భోగిపండుగ రోజు చిన్నారుల తలపై భోగి పళ్లు ఎందుకు పోస్తారు..కారణమేంటీ?


మకరసంక్రాంతి పండుగకు ఒకరోజు ముందు భోగి సంబురాలు షురూ అవుతాయి. ఈ పండుగ రోజు చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు. ఇలా పోయడానికి కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబురాలు షురూ అయ్యాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మినీ సంక్రాంతి పండుగ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యుడు ధనస్సు నుంచి మకరంలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. ఇదే సమయంలో పంట చేతికి వస్తుంది. రైతుల కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. ఈ పండుగకు ఒక రోజు ముందుగా భోగి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగ వేళ తెల్లవారుజామునుంచే పల్లెటూళ్లలో భగభగ మండే భోగి మంటలను వేస్తుంటారు. ఇందులో పాత చెక్కతోపాటు ఇంట్లో ఉండే పాత సామాగ్రిని వేస్తారు. భోగి మంటల చుట్టూ చేరి ఆటలు, పాటల కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. తర్వాత భోగి మంటలపై పాత్రలను ఉంచి అందులో నీటి వేడి చేస్తారు. ఈ వేడినీటితోనే స్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల శుభఫలితాలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. ఇదిలా ఉండగా ఇదే రోజు చిన్నారుల తలపై భోగి పళ్లను పోస్తారు. ఇలా చేయడం వెనకున్న ఆంతర్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

నెగెటివ్ ఎనర్జీ పోతుంది:

ఈ ఏడాది జనవరి 14వ తేదీన ఆదివారం భోగి పండగ వచ్చింది. సూర్యభగవానుడు ఉత్తరాయనం ప్రారంభించే ముందు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ఆవుపిడకలు, ఇంట్లో పనికిరాని వస్తువులను, విరిగిపోయిన వస్తువులను భోగి మంటల్లో వేస్తారు. ఎందుకంటే అవి ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగిస్తుందని నమ్ముతుంటారు.

భోగిపళ్లను ఎందుకు పోస్తారు:

భోగిపండుగ రోజు ఉదయం భోగి మంటలతో సందడిగా గడుపుతారు. సాయంత్రం చిన్నారుల తలపై భోగి పళ్లు పోసే కార్యక్రమం నిర్వహిస్తారు. తమ పిల్లలపై పేరేంట్స్ చుట్టుపక్కల వారు భోగిపళ్లను పోసి ఆశీస్సులు అందజేస్తారు. రేగుపండ్లనే భోగిపళ్లు అని పిలుస్తారు. వీటిని చిన్నారుల తలపై పోస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని..నరదిష్టి, గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతుంటారు. ఎందుకంటే తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుందని ..అక్కడ పళ్లను పోస్తే పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అంతేకాదు శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం.

ఎలా పోస్తారు:

ప్రతిఒక్కరూ గుప్పిట నిండుగా భోగిపళ్లు తీసుకుని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతారు. తర్వాత వాళ్ల తల మీద పోస్తారు. ఈ దిష్టిని తీసేందుకు ఉపయోగించిన పండ్లను తినరు. వీటిని బదరీ ఫలం లేదా ఆర్కఫలం అని అంటారు. 12ఏళ్లలోపు చిన్నారులపై ఈ పండ్లను పోస్తారు. సంక్రాంతి అంటేనే సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుడు ఎర్రని రంగులో గుండ్రని రూపంలో ఉండటం వల్లే దీనికి ఆర్కఫలం అని పేరు వచ్చింది. సూర్యుడి ఆశీస్సులు తమ పిల్లలకు లభించాలని సూచనగా ఈ భోగి పండ్లను పోస్తారు.
 


More Sankranti