సంక్రాంతి పండుగ రోజు ఈ వస్తువులు దానం చేస్తే.. రాహు దోషం నుండి బయటపడతారట..!

 


 హిందూ మతంలో మకర సంక్రాంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్  ప్రకారం, సూర్యుడు ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు.  సూర్యుడు  ధనుస్సు రాశిలో ప్రయాణాన్ని ముగించి తదుపరి రాశిలోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దానిని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి నాడు స్నానం చేయడం, పూజించడం, ధ్యానం చేయడం,  దానం చేయడం వంటి వాటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి మారతాడు. మకర సంక్రాంతికి శూన్యమాసం ముగిసి అన్ని శుభకార్యాలు ప్రారంభమవుతాయి. మత విశ్వాసాల ప్రకారం, మకర సంక్రాంతి రోజు గంగా స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని రకాల కష్టాల నుండి ఉపశమనం పొందుతారట. అంతేకాదు.. సంక్రాంతి రోజు చేసే దానం కూడా విశేష ఫలాన్ని ఇస్తుంది.

మహాభారతంలో కౌరవుల తరపున యుద్ధంలో పాల్గొన్న భీష్మ పితామహుడు తన శరీరాన్ని విడిచిపెట్టడానికి మకర సంక్రాంతిని ఎంచుకున్నాడు. ఎందుకంటే ఈ రోజు నుండి సూర్యుడు ఉత్తరాయణంలోకి మారతాడు. పురాణ గ్రంధాల ప్రకారం దేవతల రోజు ఉత్తరాయణం నుండి ప్రారంభమవుతుంది. ఈ రోజున యాగ సమయంలో సమర్పించే నైవేద్యాలను స్వీకరించడానికి దేవతలు భూమిపైకి వస్తారని చెబుతారు. అందుకే ఈ రోజు దానానికి ప్రాముఖ్యత ఏర్పడింది.

మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను దానం చేయాలి. ఇది శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా నల్ల నువ్వులను దానం చేయడం వల్ల సూర్య భగవానుడి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.

నువ్వులు కాకుండా బెల్లం దానం చేయడం కూడా మకర సంక్రాంతి నాడు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. బెల్లం సూర్య భగవానునికి,  గురువుకు సంబంధించినది. మకర సంక్రాంతి నాడు బెల్లం దానం చేయడం వల్ల కెరీర్‌లో మంచి అభివృద్ధి ఉంటుంది.  గౌరవం మరియు కీర్తి పెరుగుతాయి.

మకర సంక్రాంతి రోజు పొంగలి దానం చేయడం మంచిదట.  సాధారణంగానే సంక్రాంతిని పొంగలి పండుగ అనడం వినే ఉంటారు. ఈరోజు పొంగలి వండి తాము తిని, ఇతరులకు దానం చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సంపదలకు లోటు ఉండదు.

మకర సంక్రాంతి నాడు దుప్పట్లు దానం చేయడం కూడా విశిష్టత. జ్యోతిషశాస్త్ర విశ్వాసాల ప్రకారం, ఈ రోజున దుప్పటి దానం చేయడం వల్ల శని,  రాహువులకు సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.


                                        *రూపశ్రీ.


More Sankranti