ఉత్తరకుమారుడివన్నీ ప్రగల్భాలేనా?

(Uttarakumara's Exaggerations)

 

ఎవరైనా ఉత్తుత్తి ప్రగల్భాలు పలుకుతుంటే ఉత్తరకుమారుడితో పోలుస్తారు. మరి ఉత్తరకుమారుడు ఎవరో, అతను ఎలా ప్రగల్భాలు పలికేవాడో చూద్దాం.

 

పాండవులు అజ్ఞాతవాసంలో ఉండగా వాళ్ళ ఉనికి కనిపెట్టాలని దుర్యోధనుడు ప్రయత్నిస్తున్నాడు. మారురూపంలో ఉన్న పాండవులని కనుక కనిపెడితే మరోసారి పన్నెండేళ్ళ అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పాలుచేయొచ్చని ఎదురుచూస్తున్నాడు. గూఢచారులను నియమించి, పాండవుల ఆచూకీ ఏమైనా తెలుస్తుందేమోనని ప్రయత్నిస్తున్నాడు. వెళ్ళిన ప్రదేశాల్లో వాళ్ళ ఆచూకీ దొరకలేదన్న విసుగుతో గోవులను అపహరించుకుపోతున్నారు.

 

దుర్యోధనుడు చేయిస్తున్న దాడులకు యాదవులు భయపడిపోయారు. రాజకుమారుడైన ఉత్తరకుమారుడితో యాదవులు తమ బాధ చెప్పుకుని ''దాడికి పాల్పడుతున్నవారితో యుద్ధం చేయ''మని చెప్పారు.

 

ఉత్తరకుమారుడు మహా ఉత్సాహంగా ''ఓస్.. అదెంత పని? ఈ క్షణమే యుద్ధానికి సన్నద్ధమౌతాను. కురుసైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడిస్తాను. వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయేట్లు చేస్తాను. ఆవుల్ని అపహరించుకు పోయినవారి చేతులు నరికేస్తాను. ఇకపై గోవుల సంరక్షణ భారం నాది..'' అంటూ వీరోచితంగా మాట్లాడాడు. యాదవుల సంతోషానికి అంతు లేకపోయింది.

 

తీరా యుద్ధభూమిలో ఉత్తరకుమారుడు నీరు కారిపోయాడు. ద్రోణాచార్యుని చూడగానే పై ప్రాణాలు పైనే పోయినట్లు ఒనికిపోయాడు. ఇతర వీరుల్ని చూసి కూడా కంపించిపోయాడు.

 

ఉత్తరకుమారుడు ఎక్కిన రథంలో బృహన్నల పేరుతో మారువేషంలో అర్జునుడు ఉన్నాడు.

 

''బృహన్నలా, రథాన్ని మళ్ళించు.. ఇది కేవలం యుద్ధభూమిలా లేదు.. మృత్యుకుహరంలా ఉంది.. అమ్మో.. రెండు నిమిషాలు ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోవడం ఖచ్చితం..'' అన్నాడు.

 

బృహన్నల రథాన్ని ఒక పక్కకి మళ్ళించగానే వేగంగా దిగాడు.

 

''ఒక్క నిమిషం.. ఉత్తర కుమారా.. అంత భయపడాల్సిందేమీ లేదు.. అదిగో శమీ వృక్షం.. దానిమీద కొన్ని ఆయుధాలు ఉన్నాయి.. చూడు.. నాకు వాటిని అందించరాదూ..” అన్నాడు.

 

ఉత్తరకుమారుడు ఆ మాటలేవీ విననట్లే అక్కణ్ణించి పారిపోతున్నాడు.

 

''ఒక్క క్షణం ఆగు ఉత్తర కుమారా.. నేనెవరో తెలుసా?” అన్నాడు బృహన్నల.

 

గుండెను చిక్కబట్టుకుని వెనక్కి తిరిగి చూశాడు ఉత్తరుడు. నిజానికి అప్పుడే పాండవుల అజ్ఞాతవాసం పూర్తయింది. కనుక అర్జునుడు తన మారురూపానికి వెంటనే స్వస్తి చెప్పాడు. ''నేను అజ్ఞాతవాసంలో కాలం గడుపుతున్న అర్జునుడిని..'' అన్నాడు ధీర గంభీరంగా.

 

ఉత్తరకుమారుడు కొంచెం స్థిమితపడ్డాడు. ''సవ్యసాచీ.. నీకు వందనాలు'' అంటూ నమస్కరించాడు.

 

అర్జునుడు, కౌరవసేన అంతు చూసేందుకు శమీ వృక్షంమీద భద్రపరచిన గాండీవాన్ని చేతిలోకి తీసుకున్నాడు.

 

అదన్నమాట సంగతి. నిజమైన ధైర్యస్తైర్యాలు, శక్తి సామర్ధ్యాలు లేకుండా ఒట్టి డాంబికాలు పలికితే ఉత్తరకుమారుని చందంగానే ఉంటుంది. దీన్ని బట్టే ఉత్తరకుమారుని ప్రగల్భాలు అనే నానుడి వచ్చింది.

 

Yadavas and Uttarakumara, Uttarakumara and Bruhannala, Uttarakumara's Exaggerations, Uttarakumara scared seeing by Dronacharya


More Purana Patralu - Mythological Stories