Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 35


    శుద్ధోదన మేదినీ విభుఁడొకనాడు ప్రాజ్ఞులైన జ్యోతిశ్శాస్త్రజ్ఞుల రావించి, బహు మూల్య వస్త్రాభరణాదుల బహూకరించి, బాలుని జన్మ పత్రికను జూపించి, జాతక ఫలమును దెలుపుఁడని కోరెను. ఆ పండిత వరేణ్యులు సిద్ధార్థుని జాతకమును గుణించి గ్రహములను గణించి విస్మయ విస్ఫారిత నేత్రములతో "మహారాజా! ఈ బాలుండనన్య సామాన్య తేజోవిరాజితుఁడు. అసాధారణ మహిమా సంపన్నుఁడు. అయ్యారే! వీని జీతకంబింత యొప్పునే! వినుము. నీ కుమారుఁడు సర్వలక్షణసంపన్నుఁడగు సార్వభౌముఁడైన కాగలఁడు. లేదా సర్వసంగ పరిత్యాగియై మహాయోగియైన నగును. ఎట్లయినను విశ్వవిఖ్యాతుఁడై శాశ్వతకీర్తిని సముపార్జింపగలఁడనియు, నసాధారణ మహిమాసమేతమగు నీతని చరిత్ర మత్యంత పవిత్రమగు" ననియుఁ బరిబరి భంగుల బాలుని ప్రభావమును ప్రశంసించి పలికిరి.
    బాల్యము గడచిపోయినది; యౌవన మారంభమైనది. సిద్ధార్థుఁడు సమవయస్కులగు రాజకుమారులతోఁ గలసి ధనుర్బాణములను ధరించి యశ్వము నారోహించి యరణ్యముల కరుగు చుండెను. మృగయా వినోదార్థమై కాననముల కరుగునేగాని మృగములను మాత్రము సంహరింపఁజాలక పోవుచుండెను. గుఱిపెట్టి కొట్టుట చేతగాక కాదు; బాణముల నెక్కు పెట్టలేకయు గాదు; అతఁడు దయార్ద్రహృదయుఁడగుటయే యిందులకు గారణము. ఒక్కొక్క మాటు బాణమును వింట సంధించి విడువఁబోవును కాని యంతలో "పాపము! నోరులేని యీ జంతువు నా కే మపకారము చేసినది? నే నేల దీనిని సంహరింప వలయును? నా బాణము గుండెలో గ్రుచ్చుకొని నేలపైఁబడి గిలగిల తన్నుకొని చచ్చునప్పుడది యెంత బాధననుభవించునో! దాని బిడ్డలు దాని కొఱకెంత విలపింతురో"యని పెక్కు విధముల విచారించి విల్లు విసరివైచి బాణములు పాఱవైచి తురంగమును మరలించుకొని గృహమున కరుదెంచును.
    ఒకనాఁడు రాజకుమారుఁడు తన మిత్రులతోఁ గూడ యరణ్యమునకు బోవుచుండెను. ఎవరి గుఱ్ఱము ముందు పోవునో చూతమని యందఱును బందెములు వైచుకొనిరి. కొంత దూరము పోవునప్పటికి మన రాజకుమారుని హయమలసి పోయెను. నోట నురుఁగులు గ్రక్కుచు నతికష్టముగాఁ బరుగిడుచున్న తన తురగమును జూచి సిద్ధార్థుని హృదయము కరగిపోయెను. తక్షణమే యాతఁడు తన గుఱ్ఱము నాపివేసెను. కళ్లెమును తీసి జీను సడల్చి మెడమీఁద జూలుదువ్వుచు దాని మేనఁ బ్రవహించు స్వేద ధారలను నుత్తరీయాంచలముచే నొత్తుచుండెను. ఇది యంతయుఁ జూచి "రాకుమారుఁడింత బేలయే!" యని స్నేహితులందఱు నవ్వుకొనిరి.
    సిద్ధార్థుఁడు వారితో "మిత్రులారా! ఏల నవ్వెదరు? ప్రపంచమున జన్మించిన ప్రాణులన్నియు సమానమే. మన ప్రాణము మనకువలెనే వాని ప్రాణము వానికిని నెంతేని బ్రీతికరము. మనము గొప్పవారము గదా యని నోరులేని జీవములపై బలవంతముగ స్వారీచేసి వానిని శ్రమ పెట్టుట న్యాయముగాదు. నేనోడి పోయినను నాకుఁ జింతలేదు కాని, నాయశ్వ మిట్లాయాస పడుట నేనెంతమాత్రము సహింపజాల" నని పలికెను.
    మఱియొక దినమున గౌతముఁడు తన మిత్రుఁడైన దేవదత్తునితోఁ గలిసి హిమాలయ పర్వత ప్రాంతముల సంచరించుచు నందలి సుందర దృశ్యములను వీక్షించుచుండెను. అట్టితఱి నిర్మలమైన నీలాకాశమునఁ గొన్ని హంసలు బారులు దీర్చి పోవుచుండెను. రాజకుమారుఁడు హృదయంగమైన యా రాయంచల సౌందర్యమును గన్నార్పక గనుంగొనుచుండెను. ఇంతలో వెంటనున్న దేవదత్తుఁడు వింట నొక్క శరము సంధించి యాకసమున నరుగుచున్న హంసవైపు గుఱిచూచి వదలెను. ఆ బాణము తగిలి యొక బాలమరాళము గిరగిర దిరుగుచు గౌతముని కాళ్ళముందు బడెను.
    దయామయ హృదయుఁడు గౌతముఁడు కడుంగడు గనికరమ్మున నా కలహంసను దన యొడిలోనికిఁ దీసికొని చల్లని చేతితో మెల్ల మెల్లగ దాని ఱెక్కలు దువ్వి, యొక ప్రక్కలోతుగా గ్రుచ్చుకొనియున్న బాణము నల్లనల్లన వెడలించి, రక్తమును దుడిచి బాధ బాయునట్లు గాయమున కేదియో యాకు పసరును బూసి బుజ్జగించుచుండెను.
    ఇంతలో దేవదత్తుఁడు గౌతము నొద్దకుఁ బరుగెత్తుకొని వచ్చి "రాజకుమారా! యీ పక్షి నాది. దీనిని బాణముచేఁ బడగొట్టినది నేను; కాన నా హంసను నాకి"మ్మని పలికెను. అందులకు గౌతముఁడు "మిత్రుడా! ఈ మరాళముపై నీకేమియు నధికారములేదు. నిర్దయుఁడవై నీవు నిష్కారణముగా నిరపరాధమగు నీ శకుంతమును జంపబూనితివి. నేను రక్షింప గలిగితిని కావున నిది నాది" యని పలికెను.
    ఇటులా యిర్వురు గలహించుకొనుచు నా మార్గమునఁ బోవుచున్న యొక యోగిపుంగవున కావృత్తాంతమంతయు నెఱింగించి తీర్పు చెప్పుమని కోరిరి. ఆ సాధువరేణ్యుఁడు "నాయనలారా! ఈ హంస శరాఘాతముచే మరణించి యున్నచో దేవదత్తునిదే. కాని గౌతముఁడు దీనిని రక్షించినాడు. కనుక ప్రాణహంత యగు వానికీ మరాళముపై నధికారములేదు. ప్రాణరక్షకునిదే యీ పక్షి" యని గౌతముని పక్షముననే తీర్పు చెప్పెను. సిద్ధార్థునిది జాలిగుండె. బాల్యము నుండియు నతఁడొరుల కష్టమును జూచి సహింపలేఁడు పచ్చని పచ్చిక బయళ్ళపైఁ బరుగులిడు లేళ్ళను, గుందేళ్ళను, గాంచినప్పుడా కరుణామయుని హృదయము కరగి పోవుచుండెను. పర్వత శృంగములనుండి చెంగు చెంగున దుముకు సెలయేళ్ళను జూచి యిట్టి స్వేచ్చ నాకెప్పుడు లభించునా యనియు, నీ బంధము లెప్పుడు తొలగునాయనియు నాలోచించు చుండును. ఏదేని సాధు జంతువు క్రూర జంతువుచే హింసింప బడుచున్నప్పుడు ప్రపంచమంతయు హింసామయముగ నాతని హృదయమునకుఁ దోఁచుచుండెను. పొలములయందు బలు తెరంగులఁగష్టించు కర్షకమండలి గాంచి గౌతముఁడు కరుణతోఁ గన్నీరు నించుచుండును.
    ఆర్ద్రలోచనములతో నా రాజ నందనుఁ డెల్ల వేళల నీ విధముగ నాలోచించునే యుండును. "గూటిలో పక్షిని వేటకాఁడు కొట్టుచున్నాఁడు. నీటిలోని మత్స్యములను జాలరి పట్టుచున్నాఁడు. గోడమీఁది కీటకములను బల్లి కబళించుచున్నది. గట్టుమీది కప్పను భుజంగము మ్రింగుచున్నది. చిన్న జంతువు పెద్ద జంతువున కాహార మగుచున్నది. బలవంతుండగు మానవుఁడు దుర్బలుఁడగు తన తోడి మానవుని దోఁచుకొనుచున్నాడు. ఇదియేనా సృష్టి రహస్యము?"

 Previous Page Next Page