అమ్మవారి రూపం భక్తులకు ఎప్పుడు కనిపిస్తుందో తెలుసా?


అమ్మ వారి వైభవం నాలుగు రకాలుగా ఉన్నట్టే.. అమ్మవారి   సౌందర్యం కూడా నాలుగు రకాలు. రూపంలో నాలుగు రకాలు. ఒకటి స్థూల సౌందర్యం అది మనం చూసే స్వరూపం. ఆ స్వరూపం తలచుకుంటే చాలు, ఆనందం  లభిస్తుంది. అందుకే ధ్యానం చేస్తాం. ఎర్రని కాంతులతో, విశాలమైన నేత్రాలతో, మందహాస వదనంతో, నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలూ ధరించి ఆసనంపై కూర్చుని  గోచరిస్తున్న కామాక్షీ స్వరూపం 'స్థూల సౌందర్యం'. దీని వెనుక సూక్ష్మ సౌందర్యం ఉంటుంది. 'సూక్ష్మ సౌందర్యం' తరువాత 'సూక్ష్మతర సౌందర్యం', ఆ తరువాత 'సూక్ష్మతమ సౌందర్యం' అని మొత్తం నాలుగు రకాలు. 


ఈ స్థూల సౌందర్య వర్ణనలో అమ్మ వారి రూపాన్ని ధ్యానిస్తే మరొక అంతరార్థం కనిపిస్తుంది. శంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిలో అమ్మ వారి శిరస్సు మొదలుకుని పాదం వరకూ వర్ణించారు.  ధ్యానించే ముందు అమ్మ వారి స్వరూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. భండాసురుడు ఈ ప్రపంచాన్ని క్షోభ పెడుతుంటే దేవతలందరూ వెళ్ళి పరమశివుణ్ణి ఆశ్రయించారట. పరమశివుడు తన దృగగ్ని నుంచి ఒక అగ్నిహోత్రాన్ని రగిల్చి మీరు మీ మీ శక్తులన్నిటినీ ఇందులో ఆహుతి వెయ్యండి అన్నారు. వెంటనే దేవతలు తమను తాము అందులో వేశారట. అలా వేసేస్తే అప్పుడు అందులో నుంచి పుట్టిందట అమ్మ వారు. అంటే దేవతలు తమ అహంకారాన్ని ఈశ్వరార్పణం చేశారు. సర్వవ్యాపిణి అయిన ఆ శక్తి అందులో నుంచి వచ్చిందట. 


దేవతలందరి శక్తులూ ఆ తల్లిలో ఉన్నాయట. అంటే దేవతలందరూ ఇచ్చిన శరీరంతో అమ్మ వచ్చింది అని కాదు, ఆ అమ్మ ఇచ్చిన శక్తితో దేవతలందరూ బ్రతుకుతున్నారు. అది ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడు అమ్మ ఏకంగా కనపడింది. విడివిడిగా చూస్తే తెలియదు. ఏకంగా చూస్తే కనపడింది. అది ఎందులో నుంచి అంటే చిదగ్నికుండం... జ్ఞానాగ్ని కుండం. మనలో జ్ఞానాగ్ని రగిలితే అందులో మన అహంకారం ఆహుతి అయితే అప్పుడు అమ్మ కనిపిస్తుంది. 


                                           *నిశ్శబ్ద.
 


More Purana Patralu - Mythological Stories