కంసుడు బలితీసుకున్న దేవకీ పుత్రులు ఎవరు?వారి వృత్తాంతం ఏంటంటే!


ఒకసారి శ్రీకృష్ణబలరాములు ద్వారావతిలో వున్న సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది. అలాంటిది  సామాన్యంగా యుగాంతాన, ప్రళయ కాలాన మాత్రమే సంభవిస్తుందన్న విశ్వాసం  వాళ్ల  ప్రజలు భయపడిపోయి కురుక్షేత్రంలోని శ్యమంతపంచకానికి చేరుకున్నారు.

పరశు రాముడు మదోన్మత్తులైన రాక్షసులను సంహరించిన సందర్భంలో వారి రుధిరంతో ఏర్పడిన మడుగులు ఐదింటికీ శ్యమంతపంచకమని పేరు. క్షత్రియులను సంహరించి, నేలతల్లిని రుధిరప్లావితం చేసిన పాతకాన్ని తొలగించుకునేందుకు పరశురాముడు అక్కడే ఒక మహాయాగాన్ని కూడా చేశాడు. ఆ యాగానికి యాదవులందరూ తరలివెళ్ళారు.

మత్స్య, కోసల, విదర్భ, కురు, సృంజయ, కాంభోజ, కేకయ, మద్ర, కుంతి, ఆవర్త, కేరళ దేశాధీశు లెందరో అక్కడ సమావేశమైనారు. వాళ్ళందరూ శ్రీకృష్ణుని సందర్శించి, సత్కరించారు. శ్రీకృష్ణ బలరాములు కూడా వాళ్ళను యథోచితంగా గౌరవించారు. అప్పుడు వాళ్ళందరూ ఉగ్రసేనుడి దగ్గరకు వెళ్ళి 'మహారాజా! ప్రపంచంలోని మానవులందరిలోకీ యాదవులు మాత్రమే ధన్యులు. వారి జన్మలే పవిత్రమైనవి. శ్రీకృష్ణుడు అన్ని వేళలా వారి మధ్యే వుంటాడు. వాళ్ళని కంటికి రెప్పలా కాపాడతాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే. ఆయనను దర్శించటం యోగులకే శక్యం కాదు. అలాంటిది యాదవులు పిలిస్తే పలుకుతాడు. ఆయనను మీ మధ్య నిలుపుకుని నిర్విచారంగా జీవిస్తున్న మీరు చాలా అదృష్టవంతులు' అని పలువిధాల నల్లనయ్యను ప్రశంసించారు.


యశోదానందులకు, దేవకీవసుదేవులకు వారు ప్రణమిల్లారు. బిడ్డల గొప్పతనానికి మురిసిపోయి తల్లిదండ్రులు బలరామకృష్ణులను గుండెలకు హత్తుకున్నారు. దేవకీదేవి బలరామకృష్ణులను దగ్గరకు పిలిచి 'నాయనలారా! మిమ్మల్ని పొగడాలో, పొగడకుండా నా ఆనందాన్నంతా ఈ గుప్పెడు గుండెలో ప్రోది చేసుకోవాలో, మీకు నమస్కరించవచ్చో, లేక బిడ్డలకి చెయ్యకూడదో, మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలో లేక దూరం నుంచి దర్శించి. కన్నులపండుగ చేసుకోవాలో తెలియటంలేదు. 'మీరు ఏమనుకోకపోతే ఒకే ఒక కోరిక కోరుతాను. మీరిద్దరూ మరణించిన మీ గురుపుత్రుని తీసుకువచ్చిన విధంగానే, కంసుడు పొట్టన పెట్టుకున్న నా బిడ్డల్ని కూడా ఒక్కసారి తెచ్చి చూపండి' అని భోరున ఏడ్చింది.


బలరామకృష్ణులు ఆమెను ఓదార్చి యోగమాయా ప్రభావంతో వెంటనే సుతలానికి వెళ్ళారు. రాక్షసేశ్వరుడు బలి వాళ్ళకు ఘనంగా స్వాగతం చెప్పాడు. భక్తిపూర్వకంగా వాళ్ళని అర్చించి కానుకలు సమర్పించాడు. బలరామకృష్ణులు అమితానందం పొందారు.


'బలీ! పూర్వం స్వాయంభువ మన్వంతరంలో మరీచికి 'ఊర్ణ' అనే ఒక భార్య ఉండేది. ఆ దంపతులకు స్మరుడు, ఉద్గదుడు, పరిష్వంగుడు, పతంగుడు, క్షుద్రభువు, ఘృణి అనే ఆరుగురు కుమారులుండేవారు. వాళ్ళందరూ దేవతలే.


వాళ్ళు ఒకసారి బ్రహ్మదేవుని ఎగతాళి చేసి పరిహాసంగా మాట్లాడారు. అందువల్ల వాళ్ళను రాక్షసులై పుట్టమని ఆయన శపించాడు, అలా శపించబడ్డ ఆ ఆరుగురూ హిరణ్యకశిపుడికి జన్మించాల్సింది. కాని, యోగమాయా ప్రభావం వలన వాళ్ళు దేవకీదేవికి పుట్టారు. పుట్టిన వెంటనే వాళ్ళను కంసుడు సంహరించాడు. ఆ ఆరుగురూ ఇప్పుడు నీ దగ్గర వున్నారు. మా తల్లి దేవకీదేవి వాళ్ళను చూడాలనుకుంటోంది. ఆమె కోరికను తీర్చటంకోసం మేము ఇక్కడికి వచ్చాం. వాళ్ళు మావెంట వస్తే వాళ్ళకు శాపవిముక్తి కలుగుతుంది. వాళ్ళు తిరిగి వాళ్ళ నిజవాసం చేరుకుంటారు' అని చెప్పారు.


బలి వెంటనే వాళ్ళను బలరామకృష్ణులకు అప్పగించాడు. వాళ్ళను బలరామకృష్ణులు తమ తల్లికి చూపించి ఆమెకు ఆనందం కలిగించారు. ఆ ఆరుగురూ శ్రీకృష్ణుని స్పృశించి తమ పాపాల్ని తొలగించుకున్నారు. చతుర్ముఖుని శాపం నుంచి విముక్తి పొందారు.


ఏనాడో మరణించిన తన కుమారులు తన సముఖానికి రావడం, వెంటనే తిరిగి వెళ్ళిపోవడం దేవకిదేవికి ఆశ్చర్యం కలిగించింది. అదంతా శ్రీకృష్ణుని లీల అని గ్రహించి పరవశించిపోయింది.


                                        *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories