వినాయకుని ప్రతిమలో వివిధరూపాలు 

 

భ‌క్తులు ఏ దేవుడినైనా త‌మ‌కి తోచిన రూపాల‌లో పూజించుకోవ‌డం సాధార‌ణ‌మే! కానీ వినాయ‌కునిప్ర‌తిమ‌ల‌కు ఓ ప్రత్యేకత ఉంది. తాము ఆ గ‌ణేశుని నుంచి ఏ విధ‌మైన స‌హాయం పొందాల‌నుకుంటున్నారో,త‌మ జీవితం ఎలా సాగితే బాగుంటుంద‌ని భ‌క్తులు ఆశిస్తూ ఉంటారో... వాటికి అనుగుణ‌మైన గ‌ణేశునిప్ర‌తిమ‌ల‌ను భ‌క్తులు పూజిస్తూ ఉంటారు. అవేంటో చూద్దామా! చంద్రసూర్యనాడులు: మనకి ఎక్కువగా కనిపించే వినాయకుని విగ్రహాలలో తొండం కాస్త వంపు తిరిగి ఓంకారాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆ బొజ్జ వినాయ‌కుని తొండం ఉండే స్థానాన్ని బట్టి ఆయన ప్రభావం వేరుగా ఉంటుందని చెబుతారు. ఎందుకంటే మానవునిలో ఇడ, పింగళ అనే రెండు నాడులు ఉంటాయని యోగశాస్త్రం చెబుతోంది. వీటినే చంద్ర, సూర్య నాడులు అని కూడా అంటారు. వీటి ద్వారా మనిషిలోకి ప్రాణవాయువు ప్రవహిస్తూ ఉంటుంది. మనిషిలో నిద్రాణమైన ఉన్న కుండలినీశక్తిని జాగృతం చేయడంలో కూడా ఈ నాడులది ముఖ్య పాత్ర. వినాయకుని తొండం ఎడమవైపుకి ఉందా! కుడివైపుకి ఉందా అన్న విషయం ఈ నాడులను సూచిస్తుందంటారు.

ఎడమవైపుకి తిరిగి ఉంటే: గణేశుని తొండం ఎడమవైపు దిక్కుకి ఉంటే అది చంద్రనాడిని ప్రతిబింబిస్తుంది. చంద్రుడు చల్లనివాడు కదా! అలాగే చంద్రనాడి కూడా ప్రశాంతతను సూచిస్తుంది. చంద్రనాడిని సూచించే వినాయకుని విగ్రహం సుఖాశాంతులనూ, దైవానుగ్రహాన్నీ కలిగిస్తుందని నమ్ముతారు. ఇలా ఎడమదిక్కుకి తొండాన్ని కలిగి ఉన్న వినాయకుని వామముఖి అంటారు. ఏ చీకూచింతా లేకుండా జీవితం సాఫీగా గడిచిపోవాలంటే వామముఖి వినాయకుని కొలుచుకోవాలని విశ్వసిస్తారు భక్తులు. అందుకే మనకి కనిపించే వినాయకుని విగ్రహాలలో ఎక్కువగా వామముఖి కలిగినవే ఉంటాయి.

కుడివైపుకి ఉంటే: ఇలాంటి విగ్రహాలు సూర్యనాడిని సూచిస్తాయి. ఈ సృష్టిని నడిపించేవాడు సూర్యుడే కానీ ఆయనని నేరుగా భరించడం కష్టం. ఈ విగ్రహాలూ అంతే! భక్తుల మనసులో మెదిలే అన్ని కోరికలనూ ఈడేరుస్తాయి. అందుకే ఆయనను ‘సిద్ధి వినాయకుడు’ లేదా దక్షిణాభిముఖి అంటారు. కానీ ఆయనని పూజించేవారు చాలా నిష్టగా ఉండాలి. ఇలాంటి ప్రతిమను నెలకొల్పినప్పుడు దానిని కొలవడంలో ఎటువంటి లోటుపాట్లూ రాకూడదని చెబుతారు. అందుకే దక్షిణాభిముఖి వినాయకులు ఉన్న ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక తొండం నిటారుగానో లేకపోతే గాల్లోకి ఉన్నట్లుగానో కనిపించే వినాయకుని ప్రతిమలు మరింత అరుదు. ఇవి కుండలినిలోని వివిధ స్థాయిలను సూచిస్తాయి.

- నిర్జర.


More Vinayakudu