Previous Page
Next Page
కరుణశ్రీ సాహిత్యం - 4 బాలసాహితి - 2 పేజి 34
గౌతమ బుద్ధుఁడు
1
అఖండ మహిమాన్విత మగు భరత ఖండమునకు మకుటాయమానమై హిమవత్పర్వతము విరాజిల్లుచుండెను. అమ్మంచుమల కించుక దక్షిణముగ రోహిణీ నదీ తీరమునందుఁ బండుముత్తైదువయగు భారతమాత ఫాల భాగమునందలి కుంకుమ బొట్టువలె కపిలవస్తు పురము వెలయుచుండెను.
అఖిల సంపద కాలవాలమై, నిఖిల సౌఖ్యములకు నిలయమైన యా పట్టణమును రాజధానిగాఁ జేసికొని శుద్ధోదన నృపాలుఁడు శాక్య రాజ్యమును పరిపాలించు చుండెను. శూర శిఖామణియు, ధర్మమూర్తియు, ప్రజావత్సలుఁడును, సమస్త సద్గుణ నిధియునగు నారాజేంద్రున కిరువురు భార్యలు గలరు. పెద్ద భార్య మాయాదేవి, చిన్నభార్య ప్రజావతి గౌతమి. ఆ సతీమణులిరువురు పరస్పరానురాగములఁ గలిసి మెలసి యప్పుడమిఱేనిఁ గడుంగడు భక్తిమెయి సేవించుచుండిరి.
పెద్దకాలము గడచినను సంతానము గలుగ లేమింజేసి పట్టమహిషియగు మాయాదేవి స్వాంతము చింతాక్రాంత మయ్యెను. ఎన్నియో వ్రతములు సలిపెను. మఱియు నెన్నియో నోములు నోచెను. ఎంత ఱెందఱకో దేవతలకు మ్రొక్కుకొనెను. బీదసాదలకు దాన ధర్మములు గావించెను. ఉపవాసములుండెను. ఇటులుండ నొక్కనాటి రాత్రి దేవతలు వచ్చి తన్ను స్వర్గమునకుఁ గొనిపోయినట్లును, దేజోవిరాజిత మగు నొక దివ్యజ్యోతి వెలుగులుజిమ్ము కొనుచుఁదన గర్భమునఁ బ్రవేశించినట్లును, మాయాదేవి యొక వింతకల గాంచెను. లోకోద్ధారకుఁడగు నందనుఁడు జన్మించునని శాస్త్రవేత్తలు స్వప్న ఫలమును దెలిపిరి.
తర్వాతఁ గొన్ని దినములకు భగవంతుని యనుకంపపెంపున మహారాణి గర్భవతియయ్యెను. క్రమ క్రమముగా నవమాసములు నిండినవి. ఆమె వాంఛితమును గానఁజాలక శుద్ధోదనుఁడు మాయాదేవిని బుట్టినింటికిఁ బంపించుటకై ప్రయాణసన్నాహమును గావించెను. పూర్ణగర్భవతియగు తన దేవేరి కేమాత్రమును మార్గాయాసము గలుగకుండుటకై నిమ్నోన్నతమగు పథమును జక్కపఱపించెను, బాట కిరువైపుల నరటికంబములు నాటించెను. నయనానందకరముగఁ బచ్చని తోరణములు గట్టించెను. అక్కడక్కడ నిర్మల జలపూర్ణములగు మంగళ కలషములు బెట్టించెను. ఒత్తుకొనకుండ మెత్తని పట్టుపరుపు లమర్పబడిన కుదుపులేని రథములో గూర్చుండి మాయాదేవి తన సోదరియగు గౌతమితోఁగూడి వేలకొలది పరిచారికా జనము వెన్నంటి వచ్చుచుండ మహావైభావముతో నాత్మపితృగృహమగు "దేవదహము"న కరుగు చుండెను. కపిలవస్తు దేవదహ నగరములకు మధ్య లుంబినీవన మున్నది. రథ మా వనమును బ్రవేశించి పోవుచుండెను.
ప్రపంచమున కంతటికి దివ్యసందేశము నందింపఁబోవు తేజోమూర్తినిఁదన గర్భమున ధరించి వచ్చుచున్న యా మహాసాధ్వి కా వనము స్వాగతమిచ్చుచున్నదో యన్నట్లు పక్షులు కలకల ధ్వనులు సేయసాగెను. వృక్షములు దమతమ చిగురు కొమ్మలను గదల్చుచు మహారాజ్ఞికి వింజామరలు వీచుచున్నట్లుండెను. వసంత ఋతువు, వైశాఖమాసము నగుటచే వన మంతయు నవ్యశోభలతో నయనపర్వముగా నుండెను. అక్కసెల్లెండ్లిర్వురు నరదముపై గూర్చుండి యా వనలక్ష్మి యందమును సందర్శించుచుండిరి. "అక్కా! అదిగో గుమ్మటము వలెనున్న యా క్రొమ్మావిగున్నను జూడుము! నిండుచూలాలి వగు నిన్నుఁబోలియున్న"దని గౌతమి నవ్వుచు బ్రలికెను మాయాదేవి కొంచెముసేపా చల్లని మామిడిచెట్టు నీడలో విశ్రమింపఁగోరెను. రథము రసాలవృక్షము క్రిందనాగినది.
మాయాదేవి మెల్లగా లేచి చెల్లెలి భుజముపై జేయివైచి మఱియొక చేతితో నొక మామిడికొమ్మ నందుకొనెను. ఆ చిగురు కొమ్మను విఱవఁబోయినది గాని నవనవలాడుచున్న దానినిఁ జెట్టునుండి వేఱు సేయుటకుఁ జేయి రాలేదు. ఆమె దానిని ముద్దిడుకొని మఱల మీఁదికి వదలివైచెను "ఎంత మెత్తని హృదయమమ్మా నీది? ఇంక నీ కడుపులోని గారాబు తండ్రి హృదయమెంత సుతిమెత్తనిదో!" యని గౌతమియెత్తిపొడిచెను. సోదరి పరిహాసమునకు మందహాసము చేయుచు మహారాజ్ఞి స్యందనముపై నాసీనురాలయ్యెను. ఇంతలో నామెకు ప్రసవవేదన ప్రారంభమయ్యెను. వెంటనున్న సఖీజనము వెనువెంటనే ఏర్పాట్లు గావించిరి. ఆ లుంబినీ వనమధ్యమున నా బాల రసాలము నీడలో మాయాదేవి యొక చక్కని పుత్రరత్నమును గనెను.
ఆ శుభ సమయమున దిక్కులు బ్రశాంతము లయ్యెను. చల్లని మలయమారుతము వీచెను. మయూరములు నయనా నందకరముగా నాటలాడెను. కోయిలలు శ్రవణానందకరముగఁ బాటలు పాడెను. హరిణ శాబకములు సంతోషముతోఁ జెంగు చెంగున గంతులు వేసెను. తరు శాఖలు కుసుమ వర్షము గురిసెను. రాజ పరివార మంతయు మహానందముతో మాతా శిశువులను దోడ్కొని మఱల కపిలవస్తు నగరమున కరిగినది.
శుద్ధోదనుఁడు రాజ్యమునందంతటను బుత్రోత్సవమును జరిపించెను. బ్రాహ్మణులకు దానము లిచ్చెను. దరిద్రులకు ధర్మము లొనరించెను. బాలురకు ఫలహారములు బంచిపెట్టెను. ఆనాఁడు శాక్యనగర మంతయుఁ గ్రొత్తశోభతోఁ గ్రొత్త సంతోషముతోఁ గ్రొత్తకుతూహలముతోఁ గ్రొత్తయుత్సాహముతోఁ గన్నులపండువుగా కళకళలాడుచుండెను.
కాని యా సంతోష మెంతో కాలము నిలువలేదు. బిడ్డఁ డుదయించిన యేడవ దినముననే మాయాదేవి మరణించెను. తల్లిదండ్రుల తఫఃఫలముగఁ బెక్కుదినములకు సిద్ధించిన సంతాన మగుటచే శిశువునకు "సిద్ధార్థు"డని నామకరణము సలిపిరి. గౌతమ గోత్రమున జన్మించిన కతమున గౌతముఁడనియుఁ బిలుచుచుండిరి. తల్లికఱవైన కుమారునకుఁ బిన్నతల్లియగు గౌతమియే కన్నతల్లియై కడుంగడు గారాబమునఁ బెంచుచుండెను.
2
బాల గౌతముఁడు శుక్లపక్ష శశాంకుని మాడ్కి దిన దినాభ్యుదయము నందుచుండెను. తన తనయుఁడు సైతము తనయంతవాఁడుగావలయునన్న కోర్కెతో శుద్ధోదన భూపాలుఁడు గౌతమున కెవ్విధమైన లోటు వాటిల్లకుండ శ్రద్ధ వహించి చూచుచుండెను. సమర్థులును సర్వ శాస్త్రపారంగతులునగు పండితులచే విద్యలు నేర్పించుచుండెను. పూర్వపుణ్య విశేషమునఁగాబోలు నా రాజనందనునకు సమస్త కళలును గురువులు సెప్పినదే తడవుగాఁ గరతలామలకము లగుచుండెను. వేదములు పఠించెను; దర్శనములు సమీక్షించెను; స్మృతుల గతు లెఱింగెను; ఉపనిషత్తుల భావము నాకళించుకొనెను; వివిధములైన ధనుర్విద్యా రహస్యములెల్ల దెలిసికొనెను; అశ్వారోహణము, రథారోహణము, నౌకాచాలనము మొదలగు సకల కళలను సమగ్రముగ నభ్యసించెను. ఇట్లు విద్యలయం దారితేరిన రాకుమారుఁడు సానబట్టిన వజ్రము వలె మఱింత బ్రకాశించెను.
Previous Page
Next Page