ఉంగరపు వేలు జీవితం గురించి రహస్యాలు చెప్పేస్తుందట..!
చేతి వేళ్లలో దేనికదే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా ఉంగరపు వేలుకు ప్రాధాన్యం ఉంది. ఈ ఉంగరపు వేలును అనామిక వేలు అని కూడా అంటారు. ఇది చిటికెన వేలు కంటే కొంచెం పొడవుగా, మధ్యవేలు కంటే కొంచెం చిన్నగా ఉంటుంది. సూర్యుని స్థానం ఉంగరపు వేలు వద్ద ఉంటుందని చెబుతారు. ఈ ఉంగరపు వేలు కూడా చాలా మందిలో ఆకారంలోనూ, పొడవులోనూ తేడాలు ఉంటాయి. ఈ ఉంగరపు వేలు స్థితిని బట్టి ఒక వ్యక్తి భవిష్యత్తును, ఆ వ్యక్తి గురించి రహస్యాలను చెప్పేయవచ్చట. దీని గురించి తెలుసుకుంటే..
సాధారణంగా చేతిలో చూపుడు వేలు, ఉంగరపు వేలు ఒక పరిమాణంలో, ఒకే పొడవులో ఉంటాయి. కానీ చూపుడు వేలు కంటే ఉంగరపు వేలు పొడవుగా ఉంటే అలాంటి వారు జీవితంలో పురోగతి సాధిస్తారట. ఇలాంటి వ్యక్తులు ఎదుటివారి పట్ల చాలా అనురాగంతో , ప్రేమతో ఉంటారు. జీవితంలో ప్రతిదీ తమ కష్టం ద్వారానే సాధించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు కూడా వీరిని ఏ మాత్రం బాధించవని చెబుతారు.
చేతి వేళ్లు నిటారుగా కాకుండా కాస్త పక్కకు వంగినట్టు ఉంటాయి. ఉంగరపు వేలు చిటికెన వేలు వైపు వంగి ఉంటే మాత్రం వారికి అద్భుతమే.. ఇలాంటి వారు వ్యాపారాలలో విజయం సాధిస్తారట. వ్యాపారాలలో చాలా లాభాలు పొందుతారు. ఉంగరపు వేలు మధ్యవేలు వైపు ఒరిగి ఉంటే అలాంటి వారు స్వార్థ పరులు అంట. వీరు తమ జీవితంలో ఏదో ఒక పని చేస్తారట. ఈ పనే.. వారు మరణించిన తరువాత కూడా వారిని ప్రజల హృదయాలలో నిలిచి ఉండేలాచేస్తుందట. సమాజంలో వీరు చాలా కాలం గుర్తుండిపోతారట.
ఉంగరపు వేలు చూపుడు వేలు కంటే చిన్నగా ఉంటే అలాంటి వ్యక్తులు చిత్రాకారులు కావచ్చట. ఇలాంటి వ్యక్తులు చిత్రాలు, పాత వస్తువులు, కళాఖండాల ద్వారా సంపదను కూడబెట్టుకుంటారు. ఉంగరపు వేలు కొద్దిగా కోణం లాగా ఉన్న వ్యక్తులు సంగీతం వైపు మొగ్గు చూపుతారట. అలాగే వీరు భవిష్యత్తులో చిత్రాకారులుగా మారవచ్చట. ఉంగరపు వేలు ముందు భాగం చతురస్రాకారం లాగా ఉంటే ఆ వ్యక్తులు కళ ద్వారా చాలా సంపదను, కీర్తిని సంపాదిస్తారట. సమాజంలో గౌరవాన్ని కూడా సంపాదించుకుంటారట. ఇక ఉంగరపు వేలు పై భాగం చదునుగా ఉంటే అలాంటి వ్యక్తులు చరిత్రకు సంబంధించిన విషయాలపై, పనులపై ఆసక్తి ఎక్కువ చూపడానికి ఇష్టపడతారు. అదే రంగంలోనే విజయం సాధిస్తారు.
ఉంగరపు వేలు మధ్యవేలుకు సమానంగా ఉంటే.. అలాంటి వ్యక్తులు ఏ పని మొదలు పెట్టినా దానిని మధ్యలో వదిలేసే లక్షణం ఉండదు. ఎంత సమస్య ఎదురైనా సరే.. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే తీరతారు. తాము చేసే ప్రతి పనిలో విజయం సాధించాలని అనుకుంటారు. జీవితంలో సంపదను, విజయాలను సాధిస్తారు. సమాజానికి భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అలాగే తమ సొంత పనులను చేసుకోవడానికి మాత్రమే ఇష్టపడతారు.
*రూపశ్రీ.
