భగవద్గీత లో చెప్పిన ఈ విషయం అర్థం చేసుకుంటే విజయం తథ్యం..!

 

భగవద్గీత.. భారతీయులకు లభించిన గొప్ప కానుక అని చెప్పవచ్చు.  సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి భోధించిన సారాంశమే భగవద్గీతగా పిలవబడుతోంది.  భగవద్గీతలో చాలా అధ్యాయాలు  ఉన్నాయి.  ఒక్కోక్క అధ్యాయంలో మళ్లీ కొన్ని శ్లోకాలు ఉన్నాయి.  తెలియని వారికి ఇవి ఒట్టి శ్లోకాలు అనిపిస్తాయి. కానీ వీటి అర్థం తెలుసుకుంటే జీవితమే మారిపోతుంది.  భగవద్గీత శ్లోకాలలో ఉన్న సారాన్ని తెలుసుకుని విదేశీయులు కూడా సనాతన ధర్మంలోకి వచ్చేస్తున్నారు. అంతటి శక్తి,  అంత గొప్ప సారాంశం భగవద్గీతలో ఉంది.  అయితే ఒక వ్యక్తి విజయం సాధించాలంటే భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని తెలుసుకోవాలి.  ఇంతకీ ఆ శ్లోకం ఏంటి? అందులో ఉన్న సారాంశం ఏంటి? అని తెలుసుకుంటే..

కర్తవ్య నిర్వహణ..

కర్తవ్యం అంటే ఒక వ్యక్తి తాను చేయాల్సిన పని.  ఒక వ్యక్తి తాను చేయాల్సిన పనిని చేస్తే కర్తవ్య నిర్వహణ చేసినట్టే.. అయితే చాలామంది తాము చేయాల్సిన పని వల్ల ఏదైనా నష్టం లేదా.. బాధ ఎదురవుతుంది అని తలచి ఆ పని చేయడానికి వెనకడుగు వేయడం లేదా.. ఆ పని విషయంలో సందేహాలు పెట్టుకుని పనిని సరిగా చేయకపోవడం చేస్తారు.  కానీ భగవద్గీతలో శ్రీ కృష్ణుడు మాత్రం నీ కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నెరవేర్చాలి అని అర్జునుడికి చెబుతాడు. దానికి సంబంధించి అర్జునుడికి ఎన్నో విధాలుగా నచ్చజెబుతాడు, ఎన్నో వృత్తాంతాలను,  ఉపమానాలను వివరిస్తారు.  ఇది కేవలం అర్జునుడిని మాత్రమే ఉద్దేశించి చెప్పిన విషయం కాదు..

భగవద్గీత అర్జునుడికి భోధించిన తరువాత అందరికీ అందుబాటులోకి వచ్చింది.  దీని వల్ల శ్రీకృష్ణుడు చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి అనుసరణీయం అయ్యింది.  అర్జునుడికి చెప్పిన విషయాలు అన్నీ ప్రతి మానవుడికి వర్తిస్తాయి.  కర్తవ్యాన్ని నెరవేర్చడం అంటే మనిషి తన కర్మను నెరవేర్చడం.  మనిషి తన కర్మను తాను సక్రమంగా నెరవేరిస్తే ఆ దేవుడు ఆ పనికి తగిన ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాడని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు.  అందుకే కర్మలను నెరవేర్చాలి,   ఆ కర్మకు ఫలితాన్ని ఆశించకూడదు.  అప్పుడే చేసిన పనికి తగిన ఫలితం మంచి అయినా, చెడు అయినా ఆ వ్యక్తి వాటితో సంబంధం లేకుండా బ్రతకగలుగుతాడు. ఫలితాన్ని ఆశించి చేసే   కర్మల నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.  అందుకే మనిషి సంతోషంగా ఉండాలంటే.. మంచి కర్మలు చేయాలి. అంటే సత్కర్మలు చేయాలి.  ఫలితాన్ని ఆశించకూడదు. అప్పుడు మనిషి జీవితం సంతోషంగా ఉంటుంది.


                                    *రూపశ్రీ.


More Vyasalu