వైభవ గోదావరి – 10

తూర్పు గోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా గురించి నిన్న చెప్పుకున్నాంకదా. ఇవాళ తూర్పు గోదావరి జిల్లా గురించి..... తూర్పుగోదావరి జిల్లాలో.. రాజమండ్రి ఈ పట్టణాన్ని తూర్పు చాళుక్య వంశ రాజైన అమ్మరాజు విష్ణువర్థనుడు అనే చక్రవర్తి నిర్మించారు. అతనికి రాజమహేంద్రుడనే బిరుదు ఉంది. ఆ పేరే ఊరికి కూడా, అంటే, రాజమహేంద్రం అని వచ్చిందంటారు. తరువాత అతని వంశీయుడైన రాజరాజనరేంద్రుడు పేరుమీద కూడా రాజమహేంద్రి అన్న పేరు వచ్చి, కాలక్రమేణా రాజమంద్రి...రాజమండ్రిగా మారిందని చెబుతుంటారు.

రాజమండ్రి పరిసర ఆలయాలు:   చారిత్రక ప్రాధాన్యత కలిగి పావన గోదావరీ తీరంలో ఉన్న రాజమండ్రి ఎన్నో దేవాలయాల నిలయం. ఇక్కడి కోటిలింగాల రేవును మరో కాశీగా పిలుస్తారు. కోటిలింగాల రేవులో వున్న ఉమా కోటిలింగేశ్వర స్వామి ఆలయం నిత్యం వేలాది మంది భక్తులతో కళకళలాడుతూ వుంటుంది. పుష్కరాల రేవుకు సమీపంలోని ఉమా మార్కండేయ స్వామి దేవాలయం కూడా ప్రసిధ్ధి చెందినది. ఇక్కడ ఇంకా అనేక ఆలయాలు వున్నాయి. దేవీచౌక్‌ లోని రాజేశ్వరీదేవీ గుడి, అన్నపూర్ణమ్మ పేటలోని సోమాలమ్మ మందిరం, గౌతమీ ఘాట్‌ లోని ఇస్కాన్‌ ఆలయం, వగైరా. అంతే కాదు. రాజమండ్రిలోనేకాక, చుట్టుపక్కల కూడా అనేక ప్రముఖ ఆలయాలున్నాయి.

వాటి వివరాలు..

అప్పనపల్లి : అప్పనపల్లిలోని బాలబాలాజీ దేవాలయం చాలా ప్రసిధ్ది చెందింది. రోజూ ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. రాజమండ్రి, రాజోలు మధ్యలో తాటిపాక జంక్షన్‌ లో దిగి అప్పనపల్లికి వెళ్లాలి.

ర్యాలీ: ర్యాలీలోని జగన్మోహిని కేశవస్వామి ఆలయం చాలా ప్రసిధ్దిగాంచింది. ఘంటచోళ మహారాజు ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారని చెబుతారు. ఇక్కడ భగవంతుడి విగ్రహం ముందునుంచి విష్ణుమూర్తిగా, వెనకనుంచి మోహిని ఆకారంలో వుంటుంది. అద్భుతమైన శిల్ప కళా సౌందర్యానికి ఈ స్వామి మూర్తి పెట్టింది పేరు. ఈ క్షేత్రం రావులపాలెంకి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.

ముక్తేశ్వరం : రావణ సంహారం తర్వాత రాముడు ప్రతిష్టించిన అనేక శివాలయాల్లో ఒకటిగా చెప్పుకునే క్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయం ఇక్కడ ఉంది. గోదావరి తీరాన వెలిసిన ఇక్కడ స్వామి వారిని క్షణ ముక్తేశ్వరుడుగా పిలుస్తారు. ఇక్కడ స్వామిని దర్శించుకున్న క్షణంలోనే ముక్తి లభిస్తుంది కాబట్టి ముక్తేశ్వరంగా పేరొందింది. ముక్తేశ్వరంలో ఎదురెదురుగా రెండు శివాలయాలు వున్నాయి. అమలాపురం నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి దగ్గరలోనే వినాయకుడు కొలువుతీరిన ఐనవిల్లి వున్నది.

మందపల్లి :  కోనసీమలోని మరో ప్రముఖ క్షేత్రం మందపల్లిలోని మందేశ్వరుని ఆలయం. శని దోష పరిహారానికి ఇక్కడ ప్రత్యేక పూజలు జరిపిస్తారు. ఈశ్వరుడే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించాడని చెబుతారు. అమలాపురం :  ఆకుపచ్చని కొబ్బరి తోటలతో, ప్రకృతి అందాలకు ఆలవాలమైన సీమ కోనసీమ. సమీపంలోని ఓడలరేవు మంచి పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చెందింది. రాజమండ్రి నుంచి బస్సు సౌకర్యముంది.

కోటిపల్లి :  ద్రాక్షారామానికి సమీపంలో గోదావరి నది ఒడ్డున కోటిపల్లి ఉంది. ఇక్కడ నదిలో స్నానం చేస్తే కోటిఫలితాలు దక్కుతాయని చెబుతారు. ఆ కోటిఫలితాలే కాలక్రమేణా కోటిపల్లిగా రూపాంతరం చెందాయని కూడా చెప్పుకుంటారు. ఛాయా సోమేశ్వరస్వామి, రాజరాజేశ్వరి దేవి ఆలయం చారిత్రక ప్రసిధ్ది చెందాయి. రాజమండ్రి నుంచి రామచంద్రపురం మీదుగా బస్సు సౌకర్యం ఉంది.

శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్ధానము

శ్రీ వెంకటేశ్వరస్వామివారి దేవస్ధానము, వాడపల్లి: ఆత్రేయపురం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని వాడపల్లి తీర్ధం గురించి చాలామంది వినే వుంటారు. ప్రతి సంత్సరం చైత్రశుధ్ధ ఏకాదశినాడు ఈ వాడపల్లిలో వెలిసిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి కళ్యాణం, తీర్ధం జరుగుతుంది. ఈ వేడుకలు చూడటానికి వేలాదిమంది భక్తులు తరలి వస్తారు. పూర్వం దండకారణ్యంగా పిలువబడిన ఈ ప్రాంతంలో అనేక మంది ఋషిపుంగవులు తపస్సుచేశారు.ఎందరో మహాఋషుల తపస్సుతో పావనమైన ఈ ప్రదేశంలో, పవిత్ర గోదావరి నదిలో 300 సంవత్సరాలక్రితం లభ్యమైన స్వామి విగ్రహాన్ని మేళతాళాలతో తోడ్కొనివచ్చి ఆగమ శాస్త్ర ప్రకారం గుడిలో ప్రతిష్ట చేశారు. తర్వాత పెద్దాపురం సంస్ధానాధీశులు శ్రీ వత్సవాయి తిమ్మజగపతిరాజు స్వామివారిని దర్శించి స్ధిరాస్తులు సమర్పించారు.స్వయంభూ అయిన ఈ స్వామి విగ్రహం రక్తచందనం చెక్కలో మూర్తీభవింపబడ్డది. ఇటువంటి చెక్క విగ్రహం ఒక్క వాడపల్లిలోనే వుందంటారు.భారతదేశ ప్రజలు గర్వించదగిన విషయం ఇంకొకటి జరిగింది ఇక్కడ. 1931వ సంవత్సరంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న దేశభక్తులు ఈ స్వామివారి ఉత్సవంలో రధంపై స్వరాజ్యకేతనాన్ని బాపూజీ చిత్రపటంతో సహా ఊరేగించి మనవారి వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పారు. అంతటి పుణ్యభూమి ఇది.ఏటా వాడపల్లి తీర్ధంనాడేకాక నిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే ఈ దేవస్ధానం రావులపాలెంనుంచి లొల్లమీదుగా ప్రయాణిస్తే కేవలం 8 కి.మీ. ల దూరంలోనే వుంది.రేపు గోదావరీ నదిపై పాపికొండల విహారయాత్ర చేద్దాము.

పి.యస్.యమ్.లక్ష్మి

(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)


More Purana Patralu - Mythological Stories