ఓంకార రహస్యం!!

 

అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న విశ్వంలో ఆకాశతత్వంతో నినదించిన తొలి రుక్కు, బ్రహ్మవాక్కు- ఓంకారం. అకార, ఉకార, మకారాలనే బిందు సంయుక్తంగా ఏర్పడిన మొట్టమొదటి శబ్దం.  అకారం సృష్టికి, ఉకారం పోషకత్వానికి,  మకారం లయకారకత్వానికి చిహ్నాలు.

ఈ ఓంకారం గురించి ఇంకో మాటలో చెప్పాలంటే అది  బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తత్వాన్ని నింపుకుని ఉంటుంది. 

దీన్ని చాలామంది మంత్రం అనుకుంటారు కానీ అది కేవలం ఓ మంత్రం కాదు. అన్ని మంత్రాలకూ అదే బలం, జీవం, శక్తిరూపం. మంత్రాలకు పరిపుష్టినిచ్చేది, రక్షణ కల్పించేది ఓంకారం. ఓం అనేది ఒక మతానికి సంబంధించినది కాదు.  నిత్యమూ యోగులు, మహర్షులు జపించేది, మోక్షదాయకమైనది ఓంకారం అని వేదం ప్రకటించింది. ప్రతి నిత్యం 21 మార్లు ఓంకారం జపించడం వల్ల, మనిషి శరీరంలోని 21 తత్వాలు అంటే, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కోశాలు, పంచ ప్రాణాలు, మనసు ఉత్తేజితమవుతాయని యోగ శాస్త్రం చెబుతోంది.

వేదాలు, ఉపనిషత్తులు, ఇతర పురాణాలు. వీటిన్నింటికీ ఓంకార సాధనే మూలాధారం. ఓంకార శబ్దాన్ని మొదట చిన్న శ్రుతిలో మొదలుపెట్టి, తారస్థాయికి చేర్చి, చివరకు హం అనే శబ్దంతో ముగించాలి. నాభి నుంచి శబ్దాన్ని ప్రారంభించి, గొంతులో కొనసాగించి, పెదవులతో ముగించాలని యోగశాస్త్రంలోని 'ఓంకారోపాసన' తెలియజేస్తుంది.

 ఓంకార శబ్దసాధనకు, సంగీత సాధనకు దగ్గరి సంబంధం ఉంది. మంద్రస్థాయి, తారస్థాయి రెండూ సంగీత శ్రుతిలో మేళవించి ఉన్నట్లే, ఓంకార నాదమూ ఉంటుంది. అది లయబద్ధంగా సాగినప్పుడు, వ్యాధుల నుంచి ఉపశమనంతో పాటు శరీరానికి జవసత్వాలు లభిస్తాయని చెబుతారు. అలాగే మనిషి సత్వ, రజో, తమో గుణాలతో ఉంటాడు.  అలాంటి మనిషి అతిశయం, అహంకారం కమ్ముకుని విచక్షణకు దూరమైనపుడు పూర్తిగా సత్వగుణంలోకి మనసును నడిపించి సత్య ధర్మ శాంతి ప్రేమలను అందజేసే ఔషధంగా  ఓంకారం పనిచేస్తుంది.

సత్యాన్వేషణలో మనిషికి సహకరించేది, ఆధ్యాత్మిక చింతన వైపు అతణ్ని మళ్లించేది, 

 ఆవేశాన్ని అణచి అహింసా మార్గం వైపు నడిపించేది ఓంకారోపాసన.  దీనికి ఒక ఉదాహరణ.

సీతను రావణుడు అపహరించడంతో, శ్రీరామచంద్రుడు ఎంతో  దుఃఖ పడ్డాడు. ఆమె జాడ కనుగొనే ప్రయత్నంలో, సుగ్రీవుడితో స్నేహం చేశాడు. తరువాత సీతాన్వేషణకు ఆంజనేయుణ్ని దక్షిణ దిక్కు వైపు పంపించాడు. శత యోజనాల సముద్రాన్ని లంఘించడానికి సిద్ధమయ్యాడు ఆంజనేయుడు. మహేంద్ర పర్వతం మీద నుంచి ఎగరడానికి ఆయన సన్నద్ధమైన తీరు ఓంకార తత్వాన్ని తెలియజేస్తుంది.  ఆకాశమార్గాన వెళ్లాలని నిశ్చయించుకొన్న ఆంజనేయస్వామి ఊపిరి దీర్ఘంగా పీల్చి వదులుతూ కొంతసేపు ప్రాణాయామ స్థితిలో ఉన్నాడు.  ఒక్కసారిగా శక్తినంతా కూడదీసుకొన్న తరువాత, ప్రణవనాదం(ఓం శబ్దం)తో కుప్పించి ఆకాశవీధిలోకి ఎగిరాడని సుందరకాండ తెలియజేస్తుంది.  అంటే బలశాలి అయిన హనుమంతుడి శక్తిని అన్ని రెంట్లు చేయడం వెనుక ఉన్న రహస్యం ఓంకారమే. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తుల పునరుద్ధరణకు, మంత్ర జపాన్ని నిర్విఘ్నంగా కొనసాగించేందుకు, ఆత్మశక్తితో జీవిత లక్ష్యాన్ని సాధించేందుకు అనువైన సాధన ఓంకారం అని సందేహం లేకుండా చెప్పవచ్చు.

యోగులు సంకల్పాలను నెరవేర్చుకొనే క్రియగానూ సకల మంత్రాలకు ప్రాణాన్ని చేకూర్చేదిగానూ చెప్పుకునే ఈ ఓంకార సాధన అందరూ చేయడం వల్ల అందరికీ ఆరోగ్యం, ఆనందం రెండూ లభిస్తాయి. సమస్యల నుండి ముక్తి లభిస్తుంది.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories