శక్తివంతమైన బిల్వపత్రం!!

 

సాధారణంగా శివాలయాల్లో ఎక్కడైనా శివుడిని పూజించే సమయంలో తప్పనిసరిగా ఉండేది బిల్వపత్రం. మూడు ఆకులు కలసి ఒక బిల్వదళంగా ఉంటాయి. అలాంటి ఆకులతోనే శివుడిని పూజిస్తారు కూడా. త్రినేత్రుడు అయిన శివుడికి ఎంతో ఇష్టమైనది మరియు ఆ శివుడు నివాసం ఉండేది అయిన బిల్వవృక్షం ఎంతో శక్తిమంతమైనది. బిల్వపత్రాలతో శివుడి పూజ అన్ని పూజలకంటే ఎంతో ఉత్తమమైనది మరియు ఎంతో గొప్ప ఫలితాలను ఇస్తుంది. 

ముండ్లు కలిగి ఉండి, వెలగపండు మాదిరిగా కాయలు కాసే ఈ బిల్వవృక్షం ఆయుర్వేదపరంగా ఎంతో మహిమాన్వితమైనది. అనేక రకాల ఔషధాల తయారీలోనూ మరియు నేరుగా ఔషధంగానూ ఈ బిల్వవృక్షం యొక్క సమూలన్ని అంటే వేరు నుండి ఆకులు, కాయలు, చెట్టు మొత్తం కూడా ఉపయోగిస్తారు. ఇకపోతే ప్రస్తుతం చెప్పుకుంటున్న శివారాధనలో బిల్వపత్రి గురించి విశ్లేషిస్తే లక్ష్మీదేవి తపస్సు చేయడం వల్ల పుట్టినది బిల్వవృక్షం. అందుకే లక్ష్మీ దేవి ఎప్పుడూ బిలవృక్షంలో నివాసం ఉంటుందని అంటారు.  ఇకపోతే ఈ మూడు ఆకులు కలిపి బిల్వదళంగా పేర్కొనే వాటిని మనిషిలో ఉండే సత్త్వ, రజో, తమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు. అంటే ఈ బిల్వ దళాన్ని ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర ఉంచడం అంటే మనిషిలోని ఆ మూడు గుణాలను ఆయన ముందు వదలడం. ఈ మూడు గుణాల చర్యలే మనిషిని నడిపిస్తున్నపుడు ఆ మూడింటిని ఆయన దగ్గర ధారపోసి వాటిని సరిచేసుకోవడమనే కోణంలో కూడా సారాంశం వస్తుంది.

ఇక సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే గ్రహాలలోకెళ్లా శక్తివంతమైన శనిదేవుడికి ఒక వరం ఇచ్చాడు. బిల్వవృక్షంలో తనను పట్టివుంచినందుకు కానూ ఆయన్ను శనీశ్వరుడిగా మార్చాడు. అంతేకాదు బిల్వపత్రి దళాలతో ఆ శివుడిని పూజించేవారికి శనిదేవుడి తాలూకూ బాధలు ఉండవని కూడా చెప్పాడు. అందుకే శని దోషం ఉందని ఎవరికైనా అనిపిస్తే నీళ్లు, బిల్వపత్రాలు, విభూతి ఇట్లా అన్నిటినీ మేళవించి రుద్రాభిషేకాన్ని జరిపిస్తారు. లేదంటే శివుడికి బిల్వపత్రార్చన జరుపుతారు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఈ సృష్టిలోని సకల లోకాలలోని పుణ్యక్షేత్రాలు అన్ని కూడా కేవలం బిల్వవృక్షంలో ఉంటాయని అంటే అన్ని పుణ్యాక్షత్రాలు, అంతమంది దేవుళ్ళ స్వరూపాలతో బిల్వవృక్షం సమానమని చెబుతారు. 

వంశం అభివృద్ధి చెందకుండా ఉన్నపుడు బిల్వవృక్షం యొక్క మూలన్ని గంధం, పుష్పాలు, అక్షింతలతో పూజిస్తే వారి వంశం అభివృద్హి చెందుతుంది.

బిల్వవృక్షం చుట్టూ దీపాలు పెడితే అలా దీపాలు పెట్టినవాళ్లకు ఆ పరమేశ్వరుడి కృప దక్కుతుంది. ఆ శివజ్ఞానం సిద్ధిస్తుంది.

బిల్వవృక్షం మొదలులో ఎవరికైనా భోజనం పెడితే కోటిమందికి అన్నదానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని పురాణకథనాలు.

అలాగే బిల్వచెట్టు దగ్గర ఎవరైనా శివభక్తుడికి నెయ్యి, పాలన్నము దానం చేస్తే అలా దానం చేసిన వారికి దరిద్రం తొలగిపోయి ఆర్థికసమస్యలు, మానసిక, శారీరక సమస్యలు తీరుతాయి.

ఇక చివరగా చెప్పుకునేది ఏమిటంటే బిల్వపత్రిని శివలింగం దగ్గర ఉంచి ఆ బిల్వపత్రిని తిరిగి తీసుకుని తమదగ్గరే జేబులోనో లేక ఏవిధంగా అయినా తమవెంట ఉంచుకుంటే ఎన్నో మార్పులు జరుగుతాయి. వాటన్నిటినీ నేరుగా అనుభూతి చెందగలుగుతారు కూడా. బిల్వపత్రి ఆ శివస్వభావానికి దగ్గరగా ఉంటుంది అందుకే ఈ మార్పు. కాబట్టి వీలైనవారు ఈ కార్తీకమాసంలో  ఆ శివుడికి బిల్వపత్రార్చన చేసి సమస్యల నుండి గట్టెక్కవచ్చు.

◆వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories