గంగానదిలో అస్థికలను ఎందుకు నిమజ్జనం చేస్తారు.. గరుణ పురాణంలో ఉన్న రహస్యం ఏమిటంటే!

మానవ జీవితంలో మరణం అనేది తప్పనిసరిగా వచ్చేదే.. ప్రతి మనిషి ఏదో ఒకరోజు మరణం ఒడిలోకి జారుకోవలసిందే.. మానవ జీవితం గురించి, మరణం గురించి, మరణం తర్వాత జరిగే సంఘటనల గురించి వివరించేది గరుణ పురాణం.  సనాతన ధర్మంలో ఉండే 18 మహా పురాణాలలో గరుణ పురాణం చాలా విశేషమైనది.  మత  గ్రంథాల ప్రకారం, ఒక వ్యక్తి మరణం తర్వాత, వారి ఆత్మ కొత్త జీవితాన్ని పొందుతుంది, అంటే మరణం తర్వాత ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా, ఒక వ్యక్తి మరణించినప్పుడు, వారికి అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంత్యక్రియల తర్వాత, మరణించిన వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు ఇందుకోసం కాశీకి వెళ్లడానికే ఎక్కువ మంది ప్రయత్నం చేస్తారు కూడా. . కానీ మరణం తర్వాత అస్థికలను గంగానదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారో చాలా మందికి తెలియదు,  మరణం తర్వాత అస్థికలను గంగానదిలో ఎందుకు నిమజ్జనం చేస్తారనే విషయాన్ని గరుడ పురాణంలో పేర్కొన్నారు.  అందులో చెప్పిన రహస్యాలు ఏంటో తెలుసుకుంటే..

శరీరం అగ్ని మూలకంలో విలీనం..

మానవ శరీరం పంచభూతాలతో ఏర్పడిందని చెబుతారు. పంచభూతాలైన నింగి, నీరు,  మట్టి,  అగ్ని,  వాయువు అనే మూలకాలు కూడా మనిషి శరీరంలో ఉంటాయి. ఒక వ్యక్తి మరణించినప్పుడు వారి శరీరం అగ్ని తత్వానికి అంకితం చేయబడుతుంది.  దహనం చేయడం వల్ల శరీర భాగాలు బూడిదగా మారిపోతాయి,  మిగిలిన ఎముకలు మర్త్య శరీరంలో చివరిగా మిగిలి ఉంటాయి. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం, దహన సంస్కారాల తర్వాత మూడవ రోజున ఈ ఎముకలను సేకరించి, 10 రోజులలోపు గంగా నదిలో నిమజ్జనం చేయాలని చెబుతారు.

భగీరథుడి వృత్తాంతం..

భగీరథుడు తన పూర్వీకులకు మోక్షం కలిగించడానికి సంవత్సరాల తరబడి తపస్సు చేశాడని పురాణ కథనం ఉంది. ఆ తపస్సు ఫలితంగా గంగామాత భూమిపై అవతరించింది. శాస్త్రాలలో గంగానదిని మోక్షదాతగా పేర్కొంటారు. అందుకే దహన సంస్కారాల తర్వాత ఎవరైనా మరణిస్తే, వారి అస్థికలను గంగానది పవిత్ర జలాల్లో నిమజ్జనం చేస్తారు. మరణించిన వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయడం వల్ల ఆత్మకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. అందుకే మోక్షం పొందడానికి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేస్తారు.

గరుడ పురాణం చెప్పిన రహస్యం..

గరుడ పురాణం ప్రకారం మరణించిన వారి అస్థికలు గంగా నది పవిత్ర జలాల్లో ఉన్నంత కాలం, ఆత్మ దేవతల అనుగ్రహాన్ని పొంది, వారి సంచిత పాపాలు నశిస్తాయట. శాస్త్రాల ప్రకారం, అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయడం ఆత్మకు ప్రేతాత్మల లోకం నుండి విముక్తినిస్తుంది. అంతేకాకుండా, ఈ ఆత్మలు స్వర్గంలో స్థానం పొందుతాయట.

మోక్షం, పునర్జన్మ చక్రం..

సనాతన ధర్మం ప్రకారం ఏ ఆత్మకైనా అంతిమ లక్ష్యం మోక్షాన్ని పొందడమే. ఒక ఆత్మ మోక్షాన్ని పొందినప్పుడు, అది జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతుందని చెప్పబడింది. శాస్త్రాలలో గంగానదిని మోక్షదాతగా పేర్కొన్నందున, మరణించిన వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయడం వారి ఆత్మకు మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇందుకే మరణించిన వారి అస్థికలను గంగానదిలో నిమజ్జనం చేయాలని అంటారు.

                                       *రూపశ్రీ.


More Enduku-Emiti