జ్ఞానిలో ఉండే రెండు లక్షణాలు!!

 

శేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోం..త్యర్ధమహం స చ మమ ప్రియః||

పైన చెప్పబడిన భక్తులో ఎల్లప్పుడూ యుక్తుడుగా ఉండేవాడు. పరమాత్మ యందు ఏకాగ్రభక్తి కలిగి ఉండేవాడు అయిన జ్ఞానికి నేనంటే ఎక్కువ ఇష్టం. అటువంటి జ్ఞానిలో రెండు లక్షణాలు ఉంటాయి. అవి 1. నిత్య యుక్త, 2. ఏక భక్తి,

నిత్య యుక్తత్వము అంటే నిరంతరము పరమాత్మతో కూడి ఉండటం, పరమాత్మతో సంబంధము పెట్టుకోవడం, ఇతరముల గురించి ఆలోచించకపోవడం అంటే ఎల్లప్పుడూ ధ్యానంలో ఉంటూ మనసును ఆత్మలో లీనం చేసి ఆత్మానందాన్ని పొందుతుంటారు. చాలామంది కేవలం అవసరం ఉన్నప్పుడు భగవంతుని స్మరిస్తారు. తరువాత తమ తమ పనులలో లీనం అవుతారు. మళ్లీ అవసరం వచ్చినప్పుడే భగవంతుడు వారికి గుర్తుకు వస్తాడు. అంటే పార్ట్ టైమ్ అన్నమాట.

వారిని అవిశ్వ యుక్తులు అంటారు. అటువంటి వారు ప్రాపంచిక విషయములలో లీనం అయి ఉన్నప్పుడు వారిలో అజ్ఞానం చేరే అవకాశం ఉంది. కాని జ్ఞాని ఫుల్ టైమ్ వర్కర్, సర్వకాల సర్వావస్థలయందు ఆత్మతో అనుసంధానమయి ఉంటారు. ఆత్మానందంలో మునిగితేలుతుంటాడు. అతడికి ఏ సమయంలో కూడా అజ్ఞానం ఆవహించే అవకాశం లేదు. అందుకే జ్ఞానిని నిత్యయుక్తుడు అని అన్నారు. 

ఇంక జ్ఞాని రెండవ లక్షణం ఏకభక్తి ఏకాగ్రత, ఒకే పరమాత్మ. రోజుకొక దేవుడిని ప్రార్ధించడు. అతని లక్ష్యం ఆత్మానందాన్ని పొందడమే. ఒక్క పరమాత్మను తప్ప వేరే ఎవరినీ పూజించదు. అదే ఏకాగ్రభక్తి, కాని 90 మందికి ఇది సాధ్యంకాదు. కొంతమందికి ధనం మీద, పదవుల మీద, అధికారము మీదా, సుఖాల మీద, వాటిని తనకు ప్రసాదించే దేవతల మీదా, భార్య సంతానము మీదా, బంధుమిత్రుల మీదా, వారి వారి అవసరానికి పనికివచ్చే దేవుళ్ల మీదా. భక్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు అవసరానికి తగ్గట్టు భక్తి మారిపోతూ ఉంటుంది. వారి మనస్సు చంచలంగా ఉంటుంది. ఎక్కడా, దేని మీదా నిలువదు, గెంతుతూ ఉంటుంది. దానిని ఏకాగ్రభక్తి అనరు. ధ్యానం చేయడానికి ఇటువంటి భక్తి పనికిరాదు. జ్ఞాని అయినవాడు పరమాత్మయంద దృష్టి పెట్టాలి. అతని దృష్టి చెదిరిపోకూదరు ఏకాగ్రంగా ఉండాలి. అందుకే జ్ఞానిని ఉత్తముడు. అని అన్నారు.

చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంది. కలియుగంలో కేవలం హరినామ స్మరణ చేస్తే చాలు, అదే భక్తి. ఇంక ఏమీ అక్కరలేదు. శ్రీహరి నామస్మరణ చేయడం, కీర్తించడం, పాటలు పాడటం, ఇదే భక్తి అనుకుంటారు. కాని ఇది భక్తికి మార్గమే కానీ ఏకాగ్రభక్తి కాదు. అంటే, అంతకు ముందు పాప జీవనం గడిపినవాడు, పాపాలు చేయడమే వృత్తిగా కలవాడు, పైన చెప్పిన పనులు చేస్తే వాడికి ఆ పాపపుపనుల నుండి మనను భగవంతుని మీదికి మళ్లుతుంది. మంచి గురువును ఆశ్రయిస్తారు. శాస్త్రములు చదువుతారు. జ్ఞానం సంపాదిస్తాడు. క్రమక్రమంగా అతడి మనసు ధ్యానం మీదికి మళ్లుతుంది. అది ఒక జన్మలో కాదు. ఎన్నో జన్మలు కావాలి. ఒక జన్మలో చేసింది మళ్లీ జన్మలో కొనసాగించాలి. దీనిని తెలుసుకోకుండా కేవలం భజనలు చేసి కీర్తనలు పాడితే మోక్షం వస్తుంది అని, అదే ఏకాగ్రభక్తి అని అనుకోవడము పొరపాటు. 

ఇటువంటి భక్తికూడా అవసరమే కానీ అది జ్ఞానికి తొలిమెట్టు మాత్రమే అందుకే పరమాత్మ ఈ శ్లోకంలో స్పష్టంగా పైన చెప్పబడిన లక్షణాలు ఇవీ.  దేవుడు వేరు, భక్తురు వేరు అనే భావన ఉన్నంత వరకు అతడు జ్ఞాని కాలేడు. నాకు పరమాత్మకు భేదం లేదు. అహం బ్రహ్మాస్మి అనే స్థితికి వస్తేకాని అతడు జ్ఞాని కాలేడు. అటువంటి జ్ఞాని, నేను నేరు కాదు. ఇద్దరం ఒకటే. అందుకే ఆ జ్ఞాని నాకు ఎంతో ఇష్టమైనవాడిగా అవుతాడు అని చెప్పాడు కృష్ణుడు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories