జూదం గురించి పరమాత్మ ఏమి చెప్పాడు?


కృష్ణుడు కేవలం జూదమును గురించే ఎందుకు చెప్పాడు. ఎందుకంటే అదే ద్యూతంలో ఓడి పోయాడు ధర్మరాజు. దాని వలననే భారత యుద్ధం సంభవించింది. పాచికలను పక్కనే పెట్టుకొని పడుకొనేవాడు, పాచికలే లోకంగా జీవించిన వాడు శకుని. భార్యతో సరదాగా జూదం ఆడేవాడు ధర్మరాజు. ఒక ప్రొఫెషనల్తో ఒక అమెచ్యూర్ పోటీ పడితే, ఆ ప్రొఫెషనలిజానికి మోసం తోడయితే ఎలా ఉంటుంది. ఎదుటి వాడికి ఓటమి తప్పదు. ఈ విషయం ధర్మరాజుకు తెలుసు. తెలిసి తెలిసీ రాజ్యసర్వస్వమును, తమ్ములను, భార్యను ఒడ్డి ఓడి పోవడం ధర్మరాజు తెలివితక్కుతనం. అందుకే మోసపూరిత క్రీడలలో ఒకటైన జూదం, అనే ఉపమానాన్ని వాడాడు పరమాత్మ. అంతే కానీ, జూదం ఆడమని కానీ, జూదాన్ని ప్రోత్సహించడం కానీ, జూదంలో మోసం చేయమని కానీ చెప్పలేదు. కేవలం జూదం, అందులో అంతర్లీనంగా ఉన్న మోసశక్తిని, మానవుని దిగజార్చేశక్తిని కూడా నేనే అని అన్నాడు. 


ఒక గదిలో లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు పరమాత్మ అని అనుకుంటే, ఆ వెలుగులో మంచి కార్యములు చేయవచ్చు. పేకాట ఆడి ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు. మర్డర్లు, దొంగతనాలు చేయవచ్చు. చేసే కార్యం ఏదయినా వెలుగు మాత్రం ఒకటే. అన్నిటికీ సమానమే. అందుకే జూదము కూడా నేనే. దానిని సరదాకే పరిమితం చేస్తావో, జీవితం నాశనం చేసుకుంటావో ఎలా ఉపయోగిస్తావో అది నీ ఇష్టం అని నర్మగర్భంగా చెప్పాడు పరమాత్మ. కాని కృష్ణుని బోధనలను అర్ధం చేసుకోకుండా, “ఏమండీ పరమాత్మ జూదంలో కూడా ఉన్నాడు కదా, ఆ జూదం ఆడితే తప్పేంటి" అని అడిగేవాళ్లు ఉన్నారు. 


మరి పరమాత్మ విభూతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో అన్నిటిలో నీవు ఉన్నావా! అని ముందు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దీని పక్కనే మరొక ఉపమానం కూడా ఉంది. తేజస్సు కలవారిలో ఉన్న తేజస్సును నేను అని కూడా అన్నాడు. మనవి తేజోవంతమైన ముఖాలా, జిడ్డుముఖాలా ముందు ఆలోచించాలి. మనలో అసలు తేజస్సు, బుద్ధి కుశలత, నేర్పు ఉన్నాయా ఆలోచించాలి. ఇవేమీ ఆలోచించకుండా, కృష్ణుడు జూదంలో కూడా ఉన్నాడు, అందుకని జూదం ఆడతాను అని అనడం శుద్ధఅవివేకము. 


తేజస్సు కల వారిలో తేజస్సును నేనే అన్నాడు కృష్ణుడు.  తేజస్సు అంటే తెలివితేటలు, బుద్ధి కుశలత, నేర్పు, ఎదుటి వాడి మీద గెలిచే సామర్థ్యం. ఇవన్నీ నేనే. అంటే జూదంలో కూడా ఉన్న కుశలత, నేర్పు అన్నీ నేనే. ఆ నేర్పు ధర్మరాజులో లేదు, ఒక్క మొండి తనం తప్ప. శకునితో ఆడే నేర్పు తనకు ఉందా అని ఆలోచించలేదు. బుద్ధికుశలతను విచక్షణను ప్రదర్శించలేదు. తనకు అంతా తెలుసు అనే అహం. మొండి తనం. తాను చేసేదంతా ధర్మము అనే గర్వం. అందుకే ఓడాడు. ఫలితం అనుభవించాడు. అందుకే బుద్ధికుశలతకు, విచక్షణకు, నేర్పుకు, మారు పేరైన తేజస్సును నేను అంటున్నాడు పరమాత్మ. 


ఇలా మహాభారతంలో ధర్మరాజు చేసిన తప్పిదాన్ని కూడా సూక్ష్మంగా వివరిస్తాడు.

◆వెంకటేష్ పువ్వాడ.


More Purana Patralu - Mythological Stories