ఏకేశ్వరోపాసనుడు గురునానక్!! 

 

ఏకేశ్వరోపాసన అంటే దేవుడు ఒక్కటే అని నమ్మడం, నమ్మినధాన్ని ఆచరిస్తూ ఉండటం. గురునానక్ అవలంభించినదీ అదే. ప్రసంచ ఆధ్యాత్మిక పరంపరలో ఎన్నో మతాలు పుట్టుకొచ్చాయి. ప్రతి మతానికి వెనుక ఆయా మతాన్ని స్థాపించిన వారి ఆలోచనలు,  వారి నమ్మకాలు ఉంటాయి. గురునానక్ కూడా అలాంటి నమ్మకాలతోనే సిక్కు మతాన్ని స్థాపించాడు. ఈయన అప్పటికే ఉన్న హిందూ, ఇస్లాం పవిత్ర మత గ్రంథాలను చదివి వాటి సారాన్ని అర్థం చేసుకుని వాటికి అతీతంగా, మతసామరస్యాన్ని చాటాలనే ఉద్దేశ్యంతో  ఏకేశ్వరోపాసన సిద్ధాంతాన్ని చాటిచెబుతూ తన ఆలోచనలను ఉపదేశాలుగా అందరికీ అందించడం మొదలుపెట్టాడు.

ప్రతీ ఆధ్యాత్మిక వేత్తలో కొన్ని ప్రత్యేక లక్షణాలు, ఆ భగవంతుడి కృపకు అర్హులైనట్టు కొన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. గురునానక్ చిన్నతనంలో నుండి ఇలాంటి అద్భుతం జరిగేది. ఆయనలో వెలిగే జ్యోతి కనిపించెదని, అది ఆయన అక్క చూసేవారని చరిత్రలో లిఖితమై ఉంది. ఆయన అక్కనే ఆయన మొదటి శిష్యురాలు కూడా. 

ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయన నదీస్నానానికి వెళ్లి మూడురోజుల పాటు అదృశ్యమయ్యి ఆ తరువాత తిరిగి వచ్చాకే మతసామరస్యత గురించి మాట్లాడేవాడు. వేలాది కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణం చేస్తూ  భగవంతుడి  సందేశాన్ని భోధించేవాడు.  ఇలా ఆయన నాలుగు దిశలలో నాలుగు ప్రత్యేకమైన ప్రయాణాలు చేశారు. వాటినే ఉదాసీలు అని అంటారు. 

గురునానక్ జీవితం గురించి చెప్పుకుంటే ఎంత నిరాడంబరత అనిపించక మానదు. ఆయన తన జీవితంలో సుఖభోగాలకు దూరంగా ఉన్నారు. ఎప్పుడూ కూడా విలాసవంతమైన జీవితంలో ఆయన్ను ఎవరూ చూడలేదు. ఆయన ఎప్పుడూ ఏడో ఒక పని చేసుకుంటూ కడుపు నింపుకునేవారు. ముఖ్యంగా ఆయన చివరిరోజుల్లో తాను ఒక మత స్థాపకుడిని అనే ఆలోచన కూడా లేకుండా ఉచితప్రసాదం వితరణ చేసే కర్తార్ పూర్ లో జీవించారు. అక్కడ వాళ్ళు పెట్టె ప్రసాదంతోనే ఆయన తృప్తి పడేవాడు. అంతేకాదు తనకు పెట్టిన ప్రసాదం మరికొందరికి పంచేవాడు.  ఆకలికి అల్లాడే ఎందరో అక్కడ గురునానక్ తో పాటు ఉండేవారు. ఆయన వాళ్ళందరి దగ్గరా ఎలాంటి కుల, మత బేధాలు లేకుండా, ధనికులు, పేదవారు అనే వ్యత్యాసం చూపించకుండా అందరి దగ్గర ఓకేవిధంగా ఉండేవారు. అలా నిరాడంబర జీవితాన్ని గడిపిన గురునానక్ తన 70వ సంవత్సరంలో మరణించి, ఈ లోకానికి ఏకేశ్వరోపాసన విధానాన్ని వదిలివెళ్లారు. 

ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆయన జీవించిన కాలం. 1469 సంవత్సరంలో పుట్టి, 1539 సంవత్సరంలో మరణించిన ఈయన. ఆ కాలంలోనే మత సామరస్యత కోసం కృషిచేసిన మహనీయుడు. ప్రతీ మనిషి తన జీవితంలో తెలుసుకోవలసిన, ఆచరించవలసింది ఒకటే మతాలను, కులాలను కాకుండా మనిషి ఒకే మార్గంలో ప్రయాణం చేయాలని. అదే విషయాన్ని గురునానక్ ఈ లోకానికి చాటి చెప్పాలని ప్రయత్నం చేసాడు.

ఈ ప్రపంచంలో ఉన్న మతాలలో ఎంతో చిన్నదైన ఈ సిక్కు మతం తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గురునానక్ భోధనలకు  ప్రభావితమైన ఎంతోమంది ఆయనకు అనుచరులుగా మారి మతాన్ని విస్తృతం చేయడానికి కృషి చేసారు. వారి ఆది గ్రంధ్ సాక్షిగా వారి ప్రత్యేకత, వారి ఉపదేశాలు నేటికీ సజీవంగా ఉన్నాయి. భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ఈ సిక్కు మతాన్ని ఎక్కువగా చూడచ్చు.

◆ వెంకటేష్ పువ్వాడ


More Festivals