దేవతలలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకత.  హరిహర సుతుడు అయ్యప్ప స్వామికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు పురుషులు పెద్ద ఎత్తున అయ్యప్ప మాలలో కనిపిస్తారు.  స్వామి కృప కోసం మండల దీక్ష చేపడతారు. అనంతరం సంక్రాంతి సందర్భంగా  కనిపించే మకర జ్యోతి దర్మనం కోసం కళ్లు కాయలు కాసేలా నిరీక్షిస్తారు. అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప మాలలో ఉన్న ప్రత్యేకత, మహిమ గురించి దీక్షను ఆచరించే వారికే తెలుస్తుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేం.  మండల దీక్ష సాగినన్ని రోజులు ఉదయం, సాయంత్రం చల్లని వేళలో చన్నీటి స్నానం, ఒంటి పూట భోజనం,  నేలమీద నిద్ర, పాదరక్షలు లేకుండా నడవడం, 41రోజులు అయ్యప్ప ఆరాధనలో గడపడం, ప్రతి రోజూ గుడిలో దైవ దర్మనం, అన్నింటి కంటే ముఖ్యంగా నల్లని వస్త్రాలు ధరించడం మొదలైనవి పాటిస్తారు. అసలు అయ్యప్ప దీక్ష తీసుకున్నవారు నల్లని దుస్తులే ఎందుకు ధరిస్తారు? దీని వెనుక ఉన్న కారణం ఏంటి?  

అయ్యప్ప మాల తీసుకున్నవారు ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం ఆచరిస్తారు. చల్లని వేళలో చన్నీటి స్నానం వల్ల శరీరం, మనసు తేలిక పడతాయి. మానసిక ఒత్తిడులు తగ్గుతాయి.  స్వామిని పూజించడంలో ఏకాగ్రత పెరుగుతుంది. ఎప్పుడూ ఆలోచనలతో సతమతమయ్యే మెదడు ఉత్తేజితమవుతుంది.

పాదరక్షలు లేకుండా మండలం రోజులు నడవం వల్ల పాదాలపై ఒత్తిడి పెరుగుతుంది. అసలు ఒట్టి పాదాలతో నడవడం అనే సందర్బమే రాని కాలమిది. చాలామంది ఇళ్లలో కూడా ప్రత్యేకంగా చెప్పులు, సాక్సులు ధరిస్తారు. అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా నడిస్తే రక్తప్రసరణ పెరుగుతుంది. అది గుండె మంచిగా పనిచేయడంలో సహాయం చేస్తుంది. దీక్ష సాగినన్ని రోజులూ శాకాహారం తినడం వల్ల జీర్ణసమస్యలనేవే ఉండవు.

అయ్యప్ప మాల వేసేవారి దుస్తుల వేనుక  శాస్త్రీయ కారణం ఉంది. నల్లని దుస్తులు వేడిని తొందరగా గ్రహిస్తాయి. చలికాలంలో ఈ దుస్తులు శరీరానికి వేడిని అందించి శరీరం వెచ్చగా ఉండేలా చేస్తాయి.  మరొక ముఖ్యవిషయం ఏమిటంటే శబరిమల యాత్ర అంతా అడవుల గుండా సాగుతుంది. దీక్ష వేసుకున్నవారు నల్లని వస్త్రాలతో అడవులలో వెళ్లేటప్పుడు అడవి జంతువుల నుండి ప్రమాదాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. నల్లని దుస్తులు ధరించి దీక్ష పాటించడం వల్ల శని దేవుని దోషం ఉంటే అది తొలగిపోతుంది.

చాలామంది చెడు ప్రవర్తన కలిగినవారు అయ్యప్ప దీక్ష తరువాత చాలా మంచివారుగా మారిపోతారు. అయ్యప్ప దీక్షలో వ్యక్తులు మానసికంగా బలపడతారు. వ్యక్తిత్వం అభివృద్ది చెందుతుంది. గర్వం, అహంకారం నశిస్తాయి.  చాలా హుందాగా, ఎలాంటి గొప్పలకు పోకుండా దీక్ష తరువాత కూడా నిరాడంబరంగా జీవిస్తారు.

                                             *నిశ్శబ్ద.


More Ayyappa Swami