దేవుడిని ఎందుకు పూజించాలి!

దేవుడిని పూజించే వాడు భక్తుడు అనబడతాడు. భక్తి - భక్తుడు రెండు రకాలని భక్తిశాస్త్రాలు వల్లిస్తున్నాయి. వైధీభక్తి లేదా పరిచయాత్మక భక్తిని అనుసరించే వారిని కూడా భక్తుడనే అంటారు. కానీ పైన చెప్పబడిన విధంగా 'భక్తుడు' అనే భావాన్ని కనుక మనం తీసుకుంటే.. వైదీ భక్తిని అనుసరించే ఇతడు కేవలం భక్తునిగా మలచబడుతున్నాడే కానీ ఇంకా భక్తుడు కాలేదు.  నియమాలు, చుట్టుప్రక్కల వాతావరణం , పరస్పర సంబంధం వంటి బాహ్య ప్రేరణల ద్వారా మనసులో జనించే భక్తి భావననే వైధీభక్తి అంటారు. తగిన సందర్భాలలో ఈ వైధీభక్తి ఉదయిస్తుంది. అయితే పరిస్థితులతోపాటు అది కూడా మారుతూ ఉంటుంది.

భాగవత పురాణం భక్తి తొమ్మిది విధాలని చెబుతోంది. శ్రవణం (భగవంతుని గురించి భక్తులద్వారా వినడం), కీర్తనం (భగవంతుని ప్రాభవాన్ని కీర్తించడం), స్మరణం (భగవన్నామాన్ని స్మరించడం), పాదసేవనం (భగవంతుడు అన్ని జీవులలోనూ భాసిస్తున్నాడని తలుస్తూ వారిని సేవించడం), అర్చనం (విగ్రహాలలోనూ, పుణ్య క్షేత్రాలలోనూ భగవంతుని పూజించడం), వందనం (పుణ్య మూర్తులు, వ్యక్తులు, ప్రదేశాలు మొదలగువాటిపై తగిన గౌరవమర్యాదలు చూపడం), దాస్యం (తననితాను భగవంతుని దాసానుదాసునిగా తలచడం), సఖ్యం (ప్రాణ స్నేహితుడు లేదా బంధువులా భగవంతుడు సదా తనకు మేలు చేసేవాడని తలచడం), ఆత్మనివేదనం (తనని తాను భగవంతునికి సమర్పించడం),  తరువాత వచ్చిన ఆచార్యులు వీటిని 63 నియమాలుగా  విపులీకరించారు. వీటిలో మొదల ఉంటాయి. వీటిలో మొదట చెప్పబడిన నియమాలు ముఖ్యంగా బాహ్య వులపై, ప్రేరణలపై ఆధారపడి ఉంటాయి. చివరి మూడు నియమాలు మాత్రం కేవలం అంతరంగికమైనవి. ఆ మూడూ మనసు యొక్క వివిధ రీతులు. బయటి పరిస్థితులన్నిటికీ అతీతంగా మనసులో ఉదయించే ఒక నిరంతర ప్రక్రియే నిజమైన భక్తి అని తెలియజేస్తాయి. అటువంటి ఉత్కృష్టభక్తినే పరాభక్తి అని అంటారు. భాగవత పురాణంలో భక్తి గురించి చక్కగా వివరించారు.

"సాధారణంగా బాహ్య వస్తువులపై లయించే మానవుని మనసుకూ, ఇంద్రియాలకూ ఉండే శక్తులన్నీ, ఏ విధమైన స్వార్థపూరితమైన తలంపు లేకుండా, మరే ఇతర ఆటంకం వలన చలింపనలవికాని పట్టుదలతో, కేవలం భగవంతునిపై అవి సహజంగా లగ్నమైనప్పుడు మాత్రమే అది ఉత్తమమైన భక్తి. ముక్తి కన్నా కూడా అటువంటి భక్తి ఉన్నతమైనది. అగ్నిలో పడిన ప్రతి వస్తువూ దహించబడినట్లే ఆ వ్యక్తిలోని అజ్ఞానపు పొరను అది దహించివేస్తుంది".

ఇటువంటి ఉన్నతమైన భక్తి కలగడం అరుదు. అయితే భక్తిమయ జీవితానికి ఇదే పరమావధి. అనేక జన్మలపాటు కఠోర సాధన చేయడం వల్ల మనిషిలో ఇటువంటి భక్తి జనిస్తుంది. ఇది కేవలం భగవదనుగ్రహం వల్లనే సాధ్యమని కొందరి అభిప్రాయం. అందుకే భగవంతుడిని సేవించాలి.

                                ◆నిశ్శబ్ద.


More Subhashitaalu