యుని వెంటఁ బెట్టుకొని శ్రావస్తికి మరలి వచ్చుచుండగా మార్గమధ్యమున ప్రసేనజిత్తు పదివందల యాశ్వికులను వెంట బెట్టుకొని యెదురయ్యెను. రాజును చూచి గౌతముడు "మహారాజా! యెచ్చటికి ఈ ప్రయాణము? ఏ రాజుపై దండెత్తబోవుచుంటిరి?" అని ప్రశ్నించెను. ప్రసేనజిత్తు గౌతమునకు నమస్కరించి "అంగుళీమాలుఁడను చోరుని యత్యాచారములచే నా రాజ్యము నందలి ప్రజలు బాధితులై నన్ను శరణుజొచ్చిరి. ఆ దుర్మార్గుని దునుమాడఁ బోవుచుంటి" నని పలికెను. రాజు పలుకులు విని గౌతముఁడు చిరునవ్వు నవ్వి "కోసలేశ్వరా! అంగుళీ మాలుఁడు బౌద్ధభిక్షువై సమీపమునకు వచ్చి నిలచినచో నేమిచేసెద" వని ప్రశ్నించెను. ఆ మాటలకు బ్రసేనజిత్తు విస్మయ మంది "అట్లయినచో వానిని బూజించెదను; ప్రేమతో నస్మద్భవనంబున కాహ్వానించి సత్కరించెదను; స్వామీ! ఏల యిట్లు పలికెదరు? ఆ రాక్షసున కంత మంచిబుద్ధి పుట్టునా? ఇది ముమ్మాటికి నసంభవ"మనెను. గౌతముఁడు నవ్వి "రాజా! ప్రపంచములో నసంభవమైన దెద్దియును లేదు. నీవు సంహరింపబోవుచున్న యంగుళీమాలుడితడే చూడు" మని తన వెంటనున్న క్రొత్త శిష్యునిఁ జూపించెను. ప్రసేనజిత్తు జరిగిన సమాచార మంతయు దెలిసికొని గౌతముని మహిమల కచ్చెరువంది గురుశిష్యులకు భక్తిపూర్వకముగా ప్రదక్షిణము గావించి తన నగరమునకు మరలిపోయెను.

 Previous Page Next Page