వాల్మీకి సౌరభం!!

ఆధికావ్యం ఏది అంటే రామాయణం అని అందరూ చెబుతారు. రామాయణాన్ని రచించిన వాల్మికి మహర్షిని ఆదికవిగా చెప్పుకుంటారు. ఆదికవి వాల్మికి గురించి ఎన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన తన రచనలలో ఎక్కడా ఎప్పుడూ తన గురించి తాను చెప్పుకోకపోవడం వల్ల ఆయన గురించి విభిన్న కథనాలు చెబుతుంటారు.

అయితే ప్రచేతసుడి కొడుకు అని, వరుణుడి కొడుకు అని రామాయణం ద్వారా తెలుస్తుంది. బ్రహ్మ  కొడుకని ఉత్తర రామాయణం చెబుతోంది. బ్రహ్మ శాపం వల్ల బోయవాడిగా పుట్టాడని ఒక కథనం ఉంది.

బ్రహ్మ ఒకసారి ఇంద్ర సభకు వెళ్ళినపుడు అక్కడ అప్సరసలను చూసి చలించిపోతాడు. ఆయన చూపులు ఎంతో ప్రభావవంతంగా ప్రయాణం చేసి అవి వెళ్లి బురదలో పడతాయి. అందులో నుండి ప్రచేతసుడు పుడతాడు. అయితే సభ మధ్యలో తన జన్మ వృత్తంతం గురించి ప్రచేతసుడు చెప్పగా బ్రహ్మకు కోపం వచ్చి నువ్వు బోయవాడిగా పుట్టి భార్య పిల్లలతో ఎంతో ఘోరమైన జీవితాన్ని గడుపుతావు అని శాపం పెడతాడు.

అలా బోయవాడిగా పుట్టినప్పుడు ప్రచేతసుడికి పుట్టిన వాడే ఈయన. అయితే ఈయన కాలానుక్రమంగా బోయవాడిగా పెరిగి భార్యా పిల్లలతో కలసి ఉంటూ, దారి దోపిడీలు చేస్తూ ఎంతో ఘోరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకసారి దారిలో ఎవరైనా వస్తే దోచుకోవాలని కాపుకాసి  ఉన్నపుడు సప్తఋషులు అటుగా వస్తారు. వాళ్ళను చూసి వాళ్ళ దగ్గర ఏముందో దోచుకోవాలని చూస్తాడు. అయితే వాళ్ళు ఆయన్ను చూసి నువ్వు ఇన్ని పాపపు పనులు చేస్తున్నావు కదా వాటిని నీ భార్య పిల్లలు కూడా పంచుకుంటారా?? అడిగి చూడు అని చెబుతారు.

వాళ్ళు చెప్పినట్టే వాల్మికి వెళ్లి భార్యను, పిల్లలని అడగగా వాళ్ళు అందుకు ఒప్పుకోరు.  ఈ పాపాల్ని భార్య, పిల్లలు పంచుకోకుండా కేవలం అవసరాలకోసం, సంతోషాల కోసమే జీవితం కావాలని అనుకునేట్టు అయితే ఎందుకు ఈ పనులన్నీ చేయడం అని బాధపడతాడు. తరువాత అదే సప్తఋషుల కాళ్ళ మీద పడతాడు. అపుడు వాళ్ళు రామనామం జపించమని చెప్పి వెళ్ళిపోతాడు. 

కానీ రామ అనే పదాన్ని సరిగ్గా వినకుండా కొన్ని సంవత్సరాల పాటు మరామరా అని తపస్సు చేస్తూ కూర్చుండిపోతాడు. ఎంతగా అంటే అతని చుట్టూ పుట్ట కట్టుకుపోయేంతగా. అప్పుడే నారదుడు వచ్చి పుట్టలో నుండి బయటపడ్డ వాడు కాబట్టి వాల్మికి అని సంభోదించి, రామనామాన్ని జపించమని చెప్పి వెళ్తాడు. అప్పటి నుండి రామనామాన్ని జపిస్తూ బ్రహ్మ వల్ల రాముడి జన్మ వృత్తాంతం, గత, భవిష్యత్తు విషయాలు అన్ని తెలుసుకుని వాటిని గ్రంధస్తం చేస్తాడు. అలా వాల్మికి మహర్షి రామాయణాన్ని మలిచాడు.

వాల్మికి మహర్షిని ఆయన జీవితాన్ని తెలుసుకోవడం వల్ల అర్థం చేసుకోవలసింది ఒకటే. ఎంతటి వాడైనా జీవితంలో ఎలాంటి స్థాయిలో ఉన్న వాడైనా గొప్పవాడు కాగలడు, అధమ స్థితిలోకి జారిపొగలడు. కాబట్టి ప్రతి ఒక్కరు నైతికంగా జీవించడం ముఖ్యం. అంతే కాదు వేళా సంవత్సరాల కాలం గడిచినా రామాయణం నిత్యనూతనం అనిపించేలా అందరూ తమ జీవితాలలో ఆచరణకు ఉపయోగించుకునేలా తీర్చిదిద్దినా ఎక్కడా తన గురించి తాను చెప్పుకోకుండా ఎదిగేకొద్ది ఒదిగి ఉండాలనే విషయాన్ని పరోక్షంగా తెలుసుకున్నట్టే అనిపిస్తుంది.

ఇక రామాయణం కేవలం రాముడి జీవితం కాదు, ఆ పుణ్య పురుషుడిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గ కావ్యం. కాబట్టి రామాయణాన్ని చదవండి, పిల్లల చేత చదివించండి, వారికి ఆర్త్మయ్యేలాగా చెప్పండి. వాల్మికి మహర్షి జీవితాన్ని కూడా తెలియజేయండి. ఇలాంటి గొప్ప మహర్షుల విషయంలో మనం ఋణం తీర్చుకునే మార్గం ఇదొక్కటే!!

◆ వెంకటేష్ పువ్వాడ


More Festivals