పంచముఖ ఆంజనేయుడి ప్రత్యేకత ఇదే!

ఆంజనేయుడు పరమ శక్తివంతుడు, మరణమే లేని సంజీవుడు. శత్రువుల పట్ల ఎంత భీకరంగా ఉంటాడో, భక్తుల పట్ల అంతే కరుణ చూపిస్తాడు. అలాంటి స్వామిని ఒకోసారి పంచముఖ రూపంలో కొలుస్తారు. ఆ అవతారం వెనుక చాలా ఆసక్తికరమైన కథను తెలుసుకుందామా!

రామాయణంలో… రావణుడు తన సర్వసైన్యాలనూ కోల్పోతూ, రోజురోజుకీ బలహీనపడిపోతూ ఉన్న సమయంలో సోదరుడైన అహిరావణుడి సాయాన్ని కోరతాడు. అహిరావణడు పాతాళానికి అధిపతి. రావణుడి కోరిక మేరకు అతను విభీషణుడి రూపంలో వచ్చి రామలక్ష్మణులను ఏమార్చి పాతాళానికి తీసుకు వెళ్లిపోతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న హనుమంతుడు… రామలక్ష్మణులను వెతుక్కుంటూ అహిరావణుడి భవనానికి చేరుకుంటాడు.

అహిరావణుడు అసాధారణమైన వరాలను కలిగినవాడు. అయిదు దిక్కులలో నిత్యం వెలుగుతూ ఉండే దీపాలను ఒక్కసారిగా ఆర్పితే కానీ అతనికి మృత్యువు రాదనే నిబంధన ఉంది. అందుకోసమే హనుమంతుడు… హయగ్రీవ, నారసింహ, గరుడ, వరాహ రూపాలతో కలిసి పంచముఖునిగా మారి… ఆ దీపాలను ఆర్పుతాడు. ఆంజనేయుడి పంచముఖాలు కేవలం బాహ్యపరమైన రూపాలు మాత్రమే కాదనీ, వాటి వెనుక ఆధ్యాత్మక సూచనలు కూడా ఉన్నాయని చెబుతారు.

పంచభూతాల మీద ఆయనకి ఉన్న అదుపును ఇవి సూచిస్తాయని అంటారు. ఈ విషయం తన గాథను గమనిస్తే స్పష్టం అవుతుంది. ఆంజనేయుడు వాయుపుత్రుడు, జలనిధిని దాటినవాడు, ఆకాశంలో వేల యోజనాలు అలుపు లేకుండా ఎగరగలవాడు, భూదేవి కుమార్తె అయిన సీతమ్మ జాడను కనుగొన్నవాడు, పాతాళానికి సైతం చేరుకోగల శక్తి కలవాడు, అగ్నితో లంకను దహించినవాడు… ఇలా తన కథలో పంచభూతాల మీద అదుపు అడుగడుగునా కనిపిస్తుంది. అంతేకాదు! పంచేంద్రియాలకు, అయిదు రకాల భక్తికీ కూడా ఇవి ప్రతీకగా పేర్కొంటారు.

బహుశా పంచముఖ అవతారం కారణం చేతనేమో.. ఆంజనేయునికి అయిదు సంఖ్య అంటే ప్రీతి అని చెబుతారు. అయిదు సంఖ్య వచ్చేలా ప్రదక్షిణలు చేయమంటారు. ఈ పంచముఖుని విగ్రహాలు ఎన్నో చోట్ల కనిపిస్తాయి. వాటిలో మంత్రాలయంలో కనిపించేది చాలా ప్రత్యేకం. రాఘవేంద్ర స్వామికి అక్కడ పంచముఖ ఆంజనేయుడు దర్శనం ఇచ్చినట్లు స్థలపురాణం చెబుతోంది. ఈ పంచముఖుని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా తీరిపోతాయనీ, భయాలు వీడిపోతాయనీ… శత్రు శేషం, రుణ శేషం ఉండవనీ చెబుతారు.

- నిర్జర.


More Ayyappa Swami